నైవేద్యం సమర్పయామి!

తియ్యటి పూర్ణం బూరెలు.. పుల్లపుల్లగా, కారంకారంగా పులిహోర.. పాల నురగ లాంటి దద్దోజనం.. నోరూరించే బెల్లం పరమాన్నం.. చూడగానే తినాలనిపించే పులగం.. వెరసి అయిదు రకాల రుచులతో వరలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకుందామా..

Updated : 15 Aug 2021 05:14 IST

తియ్యటి పూర్ణం బూరెలు.. పుల్లపుల్లగా, కారంకారంగా పులిహోర.. పాల నురగ లాంటి దద్దోజనం.. నోరూరించే బెల్లం పరమాన్నం.. చూడగానే తినాలనిపించే పులగం.. వెరసి అయిదు రకాల రుచులతో వరలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకుందామా..


పూర్ణం బూరెలు...

కావాల్సినవి: బియ్యం, మినప్పప్పు, సెనగపప్పు, బెల్లం- కప్పు చొప్పున, యాలకులు- అయిదారు, నెయ్యి- తగినంత, వంటసోడా- పావు చెంచా, ఉప్పు- తగినంత.

తయారీ: బియ్యం, మినప్పప్పులను కలిపి కొన్ని గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత కాస్తంత ఉప్పు, వంటసోడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే విడిగా సెనగపప్పును కూడా నానబెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత సరైన పాళ్లలో మరిన్ని నీళ్లు కలిపి పప్పు మెత్తబడకుండా పలుకులుగా ఉడికించాలి. మిగతా నీళ్లను తీసేయాలి. నీళ్లు పూర్తిగా పోయాక ఈ పప్పు, బెల్లం, యాలకులను గ్రైండర్‌లో వేసి రుబ్బాలి. ఆ తర్వాత ఈ ముద్దను లడ్డూల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇష్టమైతే కొబ్బరితురుము, జీడిపప్పు ముక్కలు కూడా కలిపి పెట్టుకోవచ్చు. ఈ లడ్డూలను మినప్పప్పు, బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. వేడివేడి బూరెల మధ్యలో సొట్ట చేసి ఆవు నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటాయి.


బెల్లం అన్నం..

కావాల్సినవి: బియ్యం- కప్పు, పెసరపప్పు- అరకప్పు, బెల్లం- అరకప్పు, యాలకుల పొడి- అర చెంచా, పాలు- కప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌- గుప్పెడు, నెయ్యి- తగినంత.

తయారీ: బియ్యం, పెసరపప్పును కలిపి అరగంట నానబెట్టాలి. ఇప్పుడు 1:3 నిష్పత్తిలో నీళ్లు కలిపి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మిశ్రమంలో యాలకుల పొడి, బెల్లం తురుము కలపాలి. బెల్లం కరిగి కొద్దిగా పలుచబడుతుంది. దీనికి కాచి చల్లార్చిన పాలు కలపాలి. పాన్‌లో నెయ్యి వేడిచేసి కాజూ, కిస్‌మిస్‌ వేయించి నెయ్యితో సహా బెల్లం అన్నంలో కలపాలి. ఉడికిన అన్నంలో రెండు చెంచాల నెయ్యి కలిపితే మంచి రుచి రావడమే కాకుండా అన్నం మెత్తగా మారుతుంది.

* కొన్ని ప్రాంతాల్లో రుచి మెరుగుపడటం కోసం బెల్లంతోపాటు పావుకప్పు చక్కెర కలుపుతారు.

* కొందరు రుచి కోసం చిక్కటి కొబ్బరిపాలూ జత చేస్తారు.

* అన్నం పప్పు పూర్తిగా ఉడికిన తర్వాతే బెల్లం కలపాలి లేకపోతే మెతుకులు గట్టిబడి పరమాన్నం రుచిగా ఉండదు.

* కొన్ని ప్రాంతాల్లో బెల్లం అన్నంలో పప్పు కలపకుండా కేవలం బియ్యం మాత్రమే వాడతారు.


దద్దోజనం...

కావాల్సినవి: బియ్యం, పాలు, పెరుగు- కప్పు చొప్పున, ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, జీలకర్ర, అల్లం తరుగు- చెంచా చొప్పున, ఎండుమిరపకాయలు- అయిదారు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఉప్పు- తగినంత, ఇంగువ- పావు చెంచా, మిరియాలు- అర చెంచా, వేయించిన జీడిపప్పు- కొన్ని.

తయారీ: ఒక వంతు బియ్యానికి మూడొంతుల నీళ్లు పోసి అన్నాన్ని మెత్తగా వండుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించి పాలు కలపాలి. ఇలా చేయడం వల్ల అన్నం మెత్తగా రుచిగా ఉండటమే కాకుండా పెరుగు కలిపాక పులియకుండా ఉంటుంది. పాలు కలిపిన పదినిమిషాల తరువాత తియ్యటి గడ్డ పెరుగు కలపాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతోపాటు ఇంగువ, మిరియాలనూ కలిపేయాలి.

* చాలా ప్రాంతాల్లో దద్దోజనం తాలింపులో సన్నగా తరిగిన అల్లం కలుపుతారు. కొన్నిప్రాంతాల్లో ఆవ పెట్టిన దద్దోజనం చాలా ఫేమస్‌. ఉగాదికి కూడా చేస్తారు. ఒకట్రెండు చెంచాలు ఆవాలు నానబెట్టి రోట్లో రుబ్బి దద్దోజనంలో కలుపుతారు.

*ఈ ప్రసాదం రుచి మరింత పెరగడానికి నెయ్యిలో వేయించిన జీడిపప్పు జత చేస్తే సరి.

* క్యారెట్‌ తురుము, దానిమ్మ గింజలు, కొత్తిమీర తురుము, సన్నగా తరిగిన కీర వంటి వాటిని కూడా కలపొచ్చు. ఈ ప్రసాదం తయారీకి పాతబియ్యం వాడితే రుచి పెరుగుతుంది.

* నిమ్మకాయ/దబ్బకాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది.


పులిహోర...

కావాల్సినవి: పాతబియ్యం- కప్పు, చింతపండు గుజ్జు- అర కప్పు, నువ్వులు, ధనియాలు- చెంచా చొప్పున, మినప్పప్పు, సెనగపప్పు, పల్లీలు- రెండు చెంచాల చొప్పున, మిరియాలు- అరచెంచా, మెంతులు- పావు చెంచా, ఎండు మిరపకాయలు- నాలుగు, పచ్చి మిరపకాయలు- అయిదారు, నువ్వుల నూనె- తగినంత, పసుపు- పావుచెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, ఉప్పు- తగినంత, ఇంగువ- చిటికెడు.

తయారీ: అన్నాన్ని పొడి పొడిగా వండి వార్చుకుని ఆరబోయాలి. చింతపండును వేడినీళ్లలో నానబెట్టి గుజ్జు తీయాలి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, సెనగపప్పు, మిరియాలు, మెంతులు, ఎండు మిరపకాయలు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మరోసారి పొయ్యి వెలిగించి కడాయి పెట్టి తాలింపు కోసం నూనె వేసుకోవాలి. ఇందులో ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పల్లీలు, పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దీనికి చింతపండు రసం కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. చల్లారిన అన్నంలో మసాలా పొడి కలిపేయాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును కలపాలి. చివరగా జీడిపప్పును నెయ్యిలో వేయించి కలిపితే చాలా బాగుంటుంది.  ఈ అన్నాన్ని  ఓ గంట తర్వాత తింటే ఆహా అనకుండా ఉండలేరు. ఇష్టమైతే అన్నంలో అల్లం తురుమూ వేసుకోవచ్చు.


పులగం...

కావాల్సినవి: కొత్త బియ్యం- కప్పు, పెసరపప్పు- అర కప్పు, నెయ్యి- తగినంత, కరివేపాకు- రెండు రెబ్బలు, మిరియాలు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, ఉప్పు- సరిపడా, జీడిపప్పు, బాదం- కొన్ని.

తయారీ: బియ్యం, పెసరపప్పును కలిపి నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. పొయ్యి మీద మందమైన అడుగున్న గిన్నె పెట్టి నెయ్యి వేసుకోవాలి. వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత మూడొంతుల నీళ్లు పోసి మరిగించాలి. ఈ నీటిలో బియ్యం, ఉప్పు వేసి ఉడికించాలి. అన్నం మెత్తగా అయ్యాక దించేసి నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదంతో గార్నిష్‌ చేసుకుంటే రుచికరమైన పులగం రెడీ.

- శ్రీదేవి, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణురాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని