ఈ సంక్రాంతికి...జంతికరకరలు

సంక్రాంతికి ముంగిట్లో ముగ్గులు అందరూ వేస్తారు. కానీ మీరు మాత్రం కాస్త ప్రత్యేకంగా నూనెలో అందమైన మెలికల ముగ్గులు వేసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ రకరకాల జంతికలు మీ కోసమే. వెంటనే ప్రయత్నించి రుచులను ఆస్వాదించండి మరి...

Updated : 15 Jun 2021 12:52 IST

సంక్రాంతికి ముంగిట్లో ముగ్గులు అందరూ వేస్తారు. కానీ మీరు మాత్రం కాస్త ప్రత్యేకంగా నూనెలో అందమైన మెలికల ముగ్గులు వేసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ రకరకాల జంతికలు మీ కోసమే. వెంటనే ప్రయత్నించి రుచులను ఆస్వాదించండి మరి...


కొబ్బరిపాలతో

కావాల్సినవి: బియ్యప్పిండి- రెండు కప్పులు, చిక్కని కొబ్బరిపాలు- కప్పు, మినప్పిండి- పావుకప్పు- నువ్వులు, జీలకర్ర- టీస్పూన్‌ చొప్పున, ఇంగువ- చిటికెడు, వెన్న- టేబుల్‌స్పూన్‌, ఉప్పు- తగినంత.
తయారీ:  వెడల్పాటి గిన్నెలో బియ్యప్పిండి, మినప్పిండి, వెన్న, మిగిలిన పదార్థాలన్నీ వేయాలి. దీంట్లో కొబ్బరిపాలు పోస్తూ బాగా కలపాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా పోయాలి. కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. జంతికల గొట్టంలో పిండి మిశ్రమాన్ని పెట్టి జంతికలను నూనెలోకి ఒత్తుకోవాలి. నేరుగా నూనెలోకి వేయడం ఇబ్బందిగా ఉంటే.. గరిటె మీద వేసుకుని నూనెలోకి వదలొచ్చు. మధ్యస్థంగా ఉండే మంట మీద జంతికలను రెండు వైపులా వేయించి తీయాలి.


అటుకులతో

కావాల్సినవి: బియ్యప్పిండి, అటుకులు- కప్పు చొప్పున, కారం- టీస్పూన్‌, నువ్వులు- రెండు టీస్పూన్లు, వాము- టీస్పూన్‌, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత.  
తయారీ: అటుకుల్లో నీళ్లు పోసి కాసేపు నానబెట్టి నీటిని వంచేయాలి. తర్వాత వీటిని  మెత్తని పేస్టులా చేయాలి. గిన్నెలో బియ్యప్పిండి, అటుకుల పేస్టు, మిగతా పదార్థాలన్నీ వేయాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ మిశ్రమాన్ని ముద్దలా కలపాలి. జంతికల గొట్టంలో కాస్త నూనె రాసి, పిండి మిశ్రమాన్ని పెట్టాలి. కడాయిలో నూనె పోసి వేడి చేసి జంతికలు వేయాలి. వీటిని మధ్యస్థంగా ఉండే మంట మీద రెండు వైపులా వేయించి తీయాలి. కొన్ని జంతికలను సన్నగా, మరికొన్నింటిని కాస్త లావుగానూ వేసుకోవచ్చు.


మిక్స్‌డ్‌దాల్‌తో

కావాల్సినవి: బియ్యప్పిండి- రెండు కప్పులు- మినప్పప్పు- రెండు టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు- టేబుల్‌స్పూన్‌ చొప్పున, కారం- టేబుల్‌స్పూన్‌, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.
తయారీ:   మినప, సెనగ, పెసర, కందిపప్పులను వేయించి పొడి చేసుకోవాలి. వెడల్పాటి పాత్రలో బియ్యప్పిండి, ఈ పొడి వేయాలి. దీంట్లోనే మిగతా పదార్థాలు వేసి బాగా కలపాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండి ముద్దలా కలపాలి. జంతికల గొట్టంలో కొద్దిగా నూనె రాసి కొంచెం పిండిని అందులో పెట్టాలి. కడాయిలో నూనె పోసి మరిగించి జంతికలు వేయాలి. వీటిని మధ్యస్థంగా ఉండే మంట మీద రెండు వైపులా వేయించి తీయాలి.


మసాలా జంతికలు

కావాల్సినవి: బియ్యప్పిండి- రెండు కప్పులు, సెనగపిండి- ముప్పావు కప్పు, వెన్న- పావు కప్పువాము, నువ్వులపొడి- రెండు టీస్పూన్లు, పసుపు- అర టీస్పూన్‌, ఉప్పు- తగినంత, కారం- టీస్పూన్‌, గరంమసాలా పొడి- టీస్పూన్‌, చాట్‌మసాలా పొడి- అర టీస్పూన్‌.
తయారీ:  వెడల్పాటి పాత్రలో బియ్యప్పిండి, సెనగపిండి మిగతా పదార్థాలన్నీ వేసుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దలా కలపాలి. జంతికల గొట్టంలో కొద్దిగా నూనె రాసి కొంచెం మిశ్రమాన్ని పెట్టాలి. కడాయిలో నూనె పోసి మరిగించి జంతికలు వేయాలి. మధ్యస్థంగా ఉండే మంట మీద రెండు వైపులా వేయించి తీయాలి.


మనోహరం

కావాల్సినవి: సెనగపిండి- కప్పు, బియ్యప్పిండి- అరకప్పు, వెన్న- టేబుల్‌స్పూన్‌, ఉప్పు- చిటికెడు. బెల్లంపాకం కోసం: బెల్లం తురుము- ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి- అర టీస్పూన్‌.
తయారీ:  పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండి, మిగతా పదార్థాలు వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోస్తూ ఈ మిశ్రమాన్ని ముద్దలా కలపాలి. జంతికల గొట్టం లోపల కొద్దిగా నూనె రాయాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి జంతికలు వేయాలి. మధ్యస్థంగా ఉండే మంట మీద వీటిని రెండు వైపులా వేయించాలి. వీటిని చల్లార్చి గాలి తగలకుండా భద్రపరచాలి. ఇప్పుడు వెడల్పాటి పాత్రలో బెల్లం తురుము కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టాలి. చిన్న పాత్రలో నీళ్లు పోసి బెల్లంపాకాన్ని వేసి దానితో ఉండచుట్టాలి. ఉండలా చుట్టుకుంటే పాకం సిద్ధమైనట్టే. దీంట్లో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ పాకంలో ముందుగా చేసి పెట్టుకున్న మురుకలు వేసి కాసేపు ఉంచి తీసి ప్లేటులో వేసి బాగా చల్లారిన తర్వాత తీసి దాచాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని