పర్యాటకంలో బీబీఏ, ఎంబీఏ

దేశంలో పర్యాటక రంగం విస్తరిస్తోంది. ఇందులో సేవలు అందించడానికి నాణ్యమైన మానవ వనరులను తయారుచేసే నిమిత్తం నెల్లూరు, గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, గోవాల్లో ఐఐటీటీఎంలను ఏర్పాటు చేశారు.

Published : 03 Mar 2021 09:46 IST

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం) బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. నెల్లూరుతో సహా దేశవ్యాప్తంగా చాలా క్యాంపసుల్లో ఈ కోర్సులు అందిస్తున్నారు.

దేశంలో పర్యాటక రంగం విస్తరిస్తోంది. ఇందులో సేవలు అందించడానికి నాణ్యమైన మానవ వనరులను తయారుచేసే నిమిత్తం నెల్లూరు, గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, గోవాల్లో ఐఐటీటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో టూరిజం అండ్‌ ట్రావెల్‌ విభాగంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులను అందిస్తున్నారు. వీటిని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, అమరాంతక్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదువుల నిమిత్తం ఫీజులు చెల్లించడానికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు లభిస్తున్నాయి.

కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు పర్యాటక సంస్థలు; రిసార్టులు, క్యాటరింగ్‌ సంస్థలు, విమానయాన సంస్థలు, హోటళ్లు, ఆతిథ్యంతో ముడిపడే ఇతర సంస్థల్లో మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. వీరిని ప్రాంగణ నియామకాల్లో మేక్‌ మై ట్రిప్, యాత్రా, ఐఆర్‌సీటీసీ, మారియట్, షెరటాన్, బామర్‌ లారీ, హాలిడే ఇన్, జెట్‌ ఏర్‌వేస్, హ్యాపీటూర్‌...తదితర సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి.

పరీక్ష ఇలా: బీబీఏ, ఎంబీఏ రెండు కోర్సులకూ ప్రవేశ పరీక్ష స్వరూపం ఒకటే. ప్రశ్నల స్థాయిలోనే వ్యత్యాసం ఉంటుంది. పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. జనరల్‌ అవేర్‌నెస్‌ 50, వెర్బల్‌ ఎబిలిటీ 25, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ఓఎంఆర్‌ పత్రంపై సమాధానాలు గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు.  

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులకు చివరి తేదీ: మే 21
పరీక్ష తేదీ: జూన్‌ 6

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: నెల్లూరు  
వెబ్‌సైట్‌: www.iitm.ac.in

ఎంబీఏ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
సీట్లు: ఈ కోర్సులో అన్ని చోట్లా కలుపుకుని మొత్తం 750 ఉన్నాయి.
అర్హత: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం.ప్రస్తుతం ఆఖరు సంవత్సరం డిగ్రీ కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 1, 2021 నాటికి 27 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా. పరీక్షకు 70 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌కు 15, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. మ్యాట్, క్యాట్, సీమ్యాట్, జాట్, జీమ్యాట్, ఆత్మా వీటిలో ఏదో ఒక పరీక్షలో స్కోర్‌ సాధించినవారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. మిగిలినవారు ఐఐటీటీఎం నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి.

బీబీఏ టూరిజం అండ్‌ ట్రావెల్‌
సీట్ల సంఖ్య: అన్ని క్యాంపస్‌ల్లోనూ కలిపి మొత్తం 375 సీట్లు ఉన్నాయి.  
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా.
ప్రవేశపరీక్షకు 70 శాతం, గ్రూప్‌   డిస్కషన్‌కు 15, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని