దుర్గమ్మకు... భక్తితో!

తియ్యని రాజ్‌భోగ్‌.. నోరూరించే పూరన్‌ పోలీ.. ఆహా అనిపించే బిరంజ్‌... ఇలా వేర్వేరు రాష్ట్రాల రుచుల సమ్మేళనాన్ని... ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి మనమూ సమర్పిద్దామా..

Updated : 10 Oct 2021 05:20 IST

తియ్యని రాజ్‌భోగ్‌.. నోరూరించే పూరన్‌ పోలీ.. ఆహా అనిపించే బిరంజ్‌... ఇలా వేర్వేరు రాష్ట్రాల రుచుల సమ్మేళనాన్ని... ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి మనమూ సమర్పిద్దామా..


బిరంజ్‌ (గుజరాత్‌)

కావాల్సినవి: బియ్యం- కప్పు, శనగ పప్పు, నెయ్యి, క్రీమ్‌ మిల్క్‌- పావు కప్పు చొప్పున, చక్కెర- ముప్పావు కప్పు, దాల్చినచెక్క- ఒకటి, లవంగాలు- రెండు, జాజికాయ పొడి, కుంకుమపువ్వు- చిటికెడు చొప్పున, ఇలాచీ పొడి- పావు చెంచా, బిర్యానీ ఆకులు- రెండు, తరిగిన బాదం, కాజూ, పిస్తా- నాలుగు పెద్ద చెంచాలు, కిస్‌మిస్‌- రెండు పెద్ద చెంచాలు.

తయారీ: బియ్యం, పప్పును కడిగి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లన్నీ ఒంపేసి చిల్లుల పాత్రలో వేసి పెట్టాలి. కుంకుమపువ్వును పాలలో వేసి నానబెట్టాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసి కరిగించాలి. దాంట్లో దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. నానబెట్టుకున్న బియ్యం, పప్పు వేసి అయిదు నిమిషాలు వేయించాలి. సరిపడా నీళ్లు పోసి బియ్యం పలుకు అయ్యే వరకు ఉడికించాలి. అన్నం 70 శాతం ఉడికిన తర్వాత పంచదార; కుంకుమ పువ్వు, ఇలాచీ, జాజికాయ పొడులు జోడించి చిన్న మంటపై చక్కెర కరిగేవరకు ఉడికించుకోవాలి మూత పెట్టి అన్నం పూర్తిగా మెత్తగా అయ్యేవరకు పావుగంట ఉడికించాలి. చివరగా వేయించిన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే సరి.


రాజ్‌భోగ్‌ (రస్‌గుల్లా) (బెంగాల్‌)

కావాల్సినవి: పాలు- లీటరున్నర, నిమ్మరసం- రెండు చెంచాలు, రవ్వ- చెంచా, ఫుడ్‌ కలర్‌- చిటికెడు, చక్కెర- కప్పున్నర, కుంకుమపువ్వు- కొద్దిగా, డ్రైఫ్రూట్స్‌ మిశ్రమం- అర కప్పు.

తయారీ: పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పోసి బాగా మరిగించాలి. ఇందులో నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోతాయి.ఈ పాలను జాలీ సాయంతో ఓ వస్త్రంలోకి వడబోయాలి. మిగిలిన నీళ్లను గట్టిగా పిండేసి చల్లటి నీటితో మరోసారి ఈ పాల ముద్దను శుభ్రం చేయాలి. ఆ తర్వాత దీంట్లో నుంచి కూడా నీటిని పూర్తిగా పిండేయాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలో వేసి చపాతీ పిండిలా అయిదు నిమిషాలు కలిపి ముద్ద చేయాలి. దీంట్లో రవ్వ, ఫుడ్‌ కలర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న పూరీలా చేసి అందులో డ్రైఫ్రూట్స్‌ పొడిని పెట్టి అన్ని వైపులా మూసి గుండ్రంగా పనీర్‌ బంతిలా చేసేయాలి. ఇలా అన్నింటిని తయారుచేసి పెట్టుకోవాలి. పెద్ద గిన్నెలో చక్కెర వేసి ఎనిమిది కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇందులో కుంకుమపువ్వు కలిపిన పాలను పోయాలి. పదినిమిషాలు దీన్ని చిన్న మంటపై మరిగించాలి. దీంట్లో పనీర్‌ బాల్స్‌ వేసి మూత పెట్టి పదిహేను నిమిషాలు మరిగించాలి. అంతే ఇవి ఇంతకు ముందుకంటే రెండింతలు పెద్దగా మారతాయి. వీటిని గిన్నెలోకి తీసుకుని అమ్మవారికి సమర్పిస్తే సరి.


పూరన్‌ పోలీ (మహారాష్ట్ర)

కావాల్సినవి: మైదా, గోధుమ పిండి- కప్పు చొప్పున, శనగపప్పు- అర కప్పు, నెయ్యి- అర కప్పు, పసుపు- పావు చెంచా, బెల్లం తురుము- కప్పు, నీళ్లు- తగినన్ని, యాలకులు- అయిదారు, ఉప్పు- తగినంత.

తయారీ: గిన్నెలో శనగపప్పు వేసి, నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి మంటను మధ్యస్థంగా పెట్టి మూడు నాలుగు కూతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరో పెద్ద గిన్నెలో రెండు రకాల పిండి వేసి, నెయ్యి, పసుపు, ఉప్పు జత చేసి, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసుకుని అది వేడయ్యాక  అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న యాలకులు, ఉడికించిన పప్పు వేసి నీళ్లంతా ఇగిరిపోయేవరకు కలపాలి. కప్పు పప్పునకు రెండు కప్పుల బెల్లం తురుము కలపాలి. దగ్గర పడేవరకు కలుపుతూనే ఉండాలి. దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. చపాతీ ముద్దను తీసుకుని కాస్త మందంగా పూరీల్లా చేసుకుని అందులో ఈ పప్పు, బెల్లం మిశ్రమాన్ని పెట్టి అన్ని వైపులా మూసేయాలి. ఆ తర్వాత మరోసారి పూరీల్లా చేసి పెనం మీద రెండు వైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. నవరాత్రుల్లో చేసే ఈ ప్రసాదం అమ్మవారికి సమర్పించాలి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు