close

తాజా వార్తలు

మిషన్‌ కాకతీయపై సందిగ్ధం

పేరుకుపోయిన బిల్లులు.. పత్తాలేని గుత్తేదారులు
ముందుకు సాగని నాలుగో విడత
జాడలేని.. అయిదో విడత
ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే

ఉమ్మడి జిల్లాలో మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నాలుగు విడతలో చేపట్టిన చెరువుల పనుల తీరు ఇలా ఉంది.
* ఆదిలాబాద్‌ 215 108.80
* కుమురంభీం 410 91.52
* నిర్మల్‌ 393 111.24
* మంచిర్యాల 473 109.84
* జిల్లాలో మొత్తం చెరువులు- 7150
* మిషన్‌ కాకతీయలో చేపట్టిన చెరువులు- 1491
* నిధుల వ్యయం- 421.40 కోట్లు
* ఆయకట్టు లక్ష్యం- 1.20 లక్షల ఎకరాలు
* ఇప్పటి వరకు పూర్తయిన చెరువులు- 1213
* పనులు ఆగిపోయిన చెరువులు- 278

సాగునీటి వనరులకు పూర్వ వైభవం తీసుకొచ్చి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం అమలుపై సందిగ్ధం నెలకొంది. జిల్లాలో గుర్తించిన చెరువుల్లో ఏటా కొన్ని చెరువులను తీసుకొని విడతల వారీగా పనులు చేపట్టారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు విడతలుగా చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరయ్యాయి. అయిదో విడత ప్రతిపాదనలు పంపించాలి. కానీ ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో మిషన్‌ కాకతీయ కింద అయిదో విడత పనులు ఉండవనే
భావన వ్యక్తమవుతోంది. మొదటి, రెండో విడతల్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు అధికారుల్లో లేకపోవడం, బిల్లులు పేరుకుపోవడం, ఎన్నికలు రావడం, తదితర కారణాల వల్ల నాలుగో విడత చేపట్టిన చెరువుల్లో అనేక పనులు అసంపూర్తి దశలోనే ఉన్నాయి. దీంతో అయిదో విడత లేనట్లుగానే తెలుస్తోంది.

మిషన్‌ కాకతీయ పథకం కింద చేపట్టిన చెరువుల పనుల పూర్తికి ఆది నుంచి అనేక అడ్డంకులు ఎదురు అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంతో నిర్ణిత కాలంలో పనులు చేయకపోవడం వల్ల అసంపూర్తి దశలో ఉన్నాయి. ఏటా చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలకు మార్చి నెలలో మంజూరు ఇవ్వాలి. టెండర్లు, ఒప్పందాలు తదితర వాటిని అదే నెలలో పూర్తి చేస్తే.. సకాలంలో పనులు మొదలుపెట్టే అవకాశం ఉండేది. నాలుగో విడత మంజూరు అయిన వాటిలో అనేక చెరువులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంతలో ఎన్నికలు రావడంతో పనులను పట్టించుకునే వారే కరవయ్యారు. ఇదిలా ఉంటే అయిదో విడతకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా పూడిక మట్టి తొలగింపుతో పాటు తూము, కాలువలు, అలుగు తదితర వాటిని మరమ్మతులు చేయడం, కట్ట పటిష్ట పర్చడం చేయాల్సి ఉంది. నాలుగో విడతలో చేపట్టిన చెరువులకు నిర్ణిత ఆయకట్టు లేకపోవడం వల్ల ఎక్కువ శాతం చెరువులకు మంజూరు రాలేదు. ఉమ్మడి జిల్లా మొత్తంలో రూ.58.61 కోట్ల వ్యయంతో 244 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపించడంతో 240 మంజూరు అయ్యాయి. వీటికి నిర్ణీత గడువులోగా టెండర్లు పూర్తి చేయడంతో పాటు, ఒప్పందాలు కూడా పూర్తి చేసేశారు.. పనులు ప్రారంభించి పూర్తి చేసే క్రమంలో వర్షాలు కురియడంతో ఆపేయాల్సి వచ్చింది.. తరువాత పనులు మొదలు పెట్టిన బిల్లులు రాకపోవడం, ఎన్నికలు రావడంతో అసంపూర్తిగానే ఉన్నాయి. అయిదో విడతలో పనులు చేసేందుకు ఆయకట్టు ఉంటే చెరువులు లేవని అధికారులు అంటున్నారు. కానీ గత లెక్కల మేరకు 7వేలకు పైగా చెరువులు ఉంటే పథకం కింద ఇప్పటివరకు 1491 చెరువులను మాత్రమే తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో చెరువులకు నిధులు మంజూరయ్యాయి. కానీ ఇప్పటివరకు 1213 చెరువుల పనులు పూర్తయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు
అయిదో విడత చెరువుల పునరుద్ధరణపై సంబంధిత అధికారి ఎస్‌ఈ మురళీధర్‌ను వివరణ కోరగా ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, దీంతో ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని ఆయన చెప్పారు. గత విడతలో అసంపూర్తిగా ఉన్న చెరువుల పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
* తలమడుగు మండలంలోని నందిగామ చెరువు ఇది. మూడు, నాలుగో విడతలలో మండలంలో అనేక చెరువుల పునరుద్ధరణకు మిషన్‌ కాకతీయ కింద నిధులు కేటాయించారు. చాలా చోట్ల బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు ఆపేశారు. మండలంలోని దామన్‌కుంట, కొత్తూరు తదితర చెరువుల పునరుద్ధరణ పనులు ఇంకా జరగాల్సి ఉంది.
* ఇది ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట చెరువు. మూడో విడతలో ఈ చెరువు పునరుద్ధరణకు నిధులు కేటాయించారు. పనులు జాప్యం కావడంతో నిర్మాణం ఆగిపోయింది. ప్రస్తుతం చేసిన పనులకు కూడా బిల్లుల చెల్లింపు లేకపోవడంతో పనులు కొనసాగడం లేదు. మండలంలో డొంగర్‌గావ్‌, దస్నాపూర్‌, పాటగూడ తదితర చెరువుల నిర్మాణాలు నిలిచిపోయాయి.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.