close

తాజా వార్తలు

ఏమరుపాటే కార్మికుల ప్రాణాలు తీసింది

మిల్లర్‌ గుంతలో పడిన ఘటనలో ప్రాథమిక అంచనా 
శవపరీక్ష అనంతరం సొంతూళ్లకు మృతదేహాలు

గజ్వేల్‌, న్యూస్‌టుడే : కాలువ నిర్మాణం చేపట్టే చోట తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పర్యవేక్షకులు దృష్టి సారించకపోవడం, కార్మికుల ఏమరుపాటే ఇద్దరి మృతికి కారణమైందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం మక్తమాసన్‌పల్లి వద్ద కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ నిర్మాణం జరుగుతుండగా రెడీ మిక్స్‌ మిల్లర్‌ పిల్లర్‌ గుంతలో పడి మహబూబునగర్‌ జిల్లా అప్పనపల్లి గ్రామానికి చెందిన సంజీవ్‌ (45), నారాయణపేట మండలం సింగారం వాసి మహేశ్‌ (21) అనే కార్మికులు శుక్రవారం రాత్రి చనిపోయిన విషయం తెలిసిందే. కార్మికులు పనులు చేస్తున్న చోట వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పనులు చేయించే వారు లేకపోవటం ప్రధాన సమస్యగా మారినట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి పనులు చేసేందుకు కార్మికులను తీసుకొస్తున్న మేస్త్రీలు పని ప్రదేశంలో జాగ్రత్తలు తీసుకోవటంలో పూర్తిగా విఫలమయ్యారు. మక్తమాసన్‌పల్లి వద్ద కాలువ నిర్మాణంలో భాగంగా పది అడుగుల లోతు పిల్లర్‌ గుంతలు తీశారు. అడుగు నుంచి కాంక్రీటు బెడ్‌ వేస్తున్నారు. కాంక్రీట్‌ వేసేందుకు రెడీ మిక్స్‌ మిల్లర్‌ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఖాళీ వాహనమే దాదాపు ఆరు టన్నులు బరువుంటుంది. ఇందులో సిమెంటు, కంకర, నీళ్లు, ఇసుక వేసిన తరువాత (కాంక్రీటు) నాలుగు టన్నులు కలిపితే పది టన్నుల మేర బరువు అవుతుంది. ఇంత బరువు ఉండే వాహనాన్ని పిల్లర్ల గుంతల అంచువరకు తీసుకు వెళ్లి ప్లాస్టిక్‌ గొట్టం ద్వారా కాంక్రీటును గుంతలోకి వదులుతున్నారు. ఆ సమయంలో అక్కడ భూమి గట్టిగా ఉందా? వదులుగా ఉందా? అనేది చూడకుండా పనులు చేపట్టడంతో మట్టి కదిలి వాహనం జారిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వాహన చోదకుడు సుశిక్షితుడా? లేదా అనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి కాంక్రీటు పోసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో పిల్లర్‌ గుంతలో అయిదుగురు కార్మికులుగా కాంక్రీటును జారవిడవడానికి ముందు ఇద్దరు పైకి రాగా శివరాజు అనే కార్మికుడు గుంతలో ఓ వైపు ఉండి ప్లాస్టిక్‌ గొట్టాన్ని చూస్తుండిపోయాడు. చనిపోయిన సంజీవ్‌, మహేశ్‌లు కింద పడుతున్న కాంక్రీటును మిషన్‌తో సరి చేసేందుకు లోపలే ఉన్నారు. అదే సమయంలో వాహనం జారి గుంతలో పడింది. వారు లోపల ఉండటంతో వాహనం పడుతుందన్న విషయం కూడా వారికి తెలియదు. కాంక్రీటు వాహనం పడిపోతోందని పైనుంచి ఎవరైనా హెచ్చరిక చేసి ఉంటే వారు తప్పించుకుని ఉండేవారని ప్రత్యక్ష సాక్షి శివరాజు చెప్పారు. ఆ సమయంలో తాను గొట్టాన్ని చూస్తూ ఉండిపోయాయని క్షణాల్లో వాహనం గుంతలో పడిపోవటంతో షాక్‌కు గురయినట్లు చెప్పారు. నిరుడు డిసెంబరులో ఇక్కడే ఓ కార్మికుడు నీటి గొట్టాన్ని ఎత్తి పట్టుకోగా పైన ఉన్న విద్యుత్తు తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఆ సమయంలోనూ అక్కడ పర్యవేక్షకుడు లేకపోవటంతో గొట్టం ఎంత పైకి ఎత్తాలో తెలియక కార్మికుడు మృతి చెందాడని తోటి కార్మికులు చెప్పారు. 
304ఏగా కేసు నమోదు చేసిన పోలీసులు 
మక్తమాసన్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంపై ఎస్‌ఐ అంజాగౌడ్‌ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా (సెక్షన్‌ 304ఎ) కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలకు శనివారం శవపరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియల నిమిత్తం వారు సొంతూళ్లకు తరలించారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.