ఉగ్గాని దోశ... ఒకింత ప్రత్యేకం...

ప్లెయిన్‌ దోశ... రవ్వ దోశ... ఆనియన్‌ దోశ... ఇలా నగరంలోని చిన్నా పెద్దా హోటళ్లతోపాటు టిఫిన్‌ సెంటర్లలోనూ రకరకాల దోశలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే అనంతపురానికి చెందిన

Updated : 24 Nov 2022 12:51 IST

ప్లెయిన్‌ దోశ... రవ్వ దోశ... ఆనియన్‌ దోశ... ఇలా నగరంలోని చిన్నా పెద్దా హోటళ్లతోపాటు టిఫిన్‌ సెంటర్లలోనూ రకరకాల దోశలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే అనంతపురానికి చెందిన ఆదిమూర్తి చేసే దోశ మాత్రం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఆయన చేసే ఉగ్గాని దోశ అనంత ప్రజల జిహ్వకు భలే నచ్చింది. దాంతో జనం ఆ టిఫిన్‌ సెంటర్‌ ముందు బారులు తీరుతున్నారట.

భోజన ప్రియులకు కొత్త రుచులను పరిచయం చేయాలనే ఆలోచనే ఆదిమూర్తిని ఆ రంగంలో నంబర్‌ వన్‌గా నిలబెట్టింది. అనంతపురంలో ఆదిమూర్తి టిఫిన్‌ సెంటర్‌ అంటే తెలియని వారుండరు. తక్కువ ధరకే విభిన్నమైన అల్పాహారాలను చాలా రుచికరంగా అందిస్తుండటంతో జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు టిఫిన్‌ సెంటర్‌ కిక్కిరిసి ఉంటుందంటే జనం అక్కడి రకాలను ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. రాయలసీమ జిల్లాలో అల్పాహారానికి సంబంధించి ఉగ్గాని, దోశ చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా అనంతపురం జిల్లా ఉగ్గానికి పెట్టింది పేరు. అయితే దోశ, ఉగ్గాని కలయికతో ఓ టిఫిన్‌ను తయారుచేసి అందించాలని ఆదిమూర్తి ఆలోచించారు. అలా వచ్చిందే ఈ ఉగ్గాని దోశ. దీంతోపాటు ఆకుకూర దోశనూ తయారు  చేస్తున్నారు. ఇందులో వాడే ఎర్రమల ఆకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుందని ఆదిమూర్తి చెబుతున్నారు. 1998 నుంచి ఆయన ఇక్కడ టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. టిఫిన్‌ సెంటర్‌లో పది రకాలు ఉన్నా.. ఉగ్గాని దోశ, ఆకుకూర దోశకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. సామాన్యుల దగ్గర నుంచి జిల్లా ఉన్నతస్థాయి అధికారుల వరకు ఇక్కడి నుంచే పార్సిల్‌ తెప్పించుకుని మరీ రుచి చూస్తుంటారు.  

- అంజప్ప, అనంతపురం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని