close

తాజా వార్తలు

అమ్మ భక్తులకు అష్టకష్టాలు

గాడితప్పిన బాసర ఆలయ పాలన
అవినీతితో అభివృద్ధికి ఆటంకం
బాసర, న్యూస్‌టుడే

నిర్మల్‌ జిల్లాలో వెలసిన బాసర ఆలయం మళ్లీ వివాదాల బాటలో పయనిస్తోంది. అవినీతి ఆలయ అభివృద్ధికి ఆటంకంగా, అమ్మవారి ప్రాశస్థ్యానికి మచ్చగా మారుతోంది. ఆలయానికి పూర్తిస్థాయి ఈవో నియామకం జరగకపోవటం, సిబ్బంది కొరత, ఉన్న సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో భక్తులకు కష్టాలు తప్పడం లేదు. కనీస వసతైన తాగునీటి అవసరాన్ని తీర్చలేని పరిస్థితిలో ఆలయం కొట్టుమిట్టాడుతోంది. అయిదేళ్లుగా జిల్లాకు చెందిన మంత్రి దేవాదాయశాఖను పర్యవేక్షిస్తున్నా ఆలయంలో అభివృద్ధి ఆనవాళ్లు మాత్రం కనిపించటం లేదు.
బాసర సరస్వతీ ఆలయానికి  ఏడాదికి రూ.20 కోట్ల ఆదాయం ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. కానీ ఆ మేరకు సౌకర్యాలను విస్తరించటంలో దేవాదాయశాఖ విఫలమవుతోంది. భక్తుల నుంచి వచ్చే ఆదాయంపైన ఉన్న చిత్తశుద్ధి వారికి సౌకర్యాలను కల్పించటంలో లేదు. పైగా ఆలయంలో తిష్ఠవేసిన అవినీతి రాకాసి ఆకలికి ఆలయ నిధులు కర్పూరంలా కరిగిపోతున్నాయి. మూడేళ్లుగా ఆలయంలో ఎన్నో వివాదాలు చెలరేగాయి. మరెన్నో అవినీతి కథలు బయటపడ్డాయి. సిబ్బంది బాధ్యతారాహిత్యం, పేరుకుపోయిన అవలక్షణాలు ఆలయంలో అపశ్రుతులకు కారణమవుతున్నాయి. వీటిని అరికట్టడంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులుగాని, ప్రభుత్వంగాని సరైన రీతిలో స్పందించటం లేదు. ఆలయాన్ని అభివృద్ధి పరచటంలో, అవినీతిని అరికట్టడటంలో దేవాదాయశాఖ మంత్రి స్పందించడం లేదని అమ్మవారి భక్తులు అసంతృప్తితో ఉన్నారు. మిగతా ఆలయాలను సందర్శించి అక్కడి పరిస్థితులపై, అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బాసరలో ఇప్పటివరకు సమీక్ష సమావేశం నిర్వహించలేదు. అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై కఠినచర్యలు లేవు. ఆలయంలో భారీగా అవినీతి జరిగిందని, అవినీతికి పాల్పడినవారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించినా ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవినీతిలో ప్రమేయమున్న అధికారులపై చర్యలు తీసుకోకపోవటంతో వారు మరింతగా అవినీతికి పాల్పడుతున్నారు.
పాలన పడకేసింది
గత ఈవో పదవీకాలం ముగిసిన అనంతరం ఆలయానికి పూర్తిస్థాయి ఈవోను నియమించలేదు. రంగారెడ్డి జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సంధ్యారాణికి బాసర ఆలయ బాధ్యతలు అప్పగించారు. ఆమె బాసర ఆలయ ఈవోగా, రంగారెడ్డి జిల్లా ఏసీగా, రాజధానిలోని రాంగోపాల్‌ ట్రస్టు బాధ్యులుగా మూడు పదవులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా అనారోగ్య కారణాలతో ఆమె సెలవుపై వెళ్లారు. ఈ క్రమంలో దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో ఏసీగా విధులు నిర్వర్తిస్తున్న వినోద్‌ను ఆలయ ఈవోగా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఆయనకు అదనపు బాధ్యతలు కావటం, రాజధానిలో పనిఒత్తిడితో ఆలయ వ్యవహారాలపై అంతగా దృష్టి సారించటం లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ పాలన పడకేసింది. ఈవో లేకపోవటంతో సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏళ్లుగా తిష్ఠ వేసిన స్థానిక ఉద్యోగులు కావటంతో భక్తుల సమస్యల పరిష్కారానికి, వారికి జవాబుదారీగా ఏ ఒక్కరూ ముందుకురావటం లేదు. దీంతో భక్తులకు కనీస వసతులు కరవయ్యాయి. ఆలయంలో ఉన్న హుండీలు నిండిపోయినా లెక్కించలేని స్థితిలో ఆలయం ఉంది. మరోవైపు ఆలయంలో ఉద్యోగుల కొరత భక్తులకు సేవలందించటంలో ప్రభావం చూపుతోంది. వేసవిలో అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారు. ఆలయం మొత్తంలో తాగటానికి మంచినీరు భక్తులకు అందుబాటులో లేదు. ఆలయ ఆవరణలో రెండుచోట్ల ఏర్పాటుచేసిన నల్లాల ద్వారా వచ్చే వేడినీటిని తాగి ఈ వేసవిలో భక్తులు తమ దాహార్తిని తీర్చుకున్నారు. రద్దీ సమయంలో ఆలయంలో భక్తుల అవసరాలను పట్టించుకునే నాథుడే లేర[ు. కనీసం భక్తులకు సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటుచేసుకోలేని దుస్థితి ఆలయంలో నెలకొంది. బాసర ఆలయానికి ప్రధాన శత్రువు అవినీతే. ఆలయంలోని అనేక విభాగాల్లో ఉద్యోగులు ఏళ్లుగా పాతుకుపోయారు. సంవత్సరానికి రూ.20 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి కనిపించదు.
అభివృద్ధి జాడే లేదు
దశాబ్దాలుగా బాసర సరస్వతీ ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పండగలు ఉత్సవాల సమయంలో రద్దీ విపరీతంగా పెరిగి భక్తులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే విజ్ఞప్తులకు స్పందించిన ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. సంవత్సరం కిందట ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలయ అభివృద్ధిని దశల వారీగా చేపడతామని, మొదటి విడతగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆ నిధుల జాడ లేదు. అయిదేళ్ల కాలంలో గుడి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండోసారి ఏర్పడిన ఈ ప్రభుత్వంలోనైనా అభివృద్ధి జరుగుతుందని ఆశించినా అడుగుముందుకు పడటం లేదు. అభివృద్ధి నమూనాలు సిద్ధమైన ప్రస్తుత తరుణంలో నిధుల తాజాస్థితి ఏంటో తెలియక అధికారులు అయోమయస్థితిని ఎదుర్కొంటున్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.