డిజిటల్‌ మానవా స్వాగతం!
close

Published : 14/07/2021 01:30 IST
డిజిటల్‌ మానవా స్వాగతం!

సినిమాలు, సీరియళ్ల వంటి కాల్పనిక ప్రపంచాల్లో సృజనాత్మకత సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. నిజం మనుషులకు, బొమ్మలకు మధ్య హద్దులు చెరిపేస్తున్న వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి బొమ్మలు మనుషుల్లా ఆలోచించగలిగితే? భావోద్వేగాలను ప్రదర్శించగలిగితే? అదీ పరిస్థితులను అర్థం చేసుకుంటూ అచ్చం మనలాగే మనతోనే ‘ముఖాముఖి’ సంభాషిస్తే? ‘డిజిటల్‌ హ్యూమన్స్‌’ అలాంటి లోకాన్నే ఇలకు దింపుతున్నారు.

ఛాట్‌బోట్‌ల గురించి తెలిసిందే కదా. కంపెనీల వెబ్‌సైట్‌లోకి వెళ్లినప్పుడు మనతో ఛాట్‌ చేస్తూ సందేహాలు నివృత్తి చేస్తుంటాయి. మరి మన ప్రశ్నలను టెక్స్ట్‌ ద్వారా కాకుండా మాటలతోనే చెబితే? అవతల నుంచి ఎవరైనా వీడియో ద్వారా వెంటనే సమాధానం చెబితే ఎంత బాగుంటుందో కదా. డిజిటల్‌ హ్యూమన్స్‌ అంటే ‘డిజిటల్‌ మనుషులు’ చేసే పని ఇదే. వీళ్లు మన కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తారు. మనం చెప్పేది వింటారు. పదాలను అర్థం చేసుకుంటారు. అనంతరం తమ గొంతును సవరించుకొని, హావభావాలను ప్రదర్శిస్తూ అచ్చం మనుషుల మాదిరిగానే మాట్లాడతారు. ఆకట్టుకునే సంభాషణల్లో పదాల పాత్ర 7 శాతమే. మాట తీరు (గాంభీర్యం, మృదుత్వం వంటివి), శరీర హావభావాల పాత్రే ఎక్కువ. వీటిని డిజిటల్‌ అవతారాలు చక్కగా ప్రదర్శిస్తాయి. మనలాంటి హావభావాలు ప్రదర్శిస్తూ మనలాగే మాట్లాడటం వీటి ప్రత్యేకత. అంతా కృత్రిమ మేధ గొప్పతనం. దీని సాయంతో ఇవి మనలాగే అవసరాన్ని బట్టి స్వరాన్ని మార్చుకుంటాయి. కనుబొమలు పైకి ఎగరేస్తాయి. తలను తిప్పుతాయి. నవ్వుతాయి. అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి. మన ముఖ కవళికలను పోలినట్టుగానే 3డీ పద్ధతిలో తీర్చిదిద్దటం వల్ల అచ్చం మనుషుల్లాగే కనిపిస్తాయి. మాటలను పసిగట్టే పరిజ్ఞానం మూలంగా మనం మాట్లాడే మాటలను అర్థం చేసుకుంటాయి. భాషను విడమర్చే సామర్థ్యం జోడించటం వల్ల ప్రతిస్పందిస్తాయి. తిరిగి సమాధానం చెబుతాయి. అంతేనా? మాట్లాడటానికి ముందు ఆయా అంశాలను బట్టి ముఖంలో కవళికలను ప్రదర్శిస్తాయి.

దినదినాభివృద్దిగా..
డిజిటల్‌ హ్యూమన్‌ రంగం ఇటీవలి కాలంలో శరవేగంగా పుంజుకుంటోంది. స్టుడియో పరికరాలేవీ లేకపోయినా, పెద్దగా ఖర్చు పెట్టకుండానే డిజిటల్‌ రూపాలను సృష్టించుకునే సాఫ్ట్‌వేర్‌ పుట్టుకురావటం దీనికి మరింత ఊపునిస్తోంది. నిజానికి డిజిటల్‌ మనుషుల ఆలోచన హాలీవుడ్‌ నుంచే పుట్టుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అవతార్‌ వంటి సినిమాల్లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం కొత్త ద్వారాలు తెరిచింది. 3డీ మోడలింగ్‌, యానిమేషన్‌ పరిజ్ఞానాలు నిజం నటులను డిజిటల్‌ పాత్రలుగా మార్చటానికి అవకాశాన్ని కల్పించాయి. అనంతరం వీడియోగేమ్‌ స్టుడియోలూ దీన్ని విజయవంతగానూ ఉపయోగించుకున్నాయి.

పలు రంగాల్లో..
కంప్యూటర్‌ను ‘సజీవంగా’ మార్చే దిశగా డిజిటల్‌ మనుషులు పెద్ద పాత్రనే పోషిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్‌ మనుషులు బ్రాండ్‌ అంబాసిడర్లుగా, డిజిటల్‌ ప్రభావశీలురుగా, కస్టమర్‌ సపోర్టు ప్రతినిధులుగా, ఆరోగ్య సలహాదారులుగా.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నారు. ప్రత్యేకమైన రూపం, వ్యక్తిత్వాలను మేళవించి అత్యంత సానుకూలంగా వినియోగదారులపై ఎక్కువకాలం ప్రభావం చూపేలా టెక్నాలజీ సంస్థలు వీరిని తీర్చిదిద్దుతున్నాయి. యునీక్‌ సంస్థ ఆయా కంపెనీల అవసరాలను తీర్చటానికి ప్రత్యేకంగా డిజిటల్‌ మనుషులను రూపొందిస్తోంది. ఓబీఈఎన్‌ సంస్థ డిజిటల్‌ అవతారాలైతే సెలబ్రిటీల వంటి వారికి ప్రతీకలనూ సృష్టిస్తోంది. సోల్‌ మిషన్స్‌ ఏకంగా డిజిటల్‌ బ్రెయిన్‌ పరిజ్ఞానంతో డిజిటల్‌ మనుషులు భావోద్వేగాలు ప్రదర్శించేలా చేయగలుగుతోంది. అమీలియా సంస్థ ఇలాంటి పరిజ్ఞానంతోనే డిజిటల్‌ ఉద్యోగులనూ తయారుచేస్తోంది. ఈ పరిజ్ఞానం ప్రశ్నలకు జవాబులు ఇవ్వటమే కాదు.. మరింత ఎక్కువ సమాచారం ఇవ్వటాన్నీ నేర్చుకుంటుంది. ఆయా వ్యక్తులకు అనుగుణంగా స్పందించటమూ అలవరచుకుంటుంది. కాల్పనిక సహాయకులను సృష్టించుకోవటానికీ ఇప్పుడు ఎన్నో సంస్థలు సేవలను అందిస్తున్నాయి కూడా.


ఎలా సృష్టిస్తారు?

డిజిటల్‌ మనుషులను సృష్టించటంలో మూడు దశలు కీలక పాత్ర పోషిస్తాయి. 1. మోడల్‌ క్రియేషన్‌. 2. మోషన్‌ కాప్చర్‌.   3. ప్రత్యక్ష గ్రాఫిక్స్‌. ముందుగా హై రెజల్యూషన్‌ కెమెరాలు, లైటింగ్‌ సాయంతో మనిషి ముఖం (కావాలనుకుంటే శరీరం) 3డీ నమూనాను సృష్టిస్తారు (మోడల్‌ క్రియేషన్‌). అనంతరం మోషన్‌ కాప్చర్‌ పరిజ్ఞానంతో కదలికలను జోడిస్తారు. చివరికి రియల్‌టైమ్‌ గ్రాఫిక్స్‌తో కదలికలు, హావభావాలు సజీవంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. వీటి మూలంగానే చాలామందికివి బొమ్మలను చెప్పినా నమ్మబుద్ధి కాదు.


కొన్ని ఉదాహరణలు ఇవీ..

డిజిటల్‌ మాధ్యమంలోనూ ఆరోగ్యబీమా విషయంలో మానవీయ కోణం అవసరం. సానుభూతితో అర్థం చేసుకుంటూ అవసరాలకు తగిన సమాచారాన్ని ఇవ్వాలనే ప్రజలు కోరుకుంటారు. అదీ సరళమైన భాషలో వివరణ ఉండాలని భావిస్తుంటారు. అందుకే న్యూజిలాండ్‌లోని సదరన్‌ క్రాస్‌ హెల్త్‌ సొసైటీ భిన్నంగా ఆలోచించింది. చాలామందికి ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించి.. సందేహాలు నివృత్తి చేయటానికి, అవసరమైన సమాచారాన్ని అందించటానికి ఏఐమీ అనే డిజిటల్‌ అవతారాన్ని రూపొందించింది. దీని ముఖం, మాట తీరు స్థానిక ప్రజల ఆకారాన్ని పోలినట్టుగానే ఉంటుంది. ఇది ‘ముఖాముఖి’ సంభాషణతో ఆరోగ్యబీమా గురించి తేలికగా వివరిస్తుంది. ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినవారికైనా ప్రశ్నలకు జవాబులిస్తుంది. చాలామందికి డిజిటల్‌ మనిషి అనే అనుమానమైనా రాదు.


ఈ అవతారం పేరు నోలా. వినియోగదార్లకు ఆహ్వానం పలుకుతుంది. నవ్వుతూ, మృదువుగా మాట్లాడుతుంది. టెలివిజన్లయినా, బ్రాండెండ్‌ హెడ్‌ఫోన్లయినా.. ఏమేం కొనాలని అనుకుంటున్నారో ఆరా తీస్తుంది. వాటి గురించి సవివరంగా వివరిస్తుంది. స్టోర్‌లో ఏ ఉద్యోగి దగ్గరికి వెళ్లాలో కూడా నిర్ణయిస్తుంది. వినియోగదారులు ఇష్టపడితే వారి పేరు తెలుసుకొని, ఉద్యోగి ఫోన్‌కు సమాచారం ఇస్తుంది. ఇలా రోజూ ఎంతోమందికి సేవలందిస్తుంది.


కాలం అమూల్యం. అందుకే యూబీఎస్‌ ముఖ్య ఆర్థికవేత్త డేనియల్‌ కాల్ట్‌ విభిన్నంగా ఆలోచించారు. తన రూపంతోనే డిజిటల్‌ మానవుడిని సృష్టించుకున్నారు. కృత్రిమ మేధతో పనిచేసే దీని సాయంతో క్లయింట్లతో మాట్లాడుతుంటారు. అంటే డిజిటల్‌ రూపంలో క్లయింట్ల సమస్యలను పరిష్కరిస్తూనే నిజరూపంలో తన పనులు చేసుకుంటారన్నమాట. ఇది మామూలు యూబీఎస్‌ చాట్‌బోట్‌ కాదు. డేనియల్‌ కాల్ట్‌తో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నామన్న అనుభూతి కలిగిస్తుంది.


ఆల్బర్‌ ఐన్‌స్టీన్‌తో మాట్లాడాలని ఉందా? అయితే నేరుగా మాట్లాడండి. మీ సందేహాలు తీర్చుకోండి. ఆయన మరణించారు కదా, అదెలా సాధ్యమంటారా? నిజం ఐన్‌స్టీన్‌ను కలుసుకోలేకపోవచ్చు గానీ డిజిటల్‌ ఐన్‌స్టీన్‌తో సంభాషించటం సాధ్యమే. ఆల్బర్‌ ఐన్‌స్టీన్‌ నోబెల్‌ బహుమతిని అందుకొని వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన డిజిటల్‌ రూపాన్ని సృష్టించారు మరి. ఆయన వ్యక్తిత్వం, విజ్ఞానం అన్నింటినీ కలబోసి కృత్రిమ మేధ సాయంతో మాట్లాడేలా చేశారు. ఈ అవతారంతో రోజూ క్విజ్‌లో పాల్గొనొచ్చు. ఐన్‌స్టీన్‌ జీవితం, కృషి గురించి ఏదైనా అడిగి తెలుసుకోవచ్చు. ఐన్‌స్టీన్‌ మనల్ని చూస్తూ, మనతో నిజంగానే మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న