తీరిక వేళ.. తీర్చిదిద్దుకునేలా!

అనుకోని చిక్కులు ఎదురైనపుడే అంతర్గత శక్తులు వెలికివస్తాయి. వాటిని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి వినియోగిస్తే కెరియర్‌కు ఢోకా ఉండదు. కొవిడ్‌-19 మహమ్మారి మూలంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అందరినీ ఇళ్లకే పరిమితం చేసేసింది. విద్యాసంస్థలు మూతబడటంతో పాటు ప్రవేశ పరీక్షల, నియామక పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి....

Published : 20 Apr 2020 00:45 IST

కెరియర్‌లో ముందునిలిపే జీవన నైపుణ్యాలు

అనుకోని చిక్కులు ఎదురైనపుడే అంతర్గత శక్తులు వెలికివస్తాయి. వాటిని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి వినియోగిస్తే కెరియర్‌కు ఢోకా ఉండదు. కొవిడ్‌-19 మహమ్మారి మూలంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అందరినీ ఇళ్లకే పరిమితం చేసేసింది. విద్యాసంస్థలు మూతబడటంతో పాటు ప్రవేశ పరీక్షల, నియామక పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి. ఈ అనిశ్చిత పరిస్థితిలో డీలా పడిపోకూడదు. ఆశావహ దృక్పథం చూపాలి. ఇందుకు కొన్ని జీవన నైపుణ్యాలు అవసరం అంటున్నారు నిపుణులు. వాటిని సాధన చేయడానికి ఈ లాక్‌డౌన్‌ విరామ సమయం ఎంతో అనుకూలం!

వితను మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలంటే మంచి విద్యార్హతలూ, సాంకేతిక నైపుణ్యాలూ ఉంటేనే సరిపోదు. దాంతో పాటు సమస్యా పరిష్కారంలో ముందుండటం, ఇతరులతో సవ్యంగా మెలగటం ద్వారా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోవాలి. దీనికి జీవన నైపుణ్యాలు సాయపడతాయి.

అనూహ్యమైన పరిస్థితులు వచ్చినపుడు నిర్దేశించుకున్న షెడ్యూల్స్‌ అన్నీ దెబ్బతినటం సహజం. గడుస్తున్న రోజులు భారంగానూ, సుదీర్ఘంగానూ గడుస్తున్నాయంటే అర్థవంతమైన వ్యాపకంలో నిమగ్నమవ్వాల్సిన సమయం వచ్చిందని అర్థం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో అదనపు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడానికీ, పదునుపెట్టుకోవడానికీ చాలామంది విద్యార్థులూ, అభ్యర్థులూ మొగ్గు చూపుతున్నారు. వివిధ సుప్రసిద్ధ సంస్థలు కూడా ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి. దాంతో పాటు ముఖ్యమైన జీవన నైపుణ్యాలు పెంచుకోవటానికి కూడా కృషి చేయటం మంచిది. అప్పుడే అస్తవ్యస్తమవుతున్న సామాజిక జీవనం తాలూకు భయాందోళనలూ, నిరాశల ప్రభావం నుంచి బయటపడవచ్ఛు ఆత్మవిశ్వాసం సడలకుండా కెరియర్‌ను మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు.

నిజానికి ఇవి ఒకదానికొకటి సంబంధమున్నవే. జీవన నైపుణ్యాలు మెరుగ్గా ఉంటే కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవటం సులువవుతుంది.

మార్పుల స్వీకరణ

జీర్ణించుకోలేని మార్పులు మన జీవితాల్లోకి చొచ్చుకుని రావటం ఎంత సహజమో కరోనా కల్లోలం.. దాని పరిణామాలూ నిరూపించాయి. కాలక్రమంలో మార్పులు (అవి మనకు సంతోషం కలిగించినా, బాధను పంచినా) అనివార్యమని గుర్తించటం చాలా అవసరం. మార్పును అంగీకరించినపుడు దానికి అనుగుణమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. లేనిపోని భయాలు వదిలేసి దానికి తగ్గట్టు సర్దుబాట్లు చేసుకోవటానికి వీలవుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, కెరియర్‌ను తీర్చిదిద్దుకోవాలని తెలుస్తుంది. అనుభవజ్ఞుల, నిపుణుల సలహాలు తీసుకుంటే ఏం చేయాలో కర్తవ్యం కూడా బోధపడుతుంది.


నిరాశను ఎదుర్కోవటం

అనుకోని ఉపద్రవం వల్ల అనుకున్న ప్రణాళికలన్నీ నిలిచిపోయాయి. పనులన్నీ వాయిదా పడ్డాయి. అనిశ్చితి కొనసాగుతూవస్తోంది. దీంతో యువతీ యువకుల్లో అసంతృప్తి, నిరాశ కనిపిస్తున్నాయి. జరిగినదానికి బాధపడుతూ సమయం వృథా చేయటం కంటే ఈ సమయంలో అర్థవంతంగా ఏయే పనులు చేయవచ్చో ఆలోచించటం వివేకం.  ప్రతి సంక్షోభమూ ఒక అవకాశాన్ని ఇస్తుందనే మాట మర్చిపోకూడదు. ఆశావహ దృక్పథంతో ఆలోచిస్తే నిరాశ మటుమాయమవుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటానికి ఇదో చక్కని అవకాశమని అర్థమవుతుంది.


నెట్‌వర్క్‌ విస్తరణ

ఒకరినొకరు కలుసుకోకుండానే సామాజికంగా అనుసంధానమయ్యే సౌలభ్యం సోషల్‌మీడియా ద్వారా, అంతర్జాల ఆధారిత గ్రూపుల ద్వారా సాధ్యమేనని తెలిసిందే. మిత్రులూ, సీనియర్లతో గానీ, అధ్యాపకులూ, వృత్తినిపుణులతో గానీ ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్కులను విస్తరించి, పటిష్ఠం చేసుకోవటానికి ఇదే తరుణం. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఉత్సాహం లోపించో, బద్ధకంతోనో నెట్‌వర్క్‌ సభ్యులను పలకరించకుండా మిన్నకుండిపోవటం సరికాదు. సభ్యుల్లో కొందరైనా అనుదినం అనుసంధానమై తాజా అంశాలను ఇచ్చిపుచ్చుకుంటేనే ఏ నెట్‌వర్క్‌ అయినా ఫలవంతమవుతుంది. అందుకే తమ నెట్‌వర్క్‌లోని వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తే జాబ్‌మార్కెట్‌కు సంబంధించిన కొత్త అవకాశాలూ, ఆలోచనలూ, ఆధునిక సాంకేతికాంశాలూ తెలుస్తాయి.


చక్కని సంభాషణ

మాటే మంత్రమనే మాట వినేవుంటారు. మృదువుగా, అర్థవంతంగా, సందిగ్ధతకు తావు లేకుండా మాట్లాడేవారు ఎదుటి వ్యక్తిని ఇట్టే ఆకట్టుకోగలరు. తమ వాదనకు మద్దతును సులువుగా పొందగలరు. ముఖాముఖి మాట్లాడే సందర్భాలతో పాటు టెలిఫోన్‌లో, వర్చువల్‌ సమావేశాల్లో సంభావించే సందర్భాలు ఈ సాంకేతిక యుగంలో సర్వసాధారణం. ఉద్యోగ నియామకాల్లో టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలు భాగమైపోయాయి. ఇలాంటి సందర్భాల్లో వాస్తవిక సమాచారంతో ముందస్తుగా సిద్ధమైతే తార్కికంగానూ, సమర్థంగానూ మాట్లాడవచ్ఛు ఇతరులు ఏమాత్రం అపార్థం చేసుకోకుండా, విషయం సంపూర్ణంగా గ్రహించేలా సంభాషించటం ముఖ్యం. స్పష్టంగా, సూటిగా మాట్లాడటం సాధన చేయటానికి ఈ తరుణాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.


సూటిగా.. తేటగా

‘ఈ డిజిటల్‌ యుగంలో రాతతో పనేముంది?’ అనుకోవటం పొరపాటు. నిజానికి వివిధ ప్రదేశాల్లో ఉన్న, వివిధ నేపథ్యాలున్న వ్యక్తులతో కలిసి పనిచేసే ఉద్యోగాల్లో స్పష్టమైన లిఖితపూర్వకమైన భావ ప్రసారానికి ప్రాధాన్యం ఎక్కువ. పేపర్‌ మీద రాసినా, కీ బోర్డుపై కంపోజ్‌ చేసినా చెప్పదల్చుకున్న విషయం సూటిగా, తేటగా ఉండాలి. రాతలో అస్పష్టతకూ, అపార్థాలకూ తావివ్వటం అంటే రాసే నైపుణ్యాలు లోపించడమే. ఇది కొద్దికాలంలో సాధించగలిగే నైపుణ్యం కాదు. అయితే దాన్ని మెరుగుపరుచుకునే కృషి ఆరంభించటానికి ఈ విరామ సమయంలో కొంత భాగం కేటాయించటం మేలు. ఆలోచనలను అక్షరాల్లోకి ఎలా మార్చవచ్చు, రాతలో ఎంత క్లుప్తంగా, సూటిగా చెప్పవచ్చు అనేది బాగా సాధన చేయాలి.


టీమ్‌ వర్క్‌ నిర్వహణ

ఆధునిక ఉద్యోగాల్లో ఎక్కువశాతం ఒంటరిగా కాకుండా బృందంతో కలిసి పనిచేయగలిగినవే. విభిన్న స్వభావాలున్న వ్యక్తులతో కలిసి సమర్థంగా పనిచేసి, కావాల్సిన ఫలితం రాబట్టటం సవాలు లాంటిదే. టీమ్‌ వర్క్‌ నైపుణ్యాలను ఉద్యోగంలో చేరినప్పుడే కాకుండా విద్యార్థి దశలో ఉన్నపుడే నేర్చుకుని వాటికి సానపట్టుకోవాలి. లాక్‌ డౌన్‌ కారణంగా స్నేహితులంతా ఇప్పుడు ఒకరినొకరు కలుసుకునే వీలు లేనందున ఆన్‌లైన్‌ వేదికగా ప్రాజెక్టు వర్క్‌ను చేపట్టవచ్ఛు దానికి పరస్పరం ఆలోచనలు పంచుకోవటం మొదటి మెట్టు. పని విభజన చేసుకుని, నిర్ణీత గడువులోగా అమలు జరిగేలా చూసుకోవాలి. సమన్వయంతో ఆశించిన ఫలితం వచ్చేలాగా కృషి చేయాలి.


విశ్వసనీయత

వివిధ సంస్థలు తమ ఉద్యోగుల నుంచి విశ్వసనీయతనూ, సమాచార గోప్యతనూ ఆశిస్తాయి. చిన్నా పెద్దా సంస్థలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ సదుపాయం కల్పించి, ఆ ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయంటే.. దాని వెనక ఉద్యోగుల నిజాయతీపై నమ్మకం, వారిని సాధికారత వైపు ప్రోత్సహించటం కారణం. విద్యార్థులైనా, నియామకాల కోసం ఎదురుచూసేవారైనా నిజాయతీగా వ్యవహరించటమనేది వారికి వ్యక్తిగత జీవితంలోనూ మేలు చేస్తుంది. నెరవేర్చలేని వాగ్దానాలు చేయకపోవటం, చెప్పిన మాట నిలబెట్టుకోవటం లాంటివి ఎవరి విశ్వసనీయతనైనా పెంచుతాయి. ఈ లక్షణాలను చిత్తశుద్ధితో పెంపొందించుకోవటానికి నిరంతరం కృషి కొనసాగించాలి.

విద్యార్థులూ, ఉద్యోగార్థులూ వీటిన్నిటినీ వ్యక్తిత్వంలో భాగం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ జీవన నైపుణ్యాల సాధనకు ఇదే చక్కని తరుణం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని