Tech10: పేజెస్‌ కొత్తగా.. మడత ‘మిక్స్‌’
close

Updated : 17/03/2021 19:53 IST

Tech10: పేజెస్‌ కొత్తగా.. మడత ‘మిక్స్‌’

1. మైనర్లకు మెసేజ్‌లు పంపకుండా...

మైనర్ల ఖాతాలకు మరింత రక్షణ, ప్రైవసీ కల్పించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య వయసు ఉన్న (అడల్ట్‌) ఖాతాదారుల నుంచి మైనర్లకు మెసేజ్‌ చేసే విధానంలో కొన్ని మార్పులు చేసింది. దీనివల్ల వారి అకౌంట్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ చేసి వేధించే వారికి అడ్డుకట్ట వేయొచ్చని ఇన్‌స్టాగ్రామ్‌ టీమ్‌ చెబుతోంది. మైనర్లు తమకు తెలియని వ్యక్తుల మెసేజ్‌లు, అందులోనూ అడల్ట్స్‌ నుంచి ఆ మెసేజ్‌ వస్తే... ముందుగానే ఓ వార్నింగ్‌ మెసేజ్‌ చూపించబోతోంది. అది చూసి.. ఎవరితో ఛాటింగ్‌ చేస్తున్నామనేది మైనర్లు చెక్‌ చేసుకునేలా ఆ ఫీచర్‌ రూపొందించారు. త్వరలో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వస్తుంది. 

2. వన్‌ప్లస్‌ 9 ప్రో ఫీచర్ల ఇవేనా

వన్‌ప్లస్‌ నుంచి ఈ నెల 23న ‘9 సిరీస్‌’ మొబైల్స్‌ రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్‌ 9 ప్రో ఫీచర్లు ఇవేనంటూ కొన్ని వార్తలు అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటి ప్రకారం... వన్‌ప్లస్‌ 9 ప్రో 6.7 అంగుళాల తాకేతెరతో రాబోతోంది. 120 హెర్జ్‌ డిస్‌ప్లే ఇస్తారు. ఇది 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఇస్తుంది. హెచ్‌డీఆర్‌ 10 ప్లస్‌ సాంకేతికత ఉంటుంది. ఈ మొబైల్‌లో డిస్‌ప్లే క్వాడ్‌ హెచ్‌డీప్లస్‌ ఎల్‌టీపీవో అని తెలుస్తోంది. అదే వన్‌ప్లస్‌ 9లో అయితే 6.55 అంగుళాల స్క్రీన్‌ ఉండబోతోందట. 

3. ఆండ్రాయిడ్‌ టీవీల్లోకి జియో బ్రౌజర్‌

ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌, జియో ఫైబర్‌ సెట్‌టాప్‌ బాక్స్‌లో ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న జియో పేజెస్‌ బ్రౌజర్‌.. ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్‌ టీవీల్లోకి అందుబాటులోకి వచ్చేసింది. దీంతోపాటు కొన్ని ఫీచర్లను కూడా యాప్‌లో ప్రవేశపెట్టారు. ప్రైవేట్‌ మోడ్‌, ఎంపిక చేసిన వీడియోలు లాంటి సరికొత్త ఫీచర్ల ఇప్పుడు జియో బ్రౌజర్‌లో ఉన్నాయి. ఈ బ్రౌజర్‌ను టీవీల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు జియో చెబుతోంది. ఇందులో ఎనిమిది ప్రాంతీయ భాషల్లో 10 వేలకుపైగా ఎంపిక చేసిన వీడియోలు ఉన్నాయట. దీంతోపాటు వార్తలు కూడా అందిస్తున్నారు.

4. ఒప్పో రెనో సిరీస్‌లో కొత్తగా

ఒప్పో రెనో సిరీస్‌లో భాగంగా ఇటీవల కెన్యాలో రెనో5 లాంచ్‌ అయ్యింది. అదే రోజు వేదిక మీద రెనో 5ఎఫ్‌ను కూడా ప్రకటించారు. అయితే ఆ రోజు ఆ మొబైల్‌ వివరాలు పూర్తిగా వెల్లడించలేదు. అయితే ఈ రోజు ఆ మొబైల్‌ అక్కడి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. రెనో 5ఎఫ్‌లో 6.43 అంగుళాల ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 60 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఇస్తున్నారు. 135 టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ఉంటుుంది. గేమింగ్‌ మోడ్‌లోకి వెళ్తే ఈ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ 180 హెర్జ్‌ ఉంటుందట. వెనుకవైపు 48 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. ఇవి కాకుండా మరో మూడు కెమెరాలు ఉంటాయి. ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. మీడియాటెక్‌ హీలియో పీ95 ప్రాసెసర్‌ ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉంటుంది. 4,310 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 30 వాట్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జ్‌కి సపోర్టు చేస్తుంది. ఈ మొబైల్‌ త్వరలో మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. 

5. ఆ క్రోమ్‌ బ్రౌజర్‌ అందరికీ రాదు

బ్రౌజర్‌లో కీలకమైన మార్పులు చేసి 89వ వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు గూగుల్‌  క్రోమ్‌ ఇటీవల ప్రకటించింది. ఫీచర్లు భలే ఉన్నాయ్‌.. వాడేద్దాం అనుకునేవాళ్లకు షాక్‌ ఇచ్చింది క్రోమ్‌. తమ లేటెస్ట్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ కొన్ని మొబైల్స్‌లోనే పని చేస్తుందని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తూ... 8 జీబీ  ర్యామ్‌ ఉన్న మొబైల్స్‌లో మాత్రమే పని చేస్తుందట. 64 బిట్‌ సాంకేతికతతో కొత్త క్రోమ్‌ బ్రౌజర్‌ను రూపొందించడమే దీనికి కారణమని తెలుస్తోంది. 

6. కొత్త రియల్‌మీ C ఫోన్‌

రియల్‌మీ నుంచి బడ్జెట్‌ ధరలో మరో కొత్త మొబైల్‌ అంతర్జాతీయ మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ నెల 23న సీ25ను లాంచ్‌ చేయబోతున్నారు. వాటర్‌ గ్రే, వాటర్‌ బ్లూ రంగుల్లో లభ్యమవనున్న ఈ మొబైల్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటాయి. మీడియాటెక్‌ హీలియో జీ70 ప్రాససెసర్‌తో పని చేస్తుంది. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. అందులో 48 ఎంపీ ప్రధాన కెమెరా. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 11 ఆవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఇస్తున్నారు. 

7. ఆసుస్‌ ఆర్‌వోజీ ల్యాపీలు

రిపబ్లిక్‌‌ ఆఫ్‌ గేమర్స్‌ (ఆర్‌వోజీ) సిరీస్‌లో ఆసుస్‌ మొబైల్స్‌ తీసుకొస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్‌లో స్ట్రిక్స్‌ పేరుతో ఆర్‌వోజీ  ల్యాప్‌టాప్‌లను లాంచ్‌ చేసింది. ఇప్పుడవి మన మార్కెట్‌లోకి కూడా వచ్చాయి. మన దేశంలోకి వచ్చిన ల్యాపీల్లో స్ట్రిక్స్‌ జీ15, స్ట్రిక్స్‌ జీ17, స్ట్రిక్స్‌ స్కార్‌ జీ15, స్ట్రిక్స్‌ స్కార్‌ జీ17, టఫ్‌ ఏ15 ఉన్నాయి. వీటితోపాటు స్ట్రిక్స్‌ జీఏ35 డెస్క్‌టాప్‌ను కూడా లాంచ్‌ చేశారు. వీటిలో ఏఎండీ రైజెన్‌ 5000 సిరీస్‌ ప్రాసెసర్లు వినియోగించారు. 

8. నాలుగో బ్లాక్‌షార్క్‌లో ‘పెద్ద’ కెమెరా

మార్చి 23న లాంచ్‌ కాబోతున్న ఫోన్లలో... గేమింగ్ స్పెషల్‌ బ్లాక్‌ షార్క్‌ నుంచి కూడా కొన్ని మొబైల్‌ ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్‌ షార్క్‌ సిరీస్‌లో నాలుగో మొబైల్‌ను ఆ రోజు తీసుకొస్తున్నారు. తొలుత చైనాలో లాంచ్‌ కానున్న ఈ మొబైల్‌లో 108 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్‌ షార్క్‌ 4 ప్రోలో స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ ఉంటుందని భోగట్టా. అదే బ్లాక్‌ షార్క్‌ 4 డ్యుయోలో అయితే స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ ఇస్తారని తెలుస్తోంది. రెండింటిలోనూ క్వాడ్‌ హెచ్‌డీప్లస్‌ రిజల్యూషన్‌ ఉన్న స్క్రీన్‌ ఉంటుంది. అలాగే 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉంటుందట. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారట. ఇది 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కి సపోర్టు చేస్తుంది. 

9. షావోమీ మడత ‘మిక్స్‌’

ఫోల్డబుల్‌ ఫోన్స్ విభాగంలో షావోమి పని చేస్తోందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఆ ఊసులేవీ వినిపించడం లేదు. తాజాగా షావోమి ఫోల్డబుల్‌  ఫొటోలు అంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. గెలాక్సీ ఫోల్డ్‌, హువావే మేట్‌ ఎక్స్‌2 తరహాలోనే ఈ మొబైల్ కనిపిస్తోంది. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉంది. పెద్ద స్క్రీన్‌ ఫోన్లకు ఎంఐ మిక్స్‌ సిరీస్‌ ప్రసిద్ధి. ఇప్పుడు అదే సిరీస్‌లోనే ఈ మొబైల్‌ కూడా రాబోతోందట. 

10. అందరికీ డ్రాప్‌బాక్స్‌ ‘పాస్‌వర్డ్స్‌’

సులభంగా పాస్‌వర్డ్‌లను మేనేజ్‌ చేసుకోవడానికి గతేడాది ‘పాస్‌వర్డ్స్‌’ పేరుతో డ్రాప్‌ బాక్స్‌ ఓ సర్వీసును ప్రవేశపెట్టింది. పెయిడ్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఉచిత వినియోగదారులకు కూడా ఈ ‘పాస్‌వర్డ్స్‌’ ఫీచర్‌ అందించడానికి డ్రాప్‌బాక్స్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సర్వీసుతో పాస్‌వర్డ్‌లు, లాగిన్లను ఎన్‌క్రిప్ట్‌ చేసి సేవ్‌ చేసుకోవచ్చు. యాప్‌ రూపంలో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును, ఎక్స్‌టెన్షన్‌ ద్వారా  డెస్క్‌టాప్‌లోనూ వినియోగించుకోవచ్చు. అయితే ఉచిత యూజర్లు (బేసిక్‌ యూజర్స్‌) కేవలం 50 పాస్‌వర్డ్‌లు మాత్రమే సేవ్‌ చేసుకోగలరు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న