బియ్యప్పిండితో  స్వీటుగా... ఘాటుగా!

చిన్నారుల కోసం కుర్‌కురే లాంటి వెరైటీ స్నాక్స్‌... పెద్దవాళ్లకిష్టమైన జంతికలు, చెక్కలు... ఇంటిల్లిపాదికీ నోరూరించే బిస్కెట్లూ, లడ్డూలు...  వీటన్నింటినీ ఒకే పిండితో చేసేయొచ్చు... ఎలా అంటారా?... బియ్యప్పిండి డబ్బా తియ్యండి...

Updated : 05 Dec 2021 06:25 IST

చిన్నారుల కోసం కుర్‌కురే లాంటి వెరైటీ స్నాక్స్‌... పెద్దవాళ్లకిష్టమైన జంతికలు, చెక్కలు... ఇంటిల్లిపాదికీ నోరూరించే బిస్కెట్లూ, లడ్డూలు...  వీటన్నింటినీ ఒకే పిండితో చేసేయొచ్చు... ఎలా అంటారా?... బియ్యప్పిండి డబ్బా తియ్యండి...


కుర్‌కురే...

కావాల్సినవి: బియ్యప్పిండి- కప్పు, శనగపిండి- పావు కప్పు, గోధుమ పిండి- రెండు పెద్ద చెంచాలు, వంటసోడా- పావు చెంచా, ఉప్పు- తగినంత, నీళ్లు- రెండు కప్పులు, బటర్‌- చెంచా,  కార్న్‌ఫ్లోర్‌- పెద్ద చెంచా, కారం, గరంమసాలా, చాట్‌ మసాలా- అర చెంచా చొప్పున, చక్కెర పొడి- చెంచా, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: పెద్ద గిన్నెలో బియ్యప్పిండి, శనగపిండి, గోధుమ పిండి, వంటసోడా, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా దోశ పిండిలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి చిన్న మంటపై వేడిచేస్తూ కలుపుతూ ఉండాలి. ఇది దగ్గరపడ్డాక కాస్తంత బటర్‌ కూడా వేసి మరోసారి బాగా కలిపి చపాతీ పిండిలా అయ్యాక మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత దీనికి కాస్తంత కార్న్‌ఫ్లోర్‌ జత చేయాలి. ఈ పిండిని చిన్న గోళీలంత సైజ్‌లో తీసుకుని అర చేతుల్లో పెట్టుకుని వేళ్లతో పొడవుగా కుర్‌కురేల్లా చేసుకోవాలి. వీటిని కాగే నూనెలో వేసి క్రిస్పీగా, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కారం, ఉప్పు, గరంమసాలా, చాట్‌ మసాలా, చక్కెర పొడి వేసి బాగా కలపాలి. అంతే కరకరలాడే రుచికరమైన బియ్యప్పిండి కుర్‌కురే రెడీ.


బిస్కెట్లు...

కావాల్సినవి: బియ్యప్పిండి- కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, చక్కెర- అర కప్పు, యాలకుల పొడి- పావు చెంచా, నూనె, ఉప్పు- తగినంత, వంటసోడా- చిటికెడు, నీళ్లు-తగినన్ని.

తయారీ: పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. గిన్నెలో బియ్యప్పిండి, వంటసోడా, ఉప్పు, యాలకుల పొడి,  నెయ్యి వేసి కలపాలి. కొన్ని నీళ్లలో చక్కెర వేసి కరిగించాలి. ఈ నీటిని బియ్యప్పిండిలో పోసి కలపాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలిపి పావు గంట నానబెట్టాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ఈ మధ్యలోనే పిండిని కాస్త మందమైన చపాతీలా చేసుకోవాలి. దీన్ని చాకుతో అంచులను తీసేసి నచ్చిన ఆకారం (స్క్వేర్‌, సర్కిల్‌, ట్రయాంగిల్‌, డైమండ్‌)లో కట్‌ చేసుకోవాలి. వీటిని కాగే నూనెలో వేసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.  


వెల్లుల్లి మురుకులు...

కావాల్సినవి: వెల్లుల్లి రెబ్బలు- ఎనిమిది, బియ్యప్పిండి- కప్పున్నర, శనగపిండి- అర కప్పు, ఉప్పు- తగినంత, జీలకర్ర- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, కారం- అర చెంచా, బటర్‌- పెద్ద చెంచా, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: వెల్లుల్లి రెబ్బలను మిక్సీజార్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి మరోసారి మిక్సీ తిప్పాలి. ఇలా తయారుచేసుకున్న వెల్లుల్లి నీటిని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, జీలకర్ర, ఇంగువ, కారం, బటర్‌ వేసి కలపాలి. వెల్లులి నీటిని పోస్తూ చపాతీ పిండిలా తడపాలి. దీన్ని జంతికల గొట్టంలో వేసి కాగే నూనెలో మురుకుల్లా ఒత్తాలి. వీటిని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.


లడ్డూ...

కావాల్సినవి: బియ్యప్పిండి- కప్పు, పుట్నాల పప్పు, పల్లీలు- అర కప్పు చొప్పున; నువ్వులు- రెండు పెద్ద చెంచాలు, ఎండు కొబ్బరి తురుము- పావు కప్పు, ఇలాచీ పొడి- పావు చెంచా, బెల్లం- కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, నీళ్లు- తగినన్ని.

తయారీ: పల్లీలు, పుట్నాలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము, బియ్యప్పిండి... వీటిని విడివిడిగా వేయించి పెట్టుకోవాలి. పల్లీలు, పుట్నాలను పొడి చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో బియ్యప్పిండి, పుట్నాల పప్పు పొడి, పల్లీల పొడి, నువ్వులు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. నెయ్యి కూడా జత చేసి ఉండలు లేకుండా పిండిని మరోసారి బాగా కలియబెట్టాలి. స్టవ్‌ మీద బాండీ పెట్టి కప్పు బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు పోసి చిన్న మంటపై నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రెండు, మూడు నిమిషాలు మరిగించాలి. ఈ ద్రవాన్ని వడకట్టి పిండిలో పోసి బాగా కలియబెట్టాలి. చేతులకు నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని ఉండల్లా చేసుకోవాలి. అంతే రుచికరమైన లడ్డూలు రెడీ.


అట్లు...

కావాల్సినవి: ఉప్పుడు బియ్యం, దొడ్డు బియ్యం- కప్పు చొప్పున, మెంతులు- చెంచా, పెరుగు- పెద్ద చెంచా, పచ్చిమిర్చీ, మిరియాలు- చెంచా (బరకగా చేసుకోవాలి) చొప్పున, ఉప్పు- తగినంత, ఉల్లిపాయలు- రెండు చెంచాలు, అల్లం తరుగు- పావు చెంచా, కరివేపాకు- రెమ్మ, కొత్తిమీర- కొద్దిగా, జీలకర్ర- అర చెంచా, నూనె- పావు కప్పు.  

తయారీ:  ఏడెనిమిది గంటలు నీటిలో నానబెట్టిన రెండు రకాల బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు పోస్తూ చిక్కగా ఉండేలా కలపాలి. పెరుగు జత చేయాలి. మిరియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, అల్లం తరుగు వేసి బాగా కలపాలి. దీన్ని పెనం మీద అట్టులా పోసి రెండు వైపులా నూనె వేసి చక్కగా కాల్చుకోవాలి.


చెక్కలు...

కావాల్సినవి: బియ్యప్పిండి- పెద్ద కప్పు, పల్లీలు, నువ్వులు- మూడు చెంచాల చొప్పున, కారం- పెద్ద చెంచా, ఉప్పు- తగినంత, జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు- చెంచా చొప్పున; కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె- వేయించడానికి సరిపడా.  

తయారీ: పెద్ద గిన్నెలో బియ్యప్పిండితోసహా అన్ని పదార్థాలను వేసి, కొన్ని నీళ్లు పోసి ముద్దలా కలపాలి. చేతికి నూనె రాసుకుని చిన్న అప్పాల్లా అరచేతిలో చేసి కాగే నూనెలో వేసి వేయిస్తే సరి... వేడి వేడి చెక్కలు చక్కగా రెడీ అయిపోతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని