నల్ల బియ్యం.. ఎర్ర బియ్యం.. అల్లుడు బియ్యం

బియ్యం అంటే మనకు తెలిసినంత వరకూ రోజూ మనం తినే తెల్లబియ్యమే! కానీ పోషకాలు అధికంగా ఉండే ఎర్రబియ్యం, నల్లబియ్యం వంటివాటికీ ఈ మధ్యకాలంలో ఆదరణ పెరుగుతోంది. వాటి గురించీ తెలుసుకుందాం..

Updated : 24 Oct 2021 16:09 IST

బియ్యం అంటే మనకు తెలిసినంత వరకూ రోజూ మనం తినే తెల్లబియ్యమే! కానీ పోషకాలు అధికంగా ఉండే ఎర్రబియ్యం, నల్లబియ్యం వంటివాటికీ ఈ మధ్యకాలంలో ఆదరణ పెరుగుతోంది. వాటి గురించీ తెలుసుకుందాం..


నల్లబియ్యంలో..

ఇప్పుడు ప్రాముఖ్యం సంపాదించుకుంటున్న బ్లాక్‌రైస్‌కి శతాబ్దాల చరిత్ర ఉంది. పూర్వం చైనాలో సామాన్య ప్రజలెవరూ వీటిని తినకూడదనే ఆక్షంలుండేవట. రాజ కుటుంబాలకు మాత్రమే వీటిని తినే అవకాశముండేది. దీర్ఘాయువును ఇస్తుందని నమ్మడమే అందుకు కారణం. అందులో నిజంగానే బోలెడు పోషకాలున్నాయి మరి!

మిగతావాటితో పోలిస్తే వీటిలో యాంటీఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. దీనిలో ఉండే ఆంథోసయనిన్‌ హృదయ, మెదడు సంబంధ సమస్యలను దరికి చేరనీయదు. ఫైబర్‌ జీర్ణసంబంధ సమస్యల నివారణకు సాయపడుతుంది. ఆహారంగా తీసుకున్నవాళ్లకి కొలెస్టరాల్‌ను తగ్గించడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి, లావుతగ్గాలనుకునే వాళ్లకి ఉత్తమ ఎంపిక. దీనిలో ఉండే ఫైటోన్యూట్రియంట్లు సహజ డీటాక్సిఫయర్‌గా పనిచేసి, వ్యాధికారక ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుంచి బయటకు పంపేస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవాళ్లకీ మంచి ప్రత్యామ్నాయమిది.


ఎర్రబియ్యంలో..

ఈ ఎర్రబియ్యాన్ని తమిళనాడులో మాప్పిళ్లై సాంబ అని అంటారు. మాప్పిళ్లై అంటే అల్లుడని అర్థం. పోషకాలు నిండుగా ఉండే ఈ బియ్యాన్ని అల్లుడికోసం ప్రత్యేకంగా వండిపెడతారు. ఆంథోసయనిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ పుష్కలంగా ఉండటం వల్లనే ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. పీచు, ఇనుము అధికంగా ఉండే ఈ బియ్యం... రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయులను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. నిదానంగా జీర్ణమయి... త్వరగా కడుపునిండిన భావన కలిగించడం వల్ల మళ్లీమళ్లీ ఆకలి వేయదు. అయితే ఖరీదు కాస్త ఎక్కువే. అందుకే బ్రౌన్‌ రైస్‌తో కలిపి ప్రయత్నించొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని