close

తాజా వార్తలు

మళ్లీ పులి పంజా..

హతమైన ఆవు...తప్పించుకున్న ఎద్దు

తాంసి-కె పరిసరాల్లో భయం భయం

పులి దాడిలో హతమైన ఆవును పరిశీలిస్తున్న డిప్యూటీ ఎఫ్‌ఆర్వో గీరయ్య, గ్రామస్థులు

భీంపూర్‌, న్యూస్‌టుడే: పులి మళ్లీ పంజా విసిరింది. తాంసి-కె పంటచేలలో ఆవును హతమార్చింది. మరో ఎద్దుపై దాడి చేయబోగా.. తప్పించుకుంది. ఈ ఘటన శనివారం తాంసి-కె గ్రామస్థులను ఉరుకులు.. పరుగులు పెట్టించింది. కునార్పు వినోద్‌ పంటచేలలో పత్తి తీసేందుకు వెళ్లిన కూలీలకు చనిపోయిన ఆవు కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు పులి గాండ్రింపులతో వినిపించాయంటూ పంటచేలలో పనిచేస్తున్న వారు గ్రామానికి పరుగులు పెట్టారు. విషయం అటవీ అధికారులకు తెలపడంతో ఘటన స్థలాన్ని సందర్శించి పులి దాడిలోనే ఆవు హతమైనట్లుగా నిర్ధరించారు. వారం రోజుల వ్యవధిలోనే గొల్లఘాట్‌, తాంసి-కె శివారులో పశువులు పులి దాడిలో మృత్యువాత పడటం పరిసర గ్రామస్థులకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. అటవీఅధికారులు పులి జనావాసాల్లోకి రాదని చెబుతున్నా.. మంచిర్యాల జిల్లా కోటపల్లి అటవీ ప్రాంతంలో పశువుల కాపరిపై పులిదాడికి దిగడం.. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో పంటచేనులో పనిచేస్తున్న మహిళపై దాడి చేసి హతమార్చిన ఘటనలు శుక్రవారం చోటు చేసుకోవడం స్థానికుల్లో మరింత భయాందోళనకు దారితీస్తోంది. తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి తరచూ వస్తున్న పులుల దారి మళ్లించడమో.. లేక వచ్చిన పులులను తిరిగి అక్కడికి పంపించడమో చేయాలని స్థానికులు కోరుతున్నారు. పులి దాడిలో శనివారం రైతు బరుకంటి ఆశన్న ఆవు మృత్యువాత పడగా.. దుమ్మ అడెల్లు ఎద్దు పులి దాడి నుంచి తృటిలో తప్పించుకుంది. కాలికి తీవ్రగాయమైంది. ఘటన స్థలాన్ని గ్రామస్థులతో కలసి డిప్యూటీ రేంజ్‌ అధికారి గీరయ్య సందర్శించారు. హతమైన ఆవు పులి దాడిలో మృతిచెందినట్లుగా నిర్ధరించారు. బాధిత రైతులకు తగు పరిహారం అందజేస్తామని భరోసానిచ్చారు. తాజా ఘటనతో పరిసరప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే అటువైపు వెళ్లే ఉపాధ్యాయులను అటవీశాఖ జీపులో తరలిస్తుండగా.. గ్రామస్థులు ద్విచక్రవాహనానికి బదులుగా బస్సు, ఆటోల్లో భయం భయంతో ఇతర ప్రాంతాలకు రాకపోలకు సాగిస్తున్నారు. పంటచేల వైపు వెళ్లడమే మానేశారు. పత్తిని అలాగే వదిలేస్తున్నారు. పశువులను పంటచేలకు వదిలేస్తున్నారు. అలా పంటచేలకు వదిలేయడంతో పులి నేరుగా పంటచేలలో వచ్చి పశువులపై దాడికి దిగడం మరింత ఇబ్బందికర పరిణామంగా తయారైంది.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.