వ్యవధి తక్కువే.. శ్రద్ధతో సాధ్యమే!

అరకొరగా విన్న ఆన్‌లైన్‌ తరగతులు.. కొంతలో కొంత మేలన్నట్టు సిలబస్‌ తగ్గింపు. క్రమంగా దగ్గరపడుతున్న పరీక్షలు. సమయమేమో తక్కువ. చాలామంది ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి ఇది! అయితే నిరాశ పడనక్కర్లేదు. సబ్జెక్టులను అవగాహన చేసుకుని పట్టు సాధించడానికి పూర్తిస్థాయిలో నిమగ్నం కావాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో!

Updated : 01 Mar 2021 05:36 IST

ఇంటర్‌, ఎంసెట్‌లలో మేటి స్కోరుకు ప్రణాళిక

అరకొరగా విన్న ఆన్‌లైన్‌ తరగతులు.. కొంతలో కొంత మేలన్నట్టు సిలబస్‌ తగ్గింపు. క్రమంగా దగ్గరపడుతున్న పరీక్షలు. సమయమేమో తక్కువ. చాలామంది ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి ఇది! అయితే నిరాశ పడనక్కర్లేదు. సబ్జెక్టులను అవగాహన చేసుకుని పట్టు సాధించడానికి పూర్తిస్థాయిలో నిమగ్నం కావాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో!
ఈ ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రతి పరీక్షా నిజంగా ‘పరీక్షే’! కరోనా ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా రెండో సంవత్సరం సిలబస్‌ మొత్తం దాదాపుగా ‘ఆన్‌లైన్‌’ ద్వారానే విన్న కారణంగా పాఠ్యాంశాలపై పూర్తి పట్టు అంత సులభం కాదు. అవకాశం లేకనో, ఇతర కారణాల వల్లనో అన్ని తరగతులూ విననివారున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వృత్తి విద్యాకోర్సుల్లో చేరేందుకు ‘ఎంసెట్‌’ రాయడం తప్పనిసరి. ఈ విద్యాసంవత్సరం ఆఫ్‌లైన్‌ తరగతులు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. దీంతో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు గానీ, ఎంసెట్‌ లాంటి పోటీపరీక్షలకు గానీ సమయం తక్కువగా ఉంది. ఇంటర్‌ పరీక్షలతో పాటే ఎంసెట్‌కీ ఒకే సమయంలో సన్నద్ధమవటం సరైన వ్యూహం!
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు (ఐపీఈ) మే లోనూ, ఎంసెట్‌ జులైలోనూ నిర్వహించనున్నారు. ఉన్న సమయంలో ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే రెండు రకాల పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించవచ్చు. ఎంసెట్‌ 160 ప్రశ్నలకు ఉంటుంది.
ఇంజినీరింగ్‌ విభాగంలో గణితం-80, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ- 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. మెడికల్‌ విభాగంలో వృక్షశాస్త్రం-40, జంతుశాస్త్రం-40, భౌతికశాస్త్రం-40, రసాయనశాస్త్రం-40 చొప్పున ప్రశ్నలొస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 160  మార్కులు. కాలవ్యవధి 180 నిమిషాలు. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష. రుణాత్మక మార్కులు లేనందున అన్ని ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించవచ్చు. ఎంపీసీ విద్యార్థులు కనీసం 80/160, బైపీసీ వారు 130/160 మార్కులు లేదా ఆపైన సాధిస్తే మంచి ర్యాంకును సొంతం చేసుకోవచ్చు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర సిలబస్‌లో తొలగించిన 30% పాఠ్యాంశాలను వదిలిపెట్టి మిగిలిన 70%పై దృష్టి సారించాలి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలోని పాఠ్యాంశాల్లో ఎలాంటి తొలగింపూ ఉండదు. కాబట్టి, అన్ని అంశాల్లో పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలి. ప్రశ్నలు మొత్తం తెలుగు అకాడమీ పుస్తకాల నుంచే ఉంటాయి. ఆ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి.

భౌతిక శాస్త్రం

సుమారు 30% ప్రశ్నలు నేరుగా వస్తాయి. ఫిజిక్స్‌లో ఫార్ములాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ఉపయోగించడంలో నేర్పు సాధించాలి. వర్క్‌, పవర్‌, ఎనర్జీ, సిస్టమ్‌ ఆఫ్‌ పార్టికిల్స్‌, రొటేషనల్‌ మోషన్‌, లాస్‌ ఆఫ్‌ మోషన్‌, మోషన్‌ ఇన్‌ ఎ ప్లేన్‌, మూవింగ్‌ చేంజెస్‌ అండ్‌ మాగ్నటిజమ్‌, గ్రావిటేషన్‌, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్‌, వేవ్స్‌, హీట్‌, థర్మోడైనమిక్స్‌ మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. షార్ట్‌కట్‌ ఫార్ములాలు, కాన్సెప్ట్‌ ఆధారిత షార్ట్‌నోట్సును రెండు, మూడుసార్లు పునశ్చరణ (రివిజన్‌) చేయాలి. వేగవంతమైన రివిజన్‌ కోసం కాన్సెప్ట్స్‌, ఫార్ములాలకు హ్యాండ్‌ బుక్‌ను తయారు చేసుకోవాలి. అకాడమీ పుస్తకాన్నీ, గత ప్రశ్నపత్రాలనూ సాధన చేయాలి.

రసాయన శాస్త్రం

దీనిలో సరైన సన్నద్ధత ఎంసెట్‌లో ఎక్కువ మార్కులు పొందడానికి సాయపడుతుంది. అకాడమీ పుస్తకం నుంచి సన్నద్ధమవుతూ కీలకమైన అంశాలతో సొంత నోట్స్‌ తయారు చేసుకోవాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో నేమ్‌డ్‌ రియాక్షన్స్‌, రీయేజెంట్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. వాటిని సాధన చేయాలి. ఇన్‌ఆర్గానిక్‌లో నేమ్‌డ్‌ ప్రాసెస్‌లు, పటాలు, పట్టికలు, గ్రాఫ్‌లు, మూలక ధర్మాలపై అధ్యయనం చేయాలి. భౌతిక రసాయనశాస్త్రంలో ఫార్ములాలు, ఫార్ములా ఆధారిత ప్రశ్నలపై దృష్టి సారించాలి. అన్ని ఫార్ములాలు, వాటిలోని కాన్‌స్టంట్‌ విలువలను నోట్సుగా తయారుచేసుకోవాలి. అకాడమీ పాఠ్యపుస్తకంలో ఉదాహరణ ప్రశ్నలు, సాల్వ్‌డ్‌ ప్రాబ్లమ్స్‌పై దృష్టిపెట్టడం మంచిది. అకాడమీ పుస్తకంలో ప్రతి అధ్యాయం చివర్లో ఇచ్చిన ప్రాక్టీసు ప్రశ్నలు, సమీకరణ అంశాలను చదవాలి.
1 ఐపీఈతోపాటు ఎంసెట్‌ రాసేవారు రోజూ ప్రణాళిక ప్రకారం చాప్టర్లను విభజించుకుని సన్నద్ధమవ్వాలి.
2 పాఠ్యపుస్తకాలను చదువుతూ సాధన చేయాలి.
3 ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులకూ కొంత సమయం కేటాయించటం మేలు.
4 ఒక్కో చాప్టర్‌ చొప్పున సన్నద్ధమై చాప్టర్లవారీ టెస్టులు రాయాలి.
5 ఎంసెట్‌కు ముందు కొన్ని గ్రాండ్‌ టెస్ట్‌లు రాయగలిగితే ఉపయోగం.
6 ప్రతిరోజూ కొంత సమయం పునశ్చరణకు కూడా కేటాయించాలి.
7 గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సేకరించి, విశ్లేషించి వాటిలోని అంశాలను నేర్చుకోవాలి.

- పద్మశ్రీ జాలాది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని