కొత్త తరహా ఉద్యోగాలకు.. మీరెంత సిద్ధం?

నూతన తరహా కొలువులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో బ్యాంకింగ్‌, ఆర్థిక, బీమా, ఐటీ ఆధారిత సేవలు, ఇంటర్నెట్‌-వ్యాపార రంగాల్లో ఉద్యోగ నియామకాల విషయంలో భారీ మార్పులు జరిగి ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని జాతీయస్థాయి అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు కళాశాల దశలోనే నవతరం ఉద్యోగాలకు అవసరమైన మెలకువలు నేర్చుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

Published : 14 Dec 2020 00:43 IST

నూతన తరహా కొలువులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో బ్యాంకింగ్‌, ఆర్థిక, బీమా, ఐటీ ఆధారిత సేవలు, ఇంటర్నెట్‌-వ్యాపార రంగాల్లో ఉద్యోగ నియామకాల విషయంలో భారీ మార్పులు జరిగి ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని జాతీయస్థాయి అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు కళాశాల దశలోనే నవతరం ఉద్యోగాలకు అవసరమైన మెలకువలు నేర్చుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కొత్త నైపుణ్యాలు ఉద్యోగార్థులకు అభిలషణీయం మాత్రమే కాదు, అత్యవసరం కూడా!
జటిల సమస్యలకు సులభమైన రీతిలో సమాధానాలు సాధించడం ఒక నేర్పు. ఒక సమస్యకు ఒకే సమాధానం ఉండదు. చాలా రీతుల్లో ఆ సమస్యకు సమాధానం రాబట్టవచ్చు. అన్ని సమాధానాలలోకీ  తక్కువ సమయం తీసుకునే, తక్కువ ఖర్చుతో కూడుకున్న, సరళమైన, నాణ్యమైన పరిష్కారం గుర్తించడం ఒక కళ. ప్రతి పరిశ్రమలోనూ ఇంచుమించు ప్రతి స్థాయిలోనూ కంప్యూటరీకరణ జరుగుతోంది. అంటే బ్రాంచితో నిమిత్తం లేకుండా ప్రతి ఇంజినీర్‌కూ ప్రోగ్రామింగ్‌ తెలిసుండాలి. ఉదాహరణకు ఒకప్పుడు మహిళలకు చీరకు సరిపోయే రంగు రవికె దొరకడం కష్టంగా ఉండేది. ఎన్నో దుకాణాలు తిరిగి శ్రమపడవలసి వచ్చేది. కంప్యూటర్‌లో వివిధ రంగుల మిశ్రమం అనుకరించే సౌలభ్యం ఈ సమస్యకు వరంగా లభించిందని చెప్పవచ్చు. ఈ కిటుకును జౌళి పరిశ్రమలో అమలుపరిచి, బట్టలకు రంగులు అద్దే ప్రక్రియను ముందుకు జరిపి చీరతో పాటు రవికెనూ నేయడం ద్వారా ఇది సాధ్యమయింది. సమస్యను సమగ్రంగా అర్థం చేసుకుని, చిన్న చిన్న సమస్యలుగా విభజించి, వాటి సమాధానాల సమాహారంగా అసలు సమస్యను సాధించడం ప్రతిభతో కూడుకున్న నైపుణ్యం. ఇది ఇంజినీరింగ్‌కి మూలస్తంభం. ఈ నైపుణ్యంలో లోటుపాట్లను గుర్తించడం, భద్రతకు గల అవకాశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి పరీక్షించడం, కష్ట నష్టాల అవకాశాన్ని గుర్తించడం, సామర్థ్యాన్ని పెంచడం అంతర్భాగాలు.

నైపుణ్యాల నివేదిక ఏం చెబుతోంది?

టాగ్‌డ్‌ అనే మానవ వనరుల సేవల సంస్థ, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆన్‌లైన్‌లో ప్రతిభా పరీక్షలు నిర్వహించే వీబాక్స్‌ సంస్థలు సంయుక్తంగా ఏటా ప్రచురించే ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌- 2020 వెలువడింది. పరిశ్రమల నిపుణుల అభిప్రాయాలు, విద్య-శిక్షణ సంస్థల బోధనా పద్ధతులు, నైపుణ్యాల శిక్షణ పద్ధతులను క్రోడీకరించిన నివేదిక ఇది. ఉద్యోగాలకు కావలసిన కొత్త మెలకువలపై సిఫారసులు, సాంకేతిక విద్యార్థుల ఉద్యోగ సంసిద్ధతపై వివరాలు దీనిలో ఉన్నాయి.
* ఎంబీఏ అభ్యర్థుల ఉద్యోగ సంసిద్ధత అధికంగా ఉంది. అంటే వీరి పాఠ్యాంశాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వున్నాయి.
* ఇంజినీరింగ్‌ అభ్యర్థుల మెలకువల్లో 2019 సంవత్సరం కంటే ఈ ఏడాది 9% తరుగుదల ఉంది. పరిశ్రమల అవసరాలకూ, పాఠ్యాంశాల్లో మెలకువల శిక్షణకూ అంతరం పెరిగింది
* బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగం, బీమా రంగం, ఐటీ ఆధారిత సేవల రంగం, ఇంటర్నెట్‌-వ్యాపార రంగాల్లో ఉద్యోగ నియామకాల విషయంలో గత ఐదేళ్లలో పెను మార్పులు జరిగాయి. ఈ రంగాల్లో  ఉద్యోగ అవకాశాలూ భారీగా పెరిగాయి.
* భారతదేశ  పారిశ్రామిక విప్లవం 4.0 అవసరాలకు తగ్గట్టుగా అభ్యర్థులు నైపుణ్యాలను నేర్చుకోవాలి.
* కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, కొన్ని కాలం చెల్లిన నైపుణ్యలను వదులుకోవడం చాలా అవసరం. ఈ ప్రక్రియనే ‘లర్న్‌- అన్‌ లర్న్‌- రీ లర్న్‌’ అంటారు.
* బీటెక్‌ ముగించి కళాశాల బయటకు అడుగుపెట్టేవారిలో ఉద్యోగ సంసిద్ధత కేవలం 15% ఉంది.
* నౌకరి.కామ్‌ వంటి జాబ్‌ పోర్టల్స్‌, లింక్‌డ్‌ఇన్‌ వంటి సామాజిక మాధ్యమాలు, ఉద్యోగుల రెఫరల్‌ మార్గాల ద్వారా అత్యధికంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

ముందుచూపుతో సమస్యలకు పరిష్కారం

ప్రతి కొత్త టెక్నాలజీ ఒక సమస్యకు సమాధానం ఇస్తుంది. అదే సమాధానం బహుశా మరో ఎదురు చూడని, కొత్త సమస్యకు తెర తీస్తుంది. ఉదాహరణకు మనకు అవసరమైనవారు అన్నివేళలా మనకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కనుక్కున్న మొబైల్‌ ఫోన్‌ మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మనిషిని మనిషి నుంచి వేరు చేస్తున్నదనే అపప్రథను మోస్తూ కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. మొబైల్‌ కనుక్కున్నప్పుడు ఈ సమస్యను ఎవరూ ఊహించలేదు. ఈరోజు ఈ జటిల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలంటే మేధకూ, సృజనాత్మకతకూ పని పెట్టాలి. ప్రత్యామ్నాయ మార్గంలో సమాధానాలు ఆలోచించాలి. అలాగే కారులో సీటు బెల్టు డ్రైవర్ల నిర్లక్ష్యానికీ, అధిక వేగంతో ప్రమాదం కొనితెచ్చుకునేవారు బలి కాకుండా ప్రాణాలు నిలబెట్టడానికీ  చేసిన ఇంజినీరింగ్‌ సృష్టి. కొత్త టెక్నాలజీలు అందించే లాభాలతోపాటు అవి తెచ్చిపెట్టే ప్రమాదాలను ముందుగానే ఊహించగలగడం ఒక దార్శనిక కళ. ఇది నిత్యం అభ్యాసం చేస్తే కానీ రాని నైపుణ్యం.

విమర్శనాత్మక దృక్పథం

సమస్య సందర్భాన్ని విశ్లేషించి సమయోచితమైన నిర్ణయం కోసం ఆలోచించగలిగే సామర్థ్యం ఇది. వ్యక్తిగత అభిప్రాయాలకూ, ఇతర ప్రలోభాలకూ లోనుకాకుండా తటస్థ నిర్ణయం తీసుకోవటాన్ని అలవరచుకోవాలి. సమస్యకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం, దాన్ని అన్ని కోణాలనుంచి పరిశీలించి, విశ్లేషించి, పరిష్కారంపై విరుద్ధ ప్రభావం చూపే అంశాలను గుర్తించడం, సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలను సేకరించడం- వారి స్పందన,  వివిధ ప్రత్యామ్నాయ సమాధానాలు ఈ మెలకువలో అంతర్భాగం. ఇవి నిరంతర అభ్యాసంతో వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని