కొత్త పాలసీపై విమర్శలు: మరోసారి వివరణ
కాలిఫోర్నియా: తాను తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతోన్న తరుణంలో మంగళవారం మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరోసారి స్పష్టత ఇచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన సందేశాల గోప్యతను తాజాగా తీసుకువచ్చిన మార్పులు ఏవిధంగానూ ప్రభావితం చేయవని వివరించింది. కొత్త పాలసీపై చక్కర్లు కొడుతున్న పుకార్లను పరిష్కరించాలనుకుంటున్నామని వెల్లడించింది. అలాగే ఎప్పటిలాగే వినియోగదారుల సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో భద్రంగా ఉంటాయని ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది.
వీటిని ఫేస్‌బుక్‌తో పంచుకోం..
> వాట్సాప్ మీ వ్యక్తిగత సందేశాలను చూడలేదు, కాల్స్‌ను వినలేదు. అలాగే ఫేస్బుక్ కూడా.
> మీరు షేర్ చేసిన లొకేషన్‌ను వాట్సాప్, ఫేస్బుక్ చూడలేవు.
> వాట్సాప్ మీ కాంటాక్ట్‌ల గురించి ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోదు.
> వాట్సాప్ గ్రూప్‌లు ప్రైవేటుగానే ఉంటాయి.
> మీ సందేశాలు అదృశ్యమయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అలాగే మీ డేటాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చంటూ తాను అనుసరిస్తోన్న పాలసీ గురించి వాట్సాప్ మరోసారి వినియోగదారులకు స్పష్టత ఇచ్చింది.
ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్ విషయంలో వాట్సాప్ కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత సమాచార గోప్యతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేసేజింగ్ యాప్ ఇప్పటికే ఒకసారి వివరణ ఇచ్చుకుంది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌కు సంబంధించి ఎలాంటి మార్పుల చేయలేదని చెప్పింది. పారదర్శకతను తీసుకువచ్చేందుకే కొత్త పాలసీని తీసుకువచ్చామని, బిజినెస్ ఫీచర్స్‌ను మరింత మెరుగ్గా యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఎండ్-టు-ఎండ్ విధానానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.
ఇవీ చదవండి:
వాట్సాప్ వద్దా..ఇవిగో వీటిని ప్రయత్నించండి..
వాట్సాప్ కొత్త పాలసీ..వారికి మాత్రమేనట..!