close
మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తున్నాం

కాంగ్రెస్‌ హయాంలో కరెంటు కోతలతో కార్ఖానాల మూత
‘దండుమైలారం’ విస్తరణకు మరో వెయ్యి ఎకరాల సేకరణ
శాసనసభలో మంత్రి కేటీఆర్‌ కేసీఆర్‌, కేటీఆర్‌ అంటే అభిమానం: కాంగ్రెస్‌ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

‘తెలంగాణ ఏర్పడక ముందు గొప్పగా ఉందని.. తెరాస హయాంలో ఏం జరగలేదని హేళనగా మాట్లాడటం సరికాదు. 2014కు ముందు కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కోతలతో పరిశ్రమలు మూతపడి పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. మేం ఆ పరిశ్రమలను తెరిపిస్తున్నాం. మీరు ఇటుకతో కొడితే రాయితో కొట్టే తెలివి మాకుంది’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పరిశ్రమలు, పురపాలక, గనుల శాఖల పద్దులపై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సభ్యుల ఆరోపణలు, విమర్శలకు దీటుగా స్పందించారు. ‘మా హయాంలో పరిశ్రమలు దివాలా తీసి మూతపడినట్లు కాంగ్రెస్‌ సభ్యులు వెటకారంగా మాట్లాడుతున్నారు. అవును.. నిరంతర కరెంటు సరఫరాతో ఇన్వర్టర్లు, జనరేటర్లు అమ్మేవి మూతపడ్డాయి. కేంద్రం, ప్రపంచబ్యాంకు ఇచ్చిన ర్యాంకుల జాబితాలో తెలంగాణ ముందుంది. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో మొదటిస్థానం మనదే. తెలంగాణపై ప్రపంచబ్యాంకు ర్యాంకులు కూడా నిజం కాదా, కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి ఇచ్చిన ర్యాంకులే నిజమా? 2014-19 మధ్యకాలంలో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 10,993 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తే 8,293 పరిశ్రమలను నెలకొల్పారు. రూ.1,69,859 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 12,71,789 మందికి ఉద్యోగాలొచ్చాయి. స్వీయ ధ్రువీకరణ ద్వారా ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే పరిశ్రమల ఏర్పాటు.. పనులు ప్రారంభించేలా కొత్త విధానం తెచ్చామని అమెరికాలోని జీఈ కంపెనీ ఛైర్మన్‌కు నేను చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా అనుమతి ఇస్తున్నాం.అలా ఇవ్వకపోతే 16వ రోజున ఆటోమేటిక్‌గా అనుమతి ఇచ్చినట్లుగానే భావించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సంస్కరణలు తెచ్చాం. ములుగు జిల్లాలోని బిల్ట్‌ పరిశ్రమ కాంగ్రెస్‌ హయాంలోనే మూతపడింది. దాన్ని తెరిపించేందుకు జీఓ ఇచ్చాం. ఆ పరిశ్రమ కార్మికులకు దసరాకు వేతనాలిప్పించాలని కాంగ్రెస్‌ సభ్యురాలు అనసూయ అడిగారు. ఆ పరిశ్రమ యాజమాన్యంతో చర్చిస్తున్నాం. 2005-14 మధ్యకాలంలో కాంగ్రెస్‌ హయాంలో ఒక్కటంటే ఒక్కటైనా పారిశ్రామిక పార్కు ఏర్పాటు కాలేదన్నది వాస్తవం కాదా? తెరాస గత ఐదేళ్లలో 59 పార్కుల ఏర్పాటుకు 49 వేల ఎకరాలను కేటాయించింది. 38,989 ఎకరాలు సేకరించాం. జీనోమ్‌ వ్యాలీని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటుచేశారు. నీలి విప్లవంతో మత్స్యరంగాన్ని, గులాబీ విప్లవంతో గొర్రెలు, శ్వేత విప్లవంతో పాడి, హరిత విప్లవంతో సాగునీరిచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వీటితో ఆహార శుద్ధి పరిశ్రమలు తీసుకొస్తాం. నగరం నుంచి కాలుష్య కారక పరిశ్రమలను బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) బయటికి పంపాలనే నిబంధనలను అమలు చేస్తాం. 1,746 పరిశ్రమలను గుర్తించాం. వీటి తరలింపు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. 600 యూనిట్లు ఫార్మాసిటీకి తరలిస్తాం. చౌటుప్పల్‌ వద్ద ఉన్న కాలుష్య పరిశ్రమలనూ అక్కడికే పంపుతాం. దండుమైలారం పారిశ్రామిక పార్కు విస్తరించేందుకు మరో వెయ్యి ఎకరాలు సేకరిస్తాం. కరీంనగర్‌లో వచ్చే నెలలో ఐటీ హబ్‌ ప్రారంభిస్తాం’అని చెప్పారు.


మంత్రిగారు మంచి పనులు చేస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి

మంత్రి కేటీఆర్‌ సమాధానాలిచ్చిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రిగారు మంచి పనులు చేస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానమన్నారు. రాజకీయాల కోసం కొట్లాడుకుని నిందించాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనుల కోసం సీఎం దగ్గరికి వెళతామన్నారు. దండుమైలారం పార్కును విస్తరించాలన్నారు. కాంగ్రెస్‌ సభ్యులను తెరాసలో విలీనం చేసుకున్నారని రాజగోపాల్‌ మాట్లాడగా.. రెండు రోజుల క్రితం రాజస్థాన్‌లో బీఎస్పీ సభ్యులను అక్కడి కాంగ్రెస్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వారి పార్టీలో విలీనం చేశారని, అది రాజ్యాంగబద్ధమైనప్పుడు తాము చేసింది కాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. భట్టి మాట్లాడుతూ ఇసుకపై ఆదాయం పెరిగిందని చెబుతున్నారని, కాంగ్రెస్‌ హయాంలో ఇసుక సహజ వనరుగా భావించి ఆదాయం పెంచుకోలేదన్నారు. ఇసుక మాదిరిగానే భవిష్యత్తులో గాలి, నీరుపైనా ఆదాయం పెంచామని చెప్పుకొంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.