వేడీ... వేడీ... పకోడీ!

పైన క్రిస్పీగా... లోన సాఫ్ట్‌గా... వెరసి... టేస్టీగా.. కారం కారంగా... తియ్యతియ్యగా.. పుల్లపుల్లగా... వెరైటీ రుచుల్లో కాలీఫ్లవర్‌, పనీర్‌, చికెన్‌, వెజ్‌ రకాలకు షెజ్‌వాన్‌, చిల్లీ సాస్‌లు తోడైతే ఆ పకోడీలను ఆహా ఏమి రుచి అంటూ తినేయాల్సిందే మరి.

Updated : 20 Jun 2021 06:22 IST

పైన క్రిస్పీగా... లోన సాఫ్ట్‌గా... వెరసి... టేస్టీగా.. కారం కారంగా... తియ్యతియ్యగా.. పుల్లపుల్లగా... వెరైటీ రుచుల్లో కాలీఫ్లవర్‌, పనీర్‌, చికెన్‌, వెజ్‌ రకాలకు షెజ్‌వాన్‌, చిల్లీ సాస్‌లు తోడైతే ఆ పకోడీలను ఆహా ఏమి రుచి అంటూ తినేయాల్సిందే మరి.

కాలీఫ్లవర్‌తో...

కావాల్సినవి: కాలీఫ్లవర్‌- ఒకటి (మీడియం సైజ్‌ ముక్కలుగా కోసుకోవాలి), సెనగపిండి- అర కప్పు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి- పావు కప్పు చొప్పున, ఉప్పు- తగినంత, కారం- రెండు చెంచాలు, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌- చిటికెడు, ఉల్లిపాయలు- ఒకటి (సన్నగా కోసుకోవాలి), పచ్చిమిర్చి- రెండు (సన్నగా తురమాలి), అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, నూనె- తగినంత.

తయారీ: కాలీఫ్లవర్‌ను మీడియం సైజ్‌ ముక్కలుగా కోయాలి. పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు కాస్తంత ఉప్పు, కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి మూత పెట్టి రెండు, మూడు నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత ఆ ముక్కలను నీటి నుంచి బయటకు తీసి పక్కకు పెట్టుకోవాలి.

మరో గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, కారం, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కొన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలపాలి. ఈ మిశ్రమంలో కాలీఫ్లవర్‌ ముక్కలను వేసి పిండి ముక్కలకు పట్టేలా కలపాలి.

స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి అది మరిగాక కాలీఫ్లవర్‌ ముక్కలను వేసి మీడియం మంటపై డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి.

చైనీస్‌ స్పెషల్‌...

కావాల్సినవి: క్యారెట్‌, క్యాబేజీ, బేబీ కార్న్‌ తరుగు- అర కప్పు చొప్పున, ఉల్లికాడల తరుగు- పావు కప్పు, షెజ్‌వాన్‌ సాస్‌, చిల్లీసాస్‌- పెద్ద చెంచాన్నర చొప్పున, కార్న్‌ఫ్లోర్‌- మూడు చెంచాలు, మైదా- పావు కప్పు, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా.

తయారీ: పెద్ద గిన్నెలో పై పదార్థాలన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి వేసి బాగా కలపాలి. చివరగా నీళ్లు పోసి బజ్జీల పిండి కంటే కాస్త గట్టిగా కలపాలి. దీంట్లోనే ఉల్లి కాడలను వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని బజ్జీల్లా వేసుకోవాలి. టొమాటో సాస్‌తో తింటే సరి. 

పనీర్‌తో...

కావాల్సినవి: పనీర్‌ ముక్కలు- కప్పు, పెరుగు- అరకప్పు, సెనగపిండి- కప్పు, ఉప్పు- తగినంత, కారం- చెంచాన్నర, అల్లంవెల్లుల్లి ముద్ద, ఛాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌- చెంచా చొప్పున, బియ్యప్పిండి- రెండు పెద్ద చెంచాలు, ఇంగువ- చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: గిన్నెలో పనీర్‌ ముక్కలు, పెరుగు, ఉప్పు, కారం, ఛాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌ వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, ఇంగువ, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి, కొన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలపాలి. పనీర్‌ ముక్కలను ఈ పిండిలో ముంచుతూ కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

మామిడికాయతో...

కావాల్సినవి: సెనగపిండి- కప్పు, సెనగపప్పు ముద్ద- కప్పు, మామిడికాయ తురుము- కప్పు, కొత్తిమీర- కొద్దిగా, కారం, జీలకర్ర- చెంచా చొప్పున, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: గిన్నెలో సెనగపప్పు ముద్ద, మామిడికాయ తురుము, సెనగపిండి, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమం గట్టిగా అనిపిస్తే నీళ్లు చల్లి కొంచెం జారుడు పిండిలా కలిపి పెట్టుకోవాలి.

పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోయాలి. అది వేడి అయ్యే లోపు రెండు మూడు చెంచాల నూనెను ముందుగా తయారుచేసి పెట్టుకున్న మిశ్రమంలో వేసి బాగా కలపాలి. నూనె కాగిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బజ్జీల్లా నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

స్వీట్‌కార్న్‌తో...

కావాల్సినవి: స్వీట్‌కార్న్‌- కప్పు, సెనగపిండి- అర కప్పు, బియ్యప్పిండి- రెండు పెద్ద చెంచాలు, అల్లం తరుగు, జీలకర్ర- చెంచా చొప్పున, తరిగిన పచ్చిమిరపకాయలు- నాలుగు, ఉప్పు- తగినంత, కొత్తిమీర, కరివేపాకు తరుగు- కొద్దిగా, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: మిక్సీ జార్‌లో  అల్లం తరుగు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. ఇందులోనే స్వీట్‌కార్న్‌ వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకుని ఓ గిన్నెలో తీసుకోవాలి. దీంట్లో సెనగపిండి, బియ్యప్పిండి, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసుకోవాలి.

షెజ్‌వాన్‌ చికెన్‌తో...

కావాల్సినవి: చికెన్‌- 350 గ్రా. (ఎముకలు లేకుండా చేప ముక్కల్లా పొడవుగా తీసుకోవాలి), వెల్లుల్లి రెబ్బలు- పది, అల్లం- పెద్ద ముక్క, కరివేపాకు- పావు కప్పు, షెజ్‌వాన్‌ చట్నీ- నాలుగు చెంచాలు,  ఉప్పు- తగినంత, బియ్యప్పిండి- అర కప్పు, నూనె- సరిపడా.

తయారీ: వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, కరివేపాకును మిక్సీలో వేసి కాసిన్ని నీళ్లు పోసి ముద్ద చేసి ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇందులోనే షెజ్‌వాన్‌ చట్నీ, చికెన్‌ ముక్కలు, ఉప్పు వేసి కలిపి పావుగంట పక్కన పెట్టాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక చికెన్‌ ముక్కలను బియ్యప్పిండిలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని