బిస్కెట్లు చక్కగా రావాలంటే!

బిస్కెట్లంటే మా పాపకు చాలా ఇష్టం. నేనూ ఇంట్లో అప్పుడప్పుడూ చేస్తూ ఉంటా. అయితే చేసిన ప్రతిసారీ చాలా గట్టిగా వస్తున్నాయి.

Updated : 12 Dec 2021 05:20 IST

బిస్కెట్లంటే మా పాపకు చాలా ఇష్టం. నేనూ ఇంట్లో అప్పుడప్పుడూ చేస్తూ ఉంటా. అయితే చేసిన ప్రతిసారీ చాలా గట్టిగా వస్తున్నాయి. అవి మృదువుగా రావాలంటే ఏం చేయాలి?

- అను, హైదరాబాద్‌

బిస్కెట్లు చక్కగా రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికి రుచి, చక్కని తయారీకి బటర్‌ చాలా ముఖ్యం. కాబట్టి నాణ్యమైన వెన్నను మాత్రమే వాడాలి. పిండిని అదేపనిగా చాలాసార్లు రోల్‌ చేయొద్దు. ఎక్కువసార్లు రోల్‌ చేస్తే వెన్న కరిగిపోయి అవి పలుచగా వస్తాయి. బిస్కెట్లు చక్కగా పొంగి, మంచిగా రావాలంటే ఒక్కసారి సరిగ్గా రోల్‌ చేస్తే చాలు. కట్టర్‌తో వాటిని కట్‌ చేసేటప్పుడు ఒకేసారి పై నుంచి గట్టిగా ఒత్తి కట్‌ చేయాలి. టర్న్‌, ట్విస్ట్‌ల్లాంటివి చేసి కట్‌ చేస్తే వాటి ఆకారం పోతుంది.

బిస్కెట్‌ తయారీలో గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... పిండిని సరైన కొలతలో తీసుకోవాలి. ఎక్కువ, తక్కువ తీసుకుంటే రెసిపీ సరిగా రాదు. కాబట్టి కచ్చితమైన కొలతల్లో తీసుకోవాలి. చల్లని బటర్‌ తీసుకున్నప్పుడు దాన్ని తురుముకోవాలి. బేకింగ్‌ పౌడర్‌ తాజాగా ఉండాలి లేకపోతే బిస్కెట్లు పలుచగా, గట్టిగా వస్తాయి.  పిండిని కాస్త మెత్తగానే తయారుచేసుకోవాలి. గట్టిగా చేయొద్దు. చల్లటి బటర్‌ వాడితే బిస్కెట్లు బాగా వస్తాయి.

బిస్కెట్స్‌ పైపొర గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చాక మాత్రమే అవెన్‌  నుంచి బయటకు తీయాలి. పిండి మరీ పొడి పొడిగా కానీ మరీ మెత్తగా కానీ తడపకూడదు. బిస్కెట్స్‌ గట్టిగా, లావుగా వచ్చాయంటే అందులో వెన్న తగ్గిందని అర్థం. బేకింగ్‌ పౌడర్‌ తక్కువైనా, మజ్జిగ తక్కువైనా బిస్కెట్స్‌ మృదువుగా అవకుండా గట్టిగా వస్తాయి. వీటిని ప్రీ హీటెడ్‌ అవెన్‌లో బేక్‌ చేయాలి. కోల్డ్‌ అవెన్‌లో చేస్తే ఫ్లాట్‌ బిస్కెట్స్‌ వస్తాయి. పాలు శాతం తగ్గితే పిండి పొడి పొడిగా మారి బాగా రావు. ఒకవేళ వచ్చినా వెంటనే విరిగిపోతాయి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈసారి తయారుచేసి చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని