జతకుదిరే.. జతకుదిరే!

వేడివేడి ఉల్లి దోసె, పొగలు కక్కే ఇడ్లీ, గారెలు, పునుగులు, పెసరట్టు, ఊతప్పం... టిఫిన్‌ ఏదైనా దానికి జతగా మంచి చట్నీ లేకపోతే... వాటిని ఆస్వాదించలేం. చట్నీలకోసమే టిఫిన్లు తినేవాళ్లున్నారంటే అతిశయోక్తి కూడా కాదేమో! సులువుగా, రుచిగా చేసుకోగలిగే పచ్చళ్లు ఇవి..

Updated : 24 Oct 2021 05:42 IST

వేడివేడి ఉల్లి దోసె, పొగలు కక్కే ఇడ్లీ, గారెలు, పునుగులు, పెసరట్టు, ఊతప్పం... టిఫిన్‌ ఏదైనా దానికి జతగా మంచి చట్నీ లేకపోతే... వాటిని ఆస్వాదించలేం. చట్నీలకోసమే టిఫిన్లు తినేవాళ్లున్నారంటే అతిశయోక్తి కూడా కాదేమో! సులువుగా, రుచిగా చేసుకోగలిగే పచ్చళ్లు ఇవి..


అల్లం పచ్చడి

కావాల్సినవి: పచ్చిమిర్చి -200 గ్రాములు, అల్లం- 75 గ్రాములు, చింతపండు - 50 నుంచి 75 గ్రాములు, ఉప్పు - కొద్దిగా, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు,

తాలింపు కోసం: నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు- టేబుల్‌ స్పూను, జీలకర్ర- చెంచా, ఎండుమిర్చి- రెండు, వెల్లుల్లి- రెండు రెబ్బలు కరివేపాకు- గుప్పెడు

తయారీ: ముందుగా బాణలీలో రెండు టేబుల్‌ స్పూన్‌ నూనె వేడి చేసి పచ్చిమిర్చి వేయించాలి. తర్వాత అల్లం వేసి పచ్చివాసన పోయే వరకూ ఉంచి....రెండింటినీ చల్లార్చాలి. ఇప్పుడు వాటితో పాటు చింతపండు పులుసు, బెల్లం, ఉప్పు కూడా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బాలి. అవసరాన్ని బట్టి పల్చగా అవ్వడానికి వేడి నీళ్లు వాడండి.  ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండ[ుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకులతో తాలింపు వేసి ఈ మిశ్రమంలో కలిపితే చాలు. కారంగా, పుల్లగా, తీయగా, ఘాటుగా ఉండే అల్లం పచ్చడి సిద్ధం. దీన్ని ఫ్రిజ్‌లో పెడితే వారం వరకూ తాజాగా ఉంటుంది. దోసెలు, గారెలు, ఇడ్లీల్లో అద్దుకుని తింటే అద్భుతమైన రుచి.


వేరుసెనగ పచ్చడి

కావాల్సినవి: వేరుసెనగ- కప్పు, పచ్చిమిర్చి- పది, జీలకర్ర- చెంచా, వెల్లుల్లి- ఒక రెబ్బ, చింతపండు- కొద్దిగా, ఉప్పు సరిపడా, కొత్తిమీర-కట్ట, నూనె తగినంత

తాలింపు కోసం: నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు- టేబుల్‌ స్పూను, జీలకర్ర- చెంచా, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు- గుప్పెడు

తయారీ: ముందుగా పల్లీలను నూనెలేకుండా వేడి చేసి పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత బాణలీలో నూనె చేసి వేడిచేయాలి. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. ఆపై చల్లార్చి మిక్సీలోకి తీసుకోవాలి. ఇందులో చింతపండు, ఉప్పు, కొత్తిమీర కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఏ టిఫిన్‌లలో అద్దుకున్నా భలే రుచి.


టొమాటో- కొత్తిమీర

కావాల్సినవి: టొమాటోలు- మూడు, కొత్తిమీర- పెద్ద కట్ట, పచ్చిమిర్చి-పది, వేరుసెనగ గుళ్లు- చిన్న కప్పు, జీలకర్ర- చెంచా, వెల్లుల్లి- ఒక రెబ్బ, నూనె- తగినంత, ఉప్పు- రుచికి సరిపడా, చింతపండు- చిన్న నిమ్మకాయ సైజంత

తాలింపునకు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు- చెంచా చొప్పున, ఎండుమిర్చి- రెండు, వెల్లుల్లి- ఒక రెబ్బ, కరివేపాకు

తయారీ: ముందుగా బాణలీలో నూనె వేడిచేసి జీలకర్ర, వెల్లుల్లి, పల్లీలు, పచ్చిమిర్చి వేయించాలి. ఆపై టొమాటోలు కూడా వేసి వేగనివ్వాలి. చివరగా ఉప్పు కూడా వేసి దింపేయాలి. చల్లారాక ఇవన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమానికి కొత్తిమీర, చింతపండు కూడా చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి చివర్లో తాలింపు వేస్తే సరి. అన్నిరకాల టిఫిన్లలోకీ బాగుంటుంది.


దబ్బకాయ చట్నీ

కావాల్సినవి: దబ్బకాయ- ఒకటి, బెల్లం-500 గ్రాములు, ఎండుమిర్చి-20, ఉప్పు- తగినంత, మెంతులు- టీ స్పూను, ఆవాలు- టీ స్పూను

తాలింపు కోసం: నూనె- టేబుల్‌ స్పూన్‌, సెనగపప్పు- టేబుల్‌ స్పూన్‌, మినపప్పు- టీ స్పూన్‌, ఆవాలు- టీ స్పూన్‌, ఎండుమిర్చి-రెండు, కరివేపాకు-రెండు రెమ్మలు

తయారీ: ముందుగా దబ్బకాయ ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేయాలి. అందులోనే ఎండుమిర్చి, ఉప్పు కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. మరో బాణలీలో ఆవాలు, మెంతులు విడివిడిగా దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్‌లోకి తీసుకుని కాస్త బెల్లం కూడా చేర్చి రుబ్బుకోవాలి. ఇది కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది. దీనికి సెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు వంటివీ వేసి తాలింపు పెట్టాలి. దీన్ని పునుగులు, ఇడ్లీలు, దోసెల్లోకి తింటే భలే ఉంటుంది. దబ్బకాయలోని సి విటమిన్‌ మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇది పెరుగన్నంలోకీ బాగుంటుంది.  


కొబ్బరి పచ్చడి

కావాల్సినవి: పచ్చికొబ్బరి ముక్కలు- కప్పు, పుట్నాల పప్పు- అరకప్పు, ఉప్పు- తగినంత, చింతపండు- కొద్దిగా, నూనె- తగినంత,

తాలింపుకి: టీస్పూను చొప్పున ఆవాలు, మినపప్పు, ఎండు మిర్చి- రెండు, వెల్లుల్లి- ఒక రెబ్బ, కరివేపాకు- కొద్దిగా

తయారీ: ముందుగా బాణలీలో నూనె వేసుకుని వేడి చేయాలి. దాంట్లో పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత మిక్సీ జార్‌లోకి మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా రుబ్బాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకోవచ్చు. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని.... తర్వాత ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేయాలి. ఇది వేడివేడి ఇడ్లీలు, అట్లు, కుడుములు వంటివాటికి చక్కటి కాంబినేషన్‌. కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు కోరు తీసి ఐస్‌ట్రేల్లో ఉంచి ఫ్రిజ్‌లో దాచిపెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సమయానికి తీసి ఉపయోగించుకోవచ్చు.


టొమాటో- ఉల్లి చట్నీ

కావాల్సినవి: టొమాటోలు- మూడు, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- ఆరేడు, మినపప్పు- చెంచా, మెంతులు- కొద్దిగా, ధనియాలు- చెంచా, జీలకర్ర-చెంచా, వెల్లుల్లి-రెబ్బ, చింతపండు- చిన్న నిమ్మకాయ పరిమాణంలో, నూనె- తగినంత, ఉప్పు-సరిపడా

తాలింపు: ఆవాలు- చెంచా, మినపప్పు-చెంచా, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు- ఒక రెబ్బ

తయారీ: ముందుగా బాణలీ వేడి చేసుకుని మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఒకదాని తర్వాత మరొకటి వేయించుకోవాలి. ఆపై పచ్చిమిర్చి వేయాలి. ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కలు ఆపై కాసేపాగి టొమాటోలు కూడా వేసి వేయించాలి. తర్వాత చల్లార్చుకుని చింతపండు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆపై ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసుకోవాలి. ఇది పెసరట్టు, దోసె, ఊతప్పం, ఇడ్లీల్లోకి టేస్టీగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయల కన్నా... తాజాగా చేసుకొనే ఈ పచ్చళ్ల వల్ల పోషకాలు కూడా అందుతాయి. టమాటాల్లోని కెరొటినాయిడ్లు కంటికి రక్షణగా నిలుస్తాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని