సీఏలో ఇలా మెరిశాం!

సీఏ ఫైనల్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.  జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన నూతుల నవీన్‌కు పాత సిలబస్‌లో

Published : 25 Mar 2021 13:46 IST

సీఏ ఫైనల్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.  జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన నూతుల నవీన్‌కు పాత సిలబస్‌లో జాతీయ రెండో ర్యాంకు వచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ విద్యార్థిని పైతర వెన్నెల జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించారు. క్లిష్టతరమైనదిగా చాలామంది భావించే ఈ కోర్సులో జాతీయస్థాయి ర్యాంకులు సాధించటం  ప్రతిష్ఠాత్మకమే. ఈ విజయం సాధించటానికి తామెంత   కృషి చేసిందీ వారి మాటల్లోనే తెలుసుకుందాం!  

ఒత్తిడిలోనూ ఉత్తమ ఫలితం  
సాధారణంగా ఫలితాలతో పాటు మెరిట్‌ లిస్ట్‌ అప్‌లోడ్‌ చేస్తారు. ఈసారి చేయలేదు. దీంతో ర్యాకులు ఇవ్వట్లేదేమో అనుకున్నా. కొంత సమయం తర్వాత ఐసీఏఐ సెంట్రల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ రంజిత్‌ అగర్వాల్‌ ఆల్‌ ఇండియా సెకండ్‌ ర్యాంక్‌ వచ్చిందని మెసేజ్‌ చేశారు. అరగంట తర్వాత ఐసీఏఐ ప్రెసిడెంట్‌ ఫోన్‌ చేసి అభినందించారు. అయినా ఓ పట్టాన నమ్మలేకపోయాను. పావుగంట తర్వాత పత్రికా ప్రకటన వచ్చింది. అందులో ఫోటో చూసుకున్న తర్వాత పూర్తిగా నమ్మాను. ఈ ర్యాంకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.       
సీఏ ఫైనల్‌ పరీక్షను ప్రతి సంవత్సరం మే, నవంబర్‌ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారు.మే- 2020 పరీక్ష కోసం సన్నద్ధమయ్యాను. కానీ కరోనా వల్ల పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. మొదట జూన్‌కూ, తర్వాత ఆగస్టుకూ వాయిదా వేశారు. చివరకు రద్దు చేసి నవంబర్‌లోనే రెండూ కలిపి నిర్వహిస్తామని ప్రకటించారు. ఈసారి కరోనా పరిస్థితుల వల్ల జనవరిలో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. పరీక్ష వాయిదాలతో ఒత్తిడికి గురయ్యాను. కరోనా సమయంలో రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే చదివాను. ఆగస్టు నుంచి రోజుకు  పూర్తిగా 12 గంటలు చదవడం ప్రారంభించాను. సబ్జెక్టులో సందేహాలుంటే తప్ప ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడేవాణ్ణి కాదు. జాతీయ స్థాయి ర్యాంకు వస్తుందని మాత్రం ఊహించలేదు! 
బీటెక్‌ చేయాలన్న ఆలోచనతో ఎంపీసీలో చేరాను. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొని ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో.. ఇంటర్‌ రెండో సంవత్సరంలో సీఏనే చేయాలని నిర్ణయించుకున్నా.   
సీఏ ఫౌండేషన్‌ కోర్సులో అందరూ ఉత్తీర్ణత సాధిస్తారు. సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్‌లో గ్రూపు-1, గ్రూపు-2 అని రెండుంటాయి. ప్రతి దాంట్లో నాలుగు సబ్జెక్టులుంటాయి. అగ్రిగేట్‌ విధానం ద్వారా వీటిలో ఉత్తీర్ణత నిర్ణయిస్తారు. ఒక్క సబ్జెక్టులో ఫెయిల్‌ అయినా తిరిగి అన్నీ సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాలి. 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన వాటికి మాత్రమే దీన్నుంచి మినహాయింపు ఉంది. దీంతో విద్యార్థులు తుది దశకు చేరుకోలేకపోతున్నారు. ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం చివరి వరకు విద్యార్థుల్లో ఉండటం లేదు. దీంతో వెనకబడుతున్నారు.   
సీఏ కోర్సు చాలా కష్టమనే అభిప్రాయం నిజం కాదు. సాధారణ కోర్సుల్లో విద్యార్థులపై విద్యాసంస్థల నియంత్రణ ఉంటుంది. దీనిలో ఇలాంటి విధానం లేదు. కోచింగ్‌ సెంటర్లు సబ్జెక్టుపై అవగాహన మాత్రమే కల్పిస్తాయి. విద్యార్థే సొంతంగా పరీక్షల కోసం సిద్ధం అవ్వాలి. సీఏ కావాలంటే స్వీయ నియంత్రణా, క్రమశిక్షణా అవసరం.   
సీఏగా  కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తాను. వ్యాపార రంగంలో ప్రవేశించాలన్నది అంతిమ లక్ష్యం. దీని కోసం ఇప్పటి నుంచే అవగాహన పెంచుకుంటాను.  
ఫైనల్‌ పరీక్షకు సన్నద్ధం అవడానికి కనీసం నాలుగు నెలల సమయం కావాలి. చాలామంది ప్రణాళిక ప్రకారం ప్రిపేరవడం లేదు. ప్రణాళిక రూపొందించుకున్నప్పటికీ కొందరు దాన్ని అమలులో విఫలమవుతున్నారు. కొన్ని సంస్థలు ప్రధాన పరీక్షకు ముందు టెస్ట్‌  సిరీస్‌లు నిర్వహిస్తాయి. ఇవి రాయడం వల్ల ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో, ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి సవరించుకోవచ్చు. క్యుములేటివ్‌ రివిజన్‌ విధానం మంచి ఫలితాలు సాధించడంలో ఉపయోగపడుతుంది. 

మోడల్‌ పరీక్షలతో మేలు     

క్వాలిఫై అవుతాననుకున్నాను కానీ ఈ స్థాయి ర్యాంకు వస్తుందని ఉహించలేదు. రాత్రి పది గంటలకు ఫలితాలు వచ్చాయి. ఐదో ర్యాంకు నాకే వచ్చిందా అని మూడుసార్లు చెక్‌ చేశాక గానీ నమ్మలేకపోయా. నేను పడ్డ కష్టానికి మంచి ఫలితం వచ్చిందని భావిస్తున్నా.    
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రణాళిక ఉంటుంది. ఒకరిది మరొకరికి సెట్‌ అవ్వదు. చిన్నప్పటి నుంచీ నాకు ఇంటికి వచ్చాక చదవడం అలవాటు లేదు. స్టడీ అవర్లో ఫ్రెండ్స్‌తో కలిసి చదివేదాన్ని. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితం అయ్యా. దీంతో ఇంట్లో ఒక్కదాన్నే కూర్చుని పరీక్షల కోసం సిద్ధం అవ్వాల్సివచ్చింది. రోజుకు 16 గంటలు చదివేదాన్ని. భయంతో ఎక్కువ చదివేస్తున్నానేమో అన్న అనుమానం కూడా వచ్చేది. ప్రారంభంలో ఇబ్బందిగా ఉండేది. కానీ ఇష్టంగా చదవడంతో సులువైంది. మోడల్‌ పరీక్షలు రాయడం ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడింది. సీఏ కోర్సులో చేరిన ప్రారంభంలో ఎవరికైనా జాతీయ స్థాయి ర్యాంకు వస్తే.. అంతలా వారెలా చదివారో అనుకునేదాన్ని. నాకే ర్యాంకు వచ్చేసరికి 
ఇదంతా కలలా ఉంది!       
టెన్త్‌ తర్వాత అందరూ ఎంపీసీ, బైపీసీల్లో చేరారు. డిఫరెంట్‌గా ఉండాలని కామర్స్‌లో చేరా. ఇంటర్మీడియట్‌లో సీఏ గురించి చెప్పిన విధానంతో నాకు మరింత ఆసక్తి పెరిగింది. ఓసారి కోర్సులో చేరాక ఇష్టంతో పాటు ఒత్తిడీ ఎదురయింది.  
విద్యార్థులు ఒక్కో క్లాస్‌ కోసం ఒక్కో కోచింగ్‌ సంస్థకు వెళ్తారు. విద్యార్థులు ఐసీఏఐ మెటీరియల్‌ చాలా పెద్దగా ఉంటుందని కోచింగ్‌ సంస్థ ఇచ్చే మెటీరియల్‌ మాత్రమే చదువుతారు. కానీ ఐసీఏఐ మెటీరియల్‌ చాలా ముఖ్యమైంది. ఇందులోని ప్రతి పేజీలోని ప్రతి ప్రశ్నా తప్పకుండా ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుంది. నా ఆసక్తుల ప్రకారం లక్ష్యాలు నిర్ణయించుకున్నాను. మొదట కొన్ని సంవత్సరాలు సీఏగా చేస్తాను. తర్వాత వ్యాపారం ప్రారంభిస్తాను. క్రిమినాలజీ కోర్సు చేయాలనుకుంటున్నాను. ఓ పుస్తకం కూడా రాయాలన్న లక్ష్యం ఉంది. 
సీఏ కోర్సులో ఉత్తీర్ణత సాధించడం మామూలు విషయం కాదు. చదవడంతో పాటు మానసిక సామర్థ్యం, ఒత్తిడిని అధిగమించే స్థాయిని బట్టే ఉత్తీర్ణత ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు కూడా అవసరం. ‘సీఏ తప్ప మరో మార్గం లేదు’ అన్న ఏకైక లక్ష్యంతో ముందుకువెళ్తే తప్పకుండా దీనిలో నెగ్గవచ్చు. ప్రయత్నిద్దాం అనుకుంటే మాత్రం కష్టం. సీఏ అవడం కోసం ఏదైనా త్యాగం చేసేందుకు సిద్ధ్దంగా ఉండాలి. సోషల్‌ మీడియా, సరదాలూ లాంటివి కొద్ది రోజులు దూరం పెడితే విజయవంతంగా సీఏ పూర్తి చేయవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని