close

తాజా వార్తలు

రాజమౌళి వ్యక్తి కాదు.. ఆయనొక బ్రాండ్‌!

ఎస్‌.ఎస్‌.రాజమౌళి అంటే ఒక పేరు కాదు.. విజయాలకు కేరాఫ్‌ అడ్రస్‌. సినిమాలపై ఆయన ముద్ర ఒక బ్రాండ్‌. రాజమౌళి సినిమా వస్తోందంటే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, యావత్‌ భారత్‌ సినీ పరిశ్రమ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటుంది. అందుకే ఆయన అమరశిల్పి జక్కన్నలా ప్రతి ఫ్రేమూ అందంగా చెక్కి, అద్భుత కళారాజాలను అందించారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మరో దృశ్యకావ్యాన్ని అందించే పనిలో ఉన్నారు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి సినిమాల్లోని ప్రత్యేకతలు మీకోసం.

కథానాయకుడు ‘ధీరోదాత్తుడు’

రాజమౌళి సినిమాల్లో కథానాయకుడు తొలుత మామూలుగానే ఉంటాడు. కానీ, సమయం వచ్చిందా తనలోని ధీరత్వాన్ని చూపించకుండా ఉండడు. ఇలాంటి పాత్రలు సృష్టించడానికి స్ఫూర్తి ఆయన చిన్నప్పుడు చదువుకున్న ‘అమర చిత్రకథ’, బాలభారతం, బాల రామాయణం లాంటివేనట. ఆ పురాణ కథలే ఇప్పటి తన సినిమాల్లోని పాత్రలకు మూలాలట. ‘రామాయణంలో రాముడి కంటే రావణుడే బలవంతుడిలా కనిపిస్తాడు. అయోధ్య కంటే లంకే దుర్భేద్యంగా ఉంటుంది. కానీ రాముడి పక్కన ధర్మం ఉంది... అందుకే యుద్ధంలో గెలుస్తాడు. నా సినిమాల్లో విలన్లూ రావణుల్లాంటి వాళ్లే. కానీ నా హీరోలో ఏదో ఒక బలమైన లక్షణం ఉంటుంది. అదే విలన్‌ను చంపేస్తుంది. ‘సింహ్రాది’ నుంచి ‘బాహుబలి’ వరకు ఆ ఆలోచనతోనే హీరో పాత్రలు తీర్చదిద్దాను. దీనంతటికీ చిన్నప్పటి నుంచీ నాతో ప్రయాణిస్తున్న ఆ ఊహా ప్రపంచమే కారణం’ అంటూ తన సినిమాలోని కథానాయకుల గురించి చెబుతారు జక్కన్న.

విరామం ముందు అదిరిపోవాల్సిందే!

ర్శక ధీరుడి సినిమాలంటే యాక్షన్‌ సన్నివేశాలకు పెట్టింది పేరు. పైన అనుకున్నట్లు తొలుత హీరో ఆడుతూ.. పాడుతూ.. మామూలుగానే ఉంటాడు. కానీ సమయం వచ్చినప్పుడు ‘సింహాద్రి’లా శివమెత్తుతాడు. ‘ఛత్రపతి’లా చెండాడతాడు. ‘విక్రమార్కుడు’లా విశ్వరూపం చూపిస్తాడు. ‘ఈగ’ కూడా యముడి మృత్యుతీగ అవుతుంది. ‘బాహుబలి’ దెబ్బకు బాక్సాఫీస్‌లు సైతం బద్ధలైపోతాయి. ముఖ్యంగా రాజమౌళి చిత్రాల్లో విరామం ముందు వచ్చే సన్నివేశానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆ సన్నివేశం చూస్తే  థియేటర్‌లోని సీటులో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుస్తాయి. ఊపిరి బిగపట్టి మరీ వెండితెరకు కళ్లప్పగించి చూస్తారు. ఇలాంటి సన్నివేశాలను రాజమౌళి తనదైన శైలిలో తీసినా.. దానికి ప్రాణం వచ్చేది మాత్రం నేపథ్య సంగీతంతోనే. రాజమౌళి పెద్దన్న ఎం.ఎం.కీరవాణి చేసే మ్యూజిక్‌ మేజిక్‌ ఆ సన్నివేశాన్ని హిమాలయ శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. ‘స్టూడెంట్‌ నెం.1’ నుంచి ‘బాహుబలి’ వరకు ఇలా ఏ సినిమా చూసినా విరామానికి ముందుకు ప్రేక్షకుడి మనసును ఉచ్ఛ స్థితికి తీసుకెళ్తారు రాజమౌళి. ‘బాహుబలి2’లో ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ అంటూ థియేటర్‌ను దద్దరిల్లేలా చేశారు.

రాజమౌళి సినిమా ఓ ‘ఆయుధాగారం’

క్కన్న కథానాయకుడి చేతిలో ఇంతకుముందెన్నడూ చూడని ఆయుధాలుంటాయి. ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటాడో అతనిని సంహరించేందుకు ఉపయోగించే ఆయుధాలూ అంతే విభిన్నంగా ఉంటాయి. అయితే కొన్ని విలన్ల వద్ద కూడా ఉంటాయనుకోండి. ‘సింహాద్రి’లో ఎన్టీఆర్‌తో పట్టించిన కత్తి కమ్‌ గొడ్డలి ఎంత పాపులర్‌ అయిందో కొత్తగా చెప్పన్నక్కర్లేదు. ఇక ‘ఈగ’తో సూది పట్టించి వెండితెరపై ఆయన చేసిన అద్భుతం అంతా.. ఇంతా కాదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీ సినిమాలో కథానాయకుడు లేదా, ప్రతినాయకుడి చేతిలోని ఆయుధాలు విభిన్నంగా ఉంటాయి. ఇక ‘బాహుబలి’లో ప్రభాస్‌, రానాలతో పాటు తమన్నా, అనుష్కలతో కూడా ఆయుధాలు పట్టించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది.

ఊహా ప్రపంచంతో ప్రయాణం..!

రాజమౌళి చిత్రాల్లో కన్పించే మరో ప్రత్యేకత ఊహా ప్రపంచం. సగటు ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ఆయన చిత్రాలు ఉంటాయి. అదే సమయంలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. ‘స్టూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’ ఒక ఎత్తయితే మూడో ప్రయత్నంగా చేసిన ‘సై’ మరో ఎత్తు. ఈ సినిమా రగ్బీ ఆట నేపథ్యంగా సాగుతుంది. విదేశాల్లో మాత్రమే ఆడే ఈ ఆట గురించి అప్పటివరకు మనదేశంలో చాలామందికి తెలియదు. కానీ రాజమౌళి ధైర్యం చేసి ఆ సినిమా తీసి తానేంటో నిరూపించుకోవడమే కాకుండా హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు. ‘ఛత్రపతి’లో ప్రభాస్‌తో షార్క్‌తో ఫైట్‌, ‘విక్రమార్కుడు’లో ఛంబల్‌లోయ దొంగల నేపథ్యం, ‘యమదొంగ’లో ఎన్టీఆర్‌ పరిగెడుతుంటే ఆయనను చిరుతతో పోలుస్తూ చూపించడం.. సీనియర్‌ ఎన్టీఆర్‌ను వెండితెరపై కన్పించేలా చేయడం, ‘మగధీర’లో 100 మంది యోధులతో ఫైట్‌ ఇవన్నీ ఆయన సినిమాల్లో తురుపుముక్కలే. ఇక ‘ఈగ’ సినిమా కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పాలి. లేని దానిని ఊహించుకుని నటించడం నటులకు ఒక సవాల్‌ అయితే.. ఆ సన్నివేశం గ్రాఫిక్స్‌ అన్న అనుమానం ప్రేక్షకుడికి కొంచెం కూడా రాకుండా తీయడం రాజమౌలి ఘనత. ‘బాహుబలి’తో ఆ ఊహ తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. అప్పటివరకు హాలీవుడ్‌కే సొంతమైన భారీ కాన్వాస్‌ను ‘బాహుబలి’ ద్వారా మనమూ తీయవచ్చు అని నిరూపించారు జక్కన్న.

‘బాహుబలి’ ఓ మహావృక్షం

‘సినిమా పరిశ్రమలో ఎవరూ ఎవరికీ జీవితాన్నివ్వరు. ఫలానా హీరోతో చేస్తే నా సినిమా బాగుంటుందన్న ఆశతో సినిమా చేస్తా తప్ప. నేను తీయడం వల్ల ఎవరికో స్టార్‌డమ్‌ వచ్చిందనడం అబద్ధం’ అని రాజమౌళి ఎప్పుడూ చెబుతుంటారు. ‘బాహుబలి’ని ఓ మహావృక్షంగా అభివర్ణించే ఆయన సినిమాను కేవలం ఒక కొమ్మగానే పేర్కొంటారు. ఆ కథ ఆధారంగా రూపొందిన కామిక్స్‌, పుస్తకాలు లాంటివి మరికొన్ని కొమ్మలు అని చెప్పేవారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రాజమౌళి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ‘బాహుబలి’కి అదనపు హంగులు తెచ్చేందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ‘బాహుబలి: ది బిగినింగ్‌’లో జలపాతాలను, మాహిష్మతి సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టారు. యుద్ధ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా తీశారు. ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’తో ఇది కదా తెలుగు సినిమా అంటే అని నిరూపించి కలెక్షన్ల వర్షం కురిసేలా చేశారు.

‘రాజ’ముద్ర వెనుక కథ

‘తన ప్రతి సినిమాకూ ‘యాన్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఫిల్మ్‌’ అనే ముద్ర వేసుకోవటం రాజమౌళికి అలవాటు. దీని గురించి ఆయనేమంటారంటే.. ‘మొదట్లో నేను పడ్డ కష్టం తాలూకూ పేరు వేరెవరికైనా వెళ్లిపోతుందేమో అన్న అభద్రతాభావంతో అది వేసుకోవడం మొదలుపెట్టా. పేరు తెలియక పోయినా ముద్ర చూశాకైనా చదువుకోని వాళ్లు కూడా గుర్తుపడతారని ఆశ. నాలుగైదు సినిమాలు హిట్టయ్యాక దాని అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత అదో బ్రాండ్‌లా మారిపోవడంతో కొనసాగించాల్సి వస్తోంది’ అంటారు. అయినా విజయానికి రాజమౌళినే ఓ ‘రాజ’ముద్ర. అలాంటి వ్యక్తికి మళ్లీ మరో ముద్ర అవసరం లేదేమో. 

ఇద్దరు యోధులు కలిస్తే..

‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌లతో సినిమా అనగానే ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. సినిమా ప్రకటనతోనే ఎంతో క్రేజ్‌ ఏర్పడింది. అయితే, కథేంటి? ఎవరి పాత్ర ఏంటి? అన్న ప్రశ్నలు అటు అభిమానుల్లో, ఇటు సినీ ప్రేక్షకుల్లో మెదిలాయి. అదే సమయంలో ఎప్పటిలాగే సినిమా చిత్రీకరణ దశలోనే అన్నింటికీ సమాధానం చెప్పేశారు జక్కన్న. ఉద్యమవీరులు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీంగా ఎన్టీఆర్‌ కనిపిస్తారని ప్రేక్షకులకు చెప్పేశారు. దీంతో సినిమాపై గందరగోళం లేకుండా చేశారు. ఇక తెలియాల్సిందల్లా.. ఎవరి లుక్‌ ఎలా ఉంటుందనేదే. దానికి కాలమే సమాధానం చెబుతుంది. ఇలాంటి అద్భుతమైన దృశ్య కావ్యాలు ఎన్నో తీయాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

- ఇంటర్నెట్‌  డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.