Career: నేర్చుకో.. తీర్చిదిద్దుకో!

పరిణామాలను ఎదుర్కొంది. కొవిడ్‌ వల్ల కంపెనీలు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవాల్సివచ్చింది. ఆచరణ అసాధ్యమనుకున్న సంస్థలు కూడా ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే వీలు కల్పించాయి. ఇదే స్థితి రాబోయే రోజుల్లోనూ కొనసాగనున్న నేపథ్యంలో ఈ   డిజిటల్‌ నైపుణ్యాలను సమర్థంగా అందిపుచ్చుకోవడం తప్పనిసరి అయింది. విద్యార్థులూ, ఉద్యోగులూ వీటిని గమనించుకోవాలి!

Updated : 10 May 2021 07:13 IST

ప్రాధాన్యం పెరిగిన డిజిటల్‌ మెలకువలు
2020 సంవత్సరం పెద్ద డిజిటల్‌

పరిణామాలను ఎదుర్కొంది. కొవిడ్‌ వల్ల కంపెనీలు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవాల్సివచ్చింది. ఆచరణ అసాధ్యమనుకున్న సంస్థలు కూడా ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే వీలు కల్పించాయి. ఇదే స్థితి రాబోయే రోజుల్లోనూ కొనసాగనున్న నేపథ్యంలో ఈ   డిజిటల్‌ నైపుణ్యాలను సమర్థంగా అందిపుచ్చుకోవడం తప్పనిసరి అయింది. విద్యార్థులూ, ఉద్యోగులూ వీటిని గమనించుకోవాలి!
గత కొన్నేళ్లుగా పెద్ద పరిశ్రమలన్నింటిలోకీ కృత్రిమ మేధ (ఏఐ) చొచ్చుకొని వచ్చేస్తుందని భావించడం ఎంత వాస్తవమో.. చిన్న సంస్థలు ప్రాథమిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికే సమయం పడుతుందనుకోవడమూ అంతే నిజం. కానీ ఈ పరిస్థితిలో కొవిడ్‌ పెను మార్పు తెచ్చింది. చిన్న, మధ్యతరహా అన్న తేడా లేకుండా ప్రతి సంస్థా డిజిటల్‌ నైపుణ్యాలను అందిపుచ్చుకుంది. వాటిపై కొద్దో గొప్పో అవగాహన ఉన్నవారు ఉద్యోగాలను కాపాడుకోగలిగారు. కొందరు అప్పటికప్పుడు అందిపుచ్చుకోగా, మరికొందరు కొలువులకే దూరమయ్యారు.
పూర్వపు స్థితి తిరిగి రాబోతోంద]నుకున్న సమయానికి సెకండ్‌ వేవ్‌ వచ్చింది. ఆఫీసు బాట పట్టిన ఉద్యోగులు మళ్లీ ఇంటి నుంచి పనిచేయడానికే పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితి భవిష్యత్‌లో చక్కబడినా రిమోట్‌ వర్కింగ్‌కు ప్రాధాన్యం పూర్తిగా తగ్గే అవకాశాలు స్వల్పమే. అందుకని భవిష్యత్‌లో కొలువు బాట పట్టే విద్యార్థులూ, ఉద్యోగార్థులూ సంబంధిత నైపుణ్యాలను ముందుగానే తెలుసుకుని, నేర్చుకుని ఉండటం మంచిది. వీటిలో వ్యక్తిగత మెలకువలకే కాదు.. సాంకేతిక నైపుణ్యాలకూ ప్రాధాన్యమివ్వాలి.
స్వతంత్రతే ప్రధానం
సాధారణంగా ఆఫీసులో ఏదైనా సమస్య ఎదురైనపుడు తోటివారు లేదా పై అధికారి దగ్గరకు వెళ్తుండటం సహజం. వర్చువల్‌ పరిస్థితిలో సంస్థలోలాగా త్వరగా సమాచారాన్ని పంచుకోవడం, వారి దగ్గర్నుంచి వెంటనే స్పందన దొరకడం వంటివి కుదరకపోవచ్చు. కాబట్టి వీలైనంతవరకూ స్వతంత్రంగా పూర్తిచేయగలిగేలా ఉండాలి. ఉదాహరణకు- సంస్థలో ఉన్నపుడు సిస్టమ్‌ ఏదైనా సమస్యవస్తే సంబంధిత విభాగం వచ్చి సరిచేస్తుంది. ఇంట్లో ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడ మీరే సొంతంగా సరిచేసుకోవాలనే ఉద్దేశం కాదు. కానీ ప్రాథమిక పరిజ్ఞానాన్ని ఏర్పరచుకోవాలి. లేదా త్వరగా మీ సమీపంలో పని పూర్తిచేయగలవారి వివరాలనైనా దగ్గరుంచుకోగలగాలి. పని విషయానికీ ఈ సూత్రం వర్తిస్తుంది.
వ్యక్తిగత ప్రేరణ
ఇంట్లో/ వేరే ఎక్కడినుంచైనా పనిచేసేటపుడు తరచూ పర్యవేక్షించే వారు ఉండరు. ఆఫీసులో పరిస్థితి వేరు. తరచూ ఉన్నతాధికారి/ బృంద నాయకుడు పని ఎంతవరకూ వచ్చిందో తెలుసుకుంటుంటారు. అవసరమైతే గడువులను గుర్తుచేస్తుంటారు. రిమోట్‌ వర్కింగ్‌లో ఈ పరిస్థితి ఉండదు. కానీ అనుకున్న సమయానికి పనిచేయడం మాత్రం తప్పనిసరి. కాబట్టి సొంతంగా షెడ్యూల్‌ తయారు చేసుకోవాలి. గడువులు, దశలవారీగా పూర్తిచేయాల్సిన పనుల వివరాలను రాసుకోవాలి. అలాగే పనివేళల్లో దృష్టిని మరల్చేవాటిని దూరంగా ఉంచుకోవాలి. ఏదైనా తప్పు జరిగినా దాన్ని సకాలంలో పూర్తిచేసేలా చూసుకోవాలి. ఎవరో వచ్చి సర్దిచెప్పే లేదా ప్రోత్సహించే వాతావరణాన్ని ఆశించడం కష్టం. కాబట్టి, వ్యక్తిగతంగా ప్రేరణ తెచ్చుకోవాలి. అవసరమైతే సీనియర్ల సాయం తీసుకోవచ్చు. కానీ మానసిక స్థిరత్వానికి వారిపైనే పూర్తిగా ఆధారపడే ధోరణి మాత్రం మంచిది కాదు. నియామక సంస్థలు ఎక్కువగా దృష్టిపెడుతున్న అంశాల్లో ఇదీ ఒకటి.
ముఖాముఖిలో ఒప్పించాలి
ఫోన్‌ ఆడియో సంభాషణలున్నప్పటికీ.. ఎదురుగా చర్చించుకున్న అంశాలకు ఇంకాస్త ఎక్కువ ప్రాధాన్యముంటుంది. రిమోట్‌ వర్కింగ్‌లో ఆ వీలును వీడియో కాల్స్‌ తీరుస్తున్నాయి. క్లయింట్‌ అవసరాలు, మార్కెటింగ్‌లకూ ఇవి సాయపడుతున్నాయి. కాబట్టి, ఆయా అప్లికేషన్లపై అవగాహన పెంచుకోవాలి. షెడ్యూలింగ్‌, అప్‌డేటింగ్‌, ఫైల్‌ షేరింగ్‌, వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహణ వంటివన్నింటినీ తెలుసుకోవాలి. అవసరమైతే వీటికి సంబంధించి ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ వ్యవధితో పైగా చాలావరకూ ఉచితం. వీటి సాయం తీసుకోవచ్చు.
దూరంగా ఉన్నా..
ఆఫీసు పని అంటేనే బృందంతో కూడుకున్నది. ఇక్కడ అందరూ ఒకేలా పని చేసేవారుండరు. కొందరు వేగంగా చేస్తే, ఇంకొందరు నెమ్మదిగా చేస్తుంటారు. కానీ ఇచ్చిన టాస్క్‌ సకాలంలో పూర్తవ్వాలంటే పంచుకోవడం మాత్రం తప్పనిసరి. అప్లికేషన్లు, ఫైల్స్‌ను ఒకరితో మరొకరు పంచుకోవడమూ సాధారణమే. కాబట్టి అందుకు తగ్గ సాంకేతిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు- డ్రాప్‌ బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ మొదలైనవి. త్వరితగతిన నిర్ణయం తీసుకోవడంలోనూ ఇవి సాయపడతాయి. సమయమూ ఆదా అవుతుంది.

రాతలోనూ మెప్పించాలి

చాలాసార్లు వీడియో కాలింగ్‌ అనుకూలం కాకపోవచ్చు. క్లయింట్‌/ అవతలి వ్యక్తికి కుదరకపోవచ్చు. ఈ సమయాల్లో మెసేజ్‌, ఈ-మెయిల్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇక్కడ చేసే చిన్న పొరబాటు సమయపు వృథాతోపాటు అపార్థాలకూ దారితీసే అవకాశముంది. కాబట్టి స్పష్టత ప్రధానం. ఎక్కువ పరిమాణంలో రాసినా అనాసక్తికి దారి తీయొచ్చు. ఇక్కడే కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యాలు అవసరమవుతాయి. తక్కువ పదాల్లో సమాచారాన్ని ప్రభావవంతంగా చెప్పగలిగితే విజయం సాధించినట్లే. కాబట్టి, ఈ దిశగా సాధన చేయాలి. మెసేజ్‌, ఈ-మెయిల్‌, ప్రాజెక్ట్‌ నోట్‌.. అన్నింటికీ ఇది వర్తిస్తుంది.

సామాజిక మాధ్యమాల సంగతేంటి?

గత ఏడాది లాక్‌డౌన్‌ ప్రారంభం కాగానే.. ఎప్పుడూ ఆసక్తి చూపనివారూ సోషల్‌ మీడియా మాధ్యమాలవైపు మొగ్గు చూపారు. ఆటవిడుపుకే కాకుండా సమాచారం, సృజనాత్మక అంశాల కోసమూ దీనిపై ఆధారపడ్డారు. దీంతో వివిధ కమ్యూనిటీలూ ఏర్పడ్డాయి. వివిధ బ్రాండ్‌లూ ఇందుకు మినహాయింపు కాదు. దీంతో డిజిటల్‌ నైపుణ్యాల్లో సోషల్‌ మీడియా స్కిల్స్‌కూ ప్రాధాన్యం పెరిగింది. సామాజిక మాధ్యమాలు, బ్లాగుల్లో సమాచారాన్ని పంచుకోవడం, వాటిని ఆకట్టుకునేలా అందంగా రాయడం వంటివాటికి ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా మార్కెటింగ్‌లో దీని ప్రాధాన్యం హెచ్చింది. ఈ నైపుణ్యాలకూ ప్రాధాన్యమివ్వాలి. వీటిపై సాధన ద్వారానే పట్టు సాధించడం సాధ్యమవుతుంది. అవసరమనుకుంటే సంబంధిత కోర్సుల సాయమూ  తీసుకోవచ్చు.

సురక్షితం మాటేంటి?

ఆఫీసు అయినా, రిమోట్‌ వర్కింగ్‌ అయినా ఎక్కువమంది పని కంప్యూటర్ల ఆధారంగానే. కాబట్టి పనికి ఉపయోగించేవాటిలో మార్పులేదు. కానీ.. ఆఫీసు విషయానికొచ్చేసరికి అక్కడ ఉపయోగించే నెట్‌వర్క్‌లకు బలమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇంటి దగ్గర అది కొరవడొచ్చు. పైగా ఇక్కడ ఎన్నో కొత్త అప్లికేషన్లనూ ఉపయోగించాల్సి వస్తుంది. దీంతో భద్రత ప్రశ్నార్థకమవుతుంది. ఏదైనా కొత్త అప్లికేషన్‌ను ఉపయోగించేటపుడు అది ఎంతవరకూ సురక్షితమో తెలుసుకోవాలి. అందుకు తగ్గ పరిశోధన చేసుకోవాలి. అలాగే ఉపయోగించే అప్లికేషన్ల నుంచి వైఫై, హాట్‌స్పాట్‌లన్నింటికీ గట్టి పాస్‌వర్డ్‌లనూ ఏర్పరచుకోవాలి. ఎందుకంటే సంస్థలు పని, నైపుణ్యాలే కాదు.. నమ్మకానికీ ప్రాధాన్యమిస్తాయి. ఒకసారి అది తెలిసీ తెలియక కోల్పోతే ఎన్ని నైపుణ్యాలున్నా వ్యర్థమే. కాబట్టి, వీటిపరంగానూ సిద్ధమవ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని