పిల్లలపై సైబర్‌ వల.. జాగ్రత్తలు ఇలా..!
close

Published : 15/11/2020 18:39 IST

పిల్లలపై సైబర్‌ వల.. జాగ్రత్తలు ఇలా..!

సోషల్‌ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు ఉంచొద్దు

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుత కాలమంతా ఆన్‌లైన్‌మయం. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ఒకరేమిటీ అందరూ ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. అంతర్జాలంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. ఇబ్బందులు కూడా అన్నే ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయే ప్రమాదముంది. పిల్లలకు గేమ్స్‌ కోసమో, వీడియోల కోసమో స్మార్ట్‌ఫోన్లు, ల్యాపీలు, ట్యాబ్‌లను తల్లిదండ్రులు ఇస్తుంటారు. అయితే వారేం చేస్తున్నారు.. ఎలాంటివి ఓపెన్‌ చేసి చూస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఎక్కువ మంది చిన్నారులు పేరంట్స్‌ అకౌంట్‌తో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తుంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రుల సమాచారం, ఫొటోలు, వీడియోలను సైబర్‌ నేరగాళ్లు తస్కరించి మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడే ఆస్కారం ఉంటుంది. మరి అలాంటి ప్రమాదాలను తప్పించుకోవాలంటే మార్గాలూ ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.. 

వ్యక్తిగత సమాచారంతో అప్పులు..

విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తుంటారు.  అయితే సరైన పద్ధతిలో చేయకపోతే సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కినట్టే. కళాశాలకు సంబంధించి రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ముందు ఎలాంటి లోన్లు తీసుకోకపోవడం, కట్టకుండా ఉండకపోవడం వంటివి పిల్లలు, విద్యార్థుల చేసి ఉండరు కాబట్టి క్రెడిట్ స్కోరు కూడా బాగానే ఉంటుంది. ఇదే సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారుతుంది. విద్యార్థుల పేరు మీద వారికి తెలియకుండానే రుణాలు, క్రెడిట్‌ కార్డులను తీసుసేకుని గప్‌చుప్‌ అయిపోతారు. అప్పు వసూలు ఏజెంట్‌ నుంచి మెయిల్స్‌ వచ్చాయంటే మాత్రం సైబర్‌ దోపిడీకి గురైనట్లే లెక్క. 

సమస్యకు పరిష్కారం

ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మాత్రం పిల్లలకు దాని గురించి వివరించాలి. ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు.. ఎందుకు తిరస్కరించాలి వంటి వాటి గురించి చెప్పాలి. మీ అబ్బాయి/అమ్మాయికి సంబంధించిన క్రెడిట్ వివరాలను ఫ్రీజ్‌ చేయాలి. అప్పుడు పిల్లల వివరాలు తెలిసినప్పటికీ నేరగాళ్లు కొత్తగా వారి పేరు మీద ఖాతాలను ఓపెన్‌ చేయలేరు.  

ఫేక్‌ గేమింగ్‌ యాప్‌లతో జాగ్రత్త

చిన్నారులు ఎక్కువగా గేమింగ్‌లు ఆడుతూ ఉంటారు. ఆన్‌లైన్‌ ఆటల్లోనూ యాడ్స్‌ పేరిట కొత్త గేమ్‌లకు సంబంధించిన లింక్‌లు వస్తుంటాయి. అథరైజ్డ్‌ యాప్‌లు అయితే ఫర్వాలేదు. కానీ ఫేక్‌ యాప్‌లను ఒకవేళ ఓపెన్‌ చేసి వివరాలను నమోదు చేస్తే మాత్రం అడ్డంగా దొరికి పోతారు. కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ వైరస్‌ను డౌన్‌లోడ్‌ అయిపోయేలా హ్యాకర్లు చేసేస్తారు. బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం అడుగుతారు. స్మార్ట్‌ఫోన్లలోనూ డేటానంతా తస్కరించే ప్రమాదముంది. అలాగే గేమ్‌ చాట్‌ ద్వారానూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ఆస్కారముంది.

ఎలా కాపాడుకోవాలి..?

పిల్లలు ఆన్‌లైన్‌లో గేమ్‌లను డౌన్‌లోడ్‌ చేయడాన్ని మనం ఆపలేం. అయితే దాని వల్ల వచ్చే సమస్యలను వారికి వివరించాలి. అధికారిక యాప్‌ స్టోర్స్‌ నుంచి మాత్రమే గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని చెప్పాలి. అయితే ఆండ్రాయిడ్‌ యూజర్లు ఇతర ప్లేస్టోర్స్‌ నుంచి మోసపూరిత యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఉపయోగించకుండా ఉండాలని పిల్లలకు సూచించాలి. గేమ్‌ను యాక్టివేట్ చేయడం గానీ, కొనుగోలు చేసేటప్పుడు కానీ పాస్‌వర్డ్‌, అనుమతి తీసుకునేలా చేస్తే సైబర్‌ నేరగాళ్ల నుంచి కాపాడుకోవచ్చు. 

సామాజిక మాధ్యమాల యాప్స్‌తో..

ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. చదువుకునే యువతీ యువకుల మీద సైబర్‌ కేటుగాళ్లు సోషల్‌ మీడియా ద్వారా పరిచయమై మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నాం. పిల్లలకు నమ్మకం కలిగే వరకూ ఎంతో సౌమ్యంగా, సరదాగా చాటింగ్‌ చేస్తూ ఉంటారు. ఒక్కసారి వారి మాయలో పడి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పంపించారంటే పీకల్లోతు కష్టాల్లో పడినట్లే. వాటిని మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు దిగే అవకాశం ఉంటుంది. లైంగిక చర్యకు సహకరించాలని ఒత్తిళ్లు, డబ్బు పంపాలని బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. లేకపోతే అసభ్యకరమైన ఫొటోలను తయారు చేసి సామాజిక మాధ్యమాల్లోనూ, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు పంపిస్తామని హింసిస్తుంటారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక చాలా మంది అభాగ్యులు తమ ప్రాణాలను తీసుకున్న ఘటనలూ చోటు చేసుకున్నాయి. 

వాటి నుంచి రక్షణ ఎలా..?

సోషల్‌ మీడియా అకౌంట్స్‌కు తెలియని వారి నుంచి రిక్వెస్ట్‌లు రాకుండా చేయాలి. ప్రొఫైల్స్‌లో ప్రైవేట్‌, జియో ట్యాగింగ్‌, కంప్యూటర్లలో అయితే తప్పనిసరిగా తల్లిదండ్రులు కాన్ఫిగరేషన్‌ను మార్చుకోవాలి. ఇలాంటి మోసాల గురించి వివరించాలి. వ్యక్తిగత సమాచారం, ఫొటోలను ప్రతి ఒక్కరికీ షేర్‌ చేయకుండా ఉండేలా వారిని చైతన్యపరచాలి. 

ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేయకుండా.. 

సైబర్‌ నేరగాళ్లు కొంగొత్త మార్గాలను వెతుకుతూ ఉంటారు. డిజిటల్‌ కిడ్నాపింగ్ కూడా ఇందులో భాగమే. చిన్నారుల ఫొటోలను తస్కరించి తమ సొంత బిడ్డగా వేరే వెబ్‌సైట్లలో పెట్టేస్తుంటారు. అలానే మా బిడ్డకు బాగోలేదంటూ తప్పుడు సమాచారం పెడుతూ సొమ్ము ఇవ్వాలని కోరుతుంటారు. వీళ్లను బేబీరోల్‌ ప్లేయర్స్‌ అంటారు. తప్పుడు వివరాలతో, చిన్నారులకు గుర్తింపు సృష్టించి వెబ్‌సైట్లలో భావోద్వేగమైన క్యాప్షన్‌ను జోడిస్తారు. పొరపాటున పాపం చిన్నారి గురించి ఆలోచించి లింక్‌ను ఓపెన్‌ చేశామా.. ఇక అంతే సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కినట్టే. కాబట్టి సోషల్‌ మీడియాలోనూ, యాప్స్‌లోనూ పిల్లల ఫొటోలను షేర్‌ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. లేకపోతే అసభ్యకరమైన పోర్న్‌ సైట్లలో వారి ఫొటోలు, వీడియోలను ఉంచి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. 

ఎలా జాగ్రత్త పడాలి..?

తల్లిదండ్రులు ప్రతి సారీ తమ సామాజిక మాధ్యమాల ఖాతాలను తనిఖీ చేస్తుండాలి. ప్రైవసీ సెట్టింగ్స్‌ను మారుస్తూ ఉండాలి. కుటుంబసభ్యులకు, బాగా తెలిసిన స్నేహితులకు మాత్రమే ఫొటోలను, వీడియోలను షేర్‌ చేయాలి. ఇతరులు తమ సోషల్‌ మీడియాలోకి అనుమతి లేకుండా రాకుండా జాగ్రత్త వహించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న