సారవకోట.. చక్కిలాలు!

చూడటానికి జంతికల్లా ఉండే చక్కిలాలు... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందులోనూ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రంలో కొన్ని కుటుంబాలు...

Updated : 28 Nov 2021 06:50 IST

చూడటానికి జంతికల్లా ఉండే చక్కిలాలు... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందులోనూ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రంలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ ప్రత్యేకమైన వంటకాన్ని తయారుచేస్తున్నాయి. ఆ గ్రామంలో 12 కుటుంబాలు చక్కిలాలను తయారుచేస్తున్నాయి. ప్రత్యక్షంగా 40, పరోక్షంగా మరో 100 మందికి ఈ వంటకం ఉపాధి కల్పిస్తోంది. దీనికున్న ప్రత్యేక రుచి వల్ల రోజురోజుకీ డిమాండూ పెరుగుతోంది.

బియ్యం నూకతోనే...
బియ్యం నూకను పిండిగా చేస్తారు. తగినంత ఉప్పు, నీరు జోడిస్తారు.  నువ్వులు నానబెట్టి చేత్తో ముద్దగా చేసి పిండిలో కలుపుతారు. శుభ్రమైన సంచిని నేలపై పరిచి ఎలాంటి యంత్రాలూ ఉపయోగించకుండా కేవలం చేత్తోనే చక్కిలాలను చేస్తారు. అవి కాస్త ఆరిన తర్వాత నూనెలో ముదురు గోధుమ రంగు వచ్చేవరకూ వేయిస్తారు. ఇలా ఘుమఘుమలాడే వాసనతో రుచికరమైన చక్కిలాలను తయారుచేయడం సారవకోట మహిళల సొంతం.

రెండు సైజుల్లో తయారీ
ఈ చక్కిలాలను రెండు సైజుల్లో తయారు చేస్తారు. ఒక్కో ప్యాకెట్లో పదేసి ఉంటాయి. చిన్న సైజువి రూ.30, పెద్ద సైజువి రూ.50. సారవకోట మీదుగా వెళ్లేవాళ్లూ చక్కిలాలు కొనకుండా వెళ్లరు. సిక్కోలు వాసులు ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు వీటిని వెంట తీసుకెళ్తారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఆడపిల్లలకు సారెలు పెట్టే సమయంలోనూ వీటికి ప్రత్యేక స్థానం కల్పిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ ఈ వంటకం విస్తరించింది. చక్కిలాలను చుప్పులు అని కూడా పిలుస్తుంటారు.

ఉపాధిగా ఎలా మారింది?
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలానికి చెందిన సావిత్రమ్మ 50 ఏళ్ల కిందట సారవకోటలోని తన కుమార్తె సత్యవతి ఇంటికి వెళ్లినప్పుడు చక్కిలాలు తయారు చేయడం నేర్పించారు. నాడు ఆమె వేసిన బీజం నేడు మహావృక్షమైంది. అమ్మ చేతి వంటకాన్ని నేర్చుకున్న సత్యవతి దాని తయారీని మరికొందరు మహిళలకు నేర్పించింది. అలా ఇప్పుడు సారవకోటలో మొత్తం 12 కుటుంబాలు పూర్తిగా ఈ వంటకం తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఒక్కో కుటుంబం ఈ వ్యాపారం వల్ల రోజుకి కనీసం రూ.1000 ఆదాయం పొందుతోంది. ఒక్కొక్కరు రోజూ రూ.3-5 వేల ఆదాయం వచ్చేలా చక్కిలాలు తయారుచేస్తారు.

- ప్రవీణ్‌ కుమార్‌ రుత్తల, శ్రీకాకుళం జిల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు