కొలువులిచ్చే ఐఓటీ

కొవిడ్‌ వల్ల ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఇవి మళ్లీ లాభాల బాట పట్టడానికి అమలుచేయాల్సిన మొదటి నాలుగు టెక్నాలజీల్లో ఐఓటీ ఒకటి. శాంసంగ్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, క్వాల్కమ్‌, ఇంటెల్‌ లాంటి  ఎన్నో అగ్రశ్రేణి సంస్థలు సైతం ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి.....

Updated : 22 Mar 2021 06:36 IST

కొవిడ్‌ వల్ల ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఇవి మళ్లీ లాభాల బాట పట్టడానికి అమలుచేయాల్సిన మొదటి నాలుగు టెక్నాలజీల్లో ఐఓటీ ఒకటి. శాంసంగ్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, క్వాల్కమ్‌, ఇంటెల్‌ లాంటి  ఎన్నో అగ్రశ్రేణి సంస్థలు సైతం ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అభివృద్ధి చెందుతూ భారీ సంఖ్యలో  ఉద్యోగాలను కల్పించే సామర్థ్యమున్న టెక్నాలజీ ఇది!

స్మార్ట్‌ వాచ్‌, స్మార్ట్‌ సిటీ, స్మార్ట్‌ హోం.. ఈ మాటలు వినే ఉంటారు. స్మార్ట్‌ వాచ్‌తో శారీరక కదలికలు, గుండె కొట్టుకునే వేగం, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి వంటివి చూసుకుంటాము. అలాగే టెస్లా కారులో ‘ఆటో పైలట్‌’ ఫీచర్‌ గురించి వినే ఉంటారు. ఈ ఫీచర్‌తో డ్రైవర్‌ అవసరం లేకుండా కార్‌ అదే సొంతంగా డ్రైవ్‌ చేసుకుంటుంది. ట్రాఫిక్‌ సిగ్నళ్లను పాటిస్తుంది, సొంతంగా పార్కింగ్‌ చేసుకుంటుంది. అమెరికాలో ఉండే మీ స్నేహితుడితో మీరు వీడియో కాల్‌ మాట్లాడుతున్నారు. ఇష్టమైన సినిమా చూస్తున్నారు. నచ్చిన గేమ్‌ ఆడుతున్నారు. ఇలా ఎన్నెన్నో పనులు స్మార్ట్‌ ఫోన్‌ తో చేయగలుగుతున్నారు. మీ సమీపంలో ఉన్న-  టీవీ, ఏసీ, లైట్‌, ఫాన్స్‌.. అన్నీ అనుసంధానమైతే ఎలా ఉంటుంది? ఇంటి నుంచి బయటకి వెళ్ళేటపుడు ఏసీ, ఫ్యాన్‌, లైట్‌ వాటంతట అవే స్విచ్‌ ఆఫ్‌ అవ్వడం, మళ్లీ ప్రవేశించినప్పుడు అవే స్విచ్‌ ఆన్‌ అవ్వడం! మీరు షాపింగ్‌ మాల్‌కి వెళ్ళినప్పుడు పార్కింగ్‌ కోసం వెతకకుండా ఫలానా చోట ఖాళీ ఉందని మీకు నోటిఫికేషన్‌ వస్తుంది. ఇవన్నీ సాధ్యపడాలంటే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కనెక్ట్‌ అయ్యి చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోగలగాలి. అలా చెయ్యగలిగే టెక్నాలజీయే ఐఓటీ.
ఐఓటీ డివైసెస్‌ ఎలా కమ్యూనికేట్‌ చేస్తాయో తెలుసా?ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు పంపడానికి బ్లూ టూత్‌కూ, ఇంకా వైఫైతో ఇంటర్నెట్‌కీ అనుసంధానమవుతాం కదా! అలాగే వేరే పరికరాలతో కమ్యూనికేట్‌ చేయడానికి చాలా వైర్లెస్‌ టెక్నాలజీలు ఉంటాయి. 4జి, 5జి, LoRaWAN
® లాంటివి కొన్ని ఉదాహరణలు.

తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో...
సెన్సార్ల నుంచి వచ్చిన సమాచారంతో తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి, తెలివిగా ప్రవర్తించడానికి మనం ఒక అప్లికేషన్‌ని వాడతాము. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో పంటల్లో సెన్సార్లు పెట్టాక రైతు అతనికి కావాల్సిన విధంగా ప్రాధాన్యాలు ఇచ్చుకోవచ్చు. ‘ఉదయం ఈ సమయానికి ఈ మోతాదులో పంటలకు  నీరు ఇవ్వాలి, సాయంత్రం ఈ సమయానికి ఈ మోతాదులో నీరు ఇవ్వాలి’ అని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే సెన్సార్ల నుంచి వచ్చిన సమాచారంతో (పంట పొడిగా ఉందా, తడిగా ఉందా, వాతావరణం ఎండగా ఉందా, తేమగా ఉందా) రైతు తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అప్లికేషన్‌ ఉపయోగపడుతుంది.


భారీ సంఖ్యలో ఉద్యోగాలు

2018లో ఐఓటీకి సంబంధించిన ప్రపంచ మార్కెట్‌ విలువ 151 బిలియన్‌ డాలర్లు ఉంది. అది 2025కి సుమారు పది రెట్లు పెరుగుతుంది అంటే సుమారు 1567 బిలియన్‌ డాలర్లు అవ్వబోతుంది. 2025 నాటికి 4160 కోట్ల డివైసెస్‌ ఈ ఐఓటీ ద్వారా సంధానమవుతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రభావం చూపుతోందంటే అంతే ఎక్కువగా ఉద్యోగాలూ ఉంటాయి కదా! 2017లో టెలికాం విభాగం చెప్పిన ప్రకారం కేవలం భారత్‌లోనే సుమారు 1.5 కోట్ల ఉద్యోగాలు రాబోతున్నాయి. 47 శాతం కంపెనీలు తమకు ఐఓటీలో నైపుణ్యం కలిగిన వ్యక్తుల కొరత ఉందని చెబుతున్నాయి.


కెరియర్‌గా మలచుకోవాలంటే?

ఐఓటీలో డివైసెస్‌లో సెన్సార్లు చాలా ముఖ్యమైనవి. మొదటగా వివిధ రకాల సెన్సార్ల గురించి తెలుసుకోవాలి. ఈ సెన్సార్లను ఇంటిగ్రేట్‌ చేయడానికి Arduino UNO, Node MCU, Raspberry Pie లాంటి ఐఓటీ డెవలప్‌మెంట్‌ బోర్డులు ఉంటాయి. ఈ డివైసెస్‌ పని చేయాలంటే రూపొందించాల్సిన సాఫ్ట్‌వేర్‌నే ‘ఫర్మ్‌ వేర్‌’ అంటాము. దానికోసం C /embedded C, C ++, Micro python, python లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై పట్టు అవసరం. అప్లికేషన్‌ని రూపొందించడానికి అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, ప్రెడిక్స్‌, థింగ్‌ స్పీక్‌ లాంటి వేదికపై అవగాహన ఉండాలి.
ఇంత భారీ ఉద్యోగావకాశాలున్న ఐఓటీలో విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. యుడెమి, కోర్స్‌ఎరా లాంటి వాటిలో ఐఓటీ నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఇతర వనరులెన్నో ఉన్నాయి. వాటిలో ఐబీ హబ్స్‌, నెక్స్ట్‌వేవ్‌ సంస్థ (ccbp.in/professional) ఒకటి. సీసీబీపీ ప్రోగ్రామ్స్‌ ద్వారా ఐఓటీలో శిక్షణ ఇస్తూ, ఉద్యోగార్హతలను పెంచుతోంది.

- శేష సాయి
(ఐఓటీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ‘సైబర్‌ ఐ’)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని