close

తాజా వార్తలు

తప్పిన పెను ప్రమాదం

 గుట్కా తినేందుకు డ్రైవర్‌ స్టీరింగ్‌ వదిలేశాడు!
 వేగం వద్దని చెప్పినా వినలేదన్న ప్రయాణికులు
 బస్సుబోల్తా ఘటనలో 30 మందికి గాయాలు

న్యూస్‌టుడే, మల్హర్‌, కాటారం :  మల్హర్‌ మండలం పీవీ నగర్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడటంతో అదృష్టవశాత్తు పెనుప్రమాదమే తప్పింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఏపీ01వై 2992 నంబరు గల బస్సు గోదావరిఖని నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని భూపాలపల్లికి వెళ్తుండగా పీవీనగర్‌ సమీపంలో అదుపు తప్పి రోడ్డు కిందకు రెండు పల్టీలు కొట్టి బోల్తాపడింది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో వేగంగా నడపటమేగాక, గుట్కా తినే క్రమంలో స్టీరింగ్‌ వదిలేశారని బాధితులు తెలిపారు.. 63 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడటంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.  ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న కొయ్యూరు ఎస్సై నరేశ్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్లో 19 మందిని కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, నలుగురిని మంథని ఆసుపత్రికి పోలీస్‌ జీపులో, 108 ఆంబులెన్సులో తరలించారు. కొందరిని మహదేవ్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిచికిత్స చేయించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ భాస్కరన్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లు మహదేవ్‌పూర్‌ సామాజిక ఆసుపత్రిలో, కాటారం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని మితిమీరిన వేగంతో బస్సు నడపడం ప్రమాదానికి మరో కారణంగా చెప్పవచ్చు. పీవీ నగర్‌కు ముందు మానేరు వంతెన దాటగానే ఈ ఘటన జరిగింది.  రహదారి సక్రమంగా లేకపోవడం, రహదారికి ఇరువైపులా సైడ్‌బర్‌్్మ కూడా లేదు. గుంతలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా డ్రైవర్‌ బస్సును అజాగ్రత్తగా నడుపుతూ వేగాన్ని నియంత్రించలేకపోవడం వలనే లోయలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. బస్సు రోడ్డు దిగి వెళ్తోందని అరిచినా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రయాణికులు వెల్లడించారు. చివరికి ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అందుబాటులో లేని వైద్యులు..
బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని కాటారం పీహెచ్‌సీ ఉంది. అక్కడికే 19 మంది క్షతగాత్రులను తరలించారు. పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది వైద్యసేవలు అందించారు. చికిత్స ఆలస్యం అవుతుండటంతో 10 మందిని తిరిగి మరికొంత దూరంలోని మహదేవ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించలేకపోయారు.

క్షతగాత్రుల వివరాలు..
ఎస్‌, రవీందర్‌, పి. శేషయ్య, టి. అనూష, టి. లక్ష్మి, టి. మొండయ్య, పొట్ల కరుణాకర్‌, పి. శ్రీలత, పి. శ్రీనివాస్‌, డీ. శ్రీనివాస్‌, బాసాని లింగయ్య, ఆవుల మల్లయ్య, పి. లక్ష్మి, పి. వెంకటస్వామి, సూరం రమాదేవి, కె. రజిత ఉన్నారు. వీరితో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన అంబాల శ్రీనివాస్‌కు చేయి విరిగింది. ఆయన సతీమణి శ్రీలత తలకు గాయమైంది. భూపాలపల్లి మండలం పంగిడిపల్లికి చెందిన తూర్పాటి లక్ష్మీ తలకు గాయమైంది. గుండా అరుణ అనే ప్రయాణికురాలుకు చేయి విరిగింది. బోగిని రాజమ్మకు తలకు గాయమైంది. విధులు ముగించుకుని వెళ్తున్న మహదేవ్‌పూర్‌ మండలం సూరారం గ్రామానికి చెందిన పార్వతి అనే కండక్టర్‌కు సైతం గాయాలయ్యాయి. మరికొందరికి చేతులకు, కాళ్లకు, తలకు, ముఖానికి గాయాలయ్యాయి.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.