ఇంటర్వ్యూకు వెళుతున్నారా?

మీరో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంది. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ‘ఎలాంటి ప్రశ్నలు వేస్తారో... తెలిసినవి అడుగుతారో లేదో... ప్రశ్నలన్నింటికీ తడబడకుండా సరిగ్గా సమాధానాలు చెప్పగలనో లేదో...

Updated : 04 Oct 2021 06:01 IST

మీరో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంది. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ‘ఎలాంటి ప్రశ్నలు వేస్తారో... తెలిసినవి అడుగుతారో లేదో... ప్రశ్నలన్నింటికీ తడబడకుండా సరిగ్గా సమాధానాలు చెప్పగలనో లేదో...’- ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఆందోళన పడుతుంటారు కదా. అలాంటప్పుడు నిపుణులు సూచించే సలహాలు, సూచనలను పాటిస్తే ఫలితం అనుకూలంగా ఉండొచ్చు. అవేమిటో తెలుసుకుందామా..!

మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) జరిగే వ్యవధి ఎప్పుడూ తక్కువే ఉంటుంది. ఈ స్వల్ప సమయంలోనే రిక్రూటర్లకు మీ మీద సదభిప్రాయం కలిగేలా చేసుకోవాలి. మీ బాడీ లాంగ్వేజ్‌ బాగుండాలి. వాళ్లు అడిగే ప్రశ్నలకు మర్యాదగా సమాధానం చెప్పాలి. అతి తక్కువ సమయంలో వీటన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తేనే ఉద్యోగం ఖాయం.

చెదరని ఆత్మవిశ్వాసం: అంతవరకు మీకు పరిచయంలేని కొత్త మనుషులతో మాట్లాడటం అంటే లోలోపల భయం, బెరుకు ఉంటాయి. కానీ వాటన్నింటినీ బయటపడనీయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చెప్పే సమాధానాల కంటే మీ ప్రవర్తననే రిక్రూటర్లు ఎక్కువగా గమనిస్తుంటారు. కాబట్టి ‘పవర్‌ పోజ్‌’ను సాధన చేయాలంటారు నిపుణులు. అంటే భుజాలను కిందకు వంచి, నీరసంగా సమాధానాలు చెప్పకూడదు. నిటారుగా కూర్చుని, భుజాలను సమానంగా ఉంచాలి. ఒక భుజాన్ని పైకి, ఒకదాన్ని కిందకు పెట్టి కూర్చోకూడదు. మీ నడక, మాట తీరులో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించాలి. అటూఇటూ చూడకుండా ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూస్తూ ఆత్మవిశ్వాసంతో జవాబులు చెప్పాలి. రిక్రూటర్లు అడిగిన అన్ని విషయాలూ మీకు తెలిసుండకపోవచ్చు. తెలియపోతే.. అదే విషయాన్ని మర్యాదగా చెప్పాలి. అలాగే అన్నీ నాకే మీకే తెలుసన్నట్టుగా మాట్లాడకూడదు. తెలియని విషయాన్ని తెలియదని నిజాయతీగా ఒప్పుకోవాలి. అయితే దాని గురించి తెలుసుకుంటానని మర్యాదగా చెప్పాలి. రిక్రూటర్లు ఏం అడిగారు అన్నదికాదు.. మీరు ఎంత చక్కగా, మర్యాదగా జవాబు చెబుతున్నారనేదే ముఖ్యం.

ఎదుటివారిని గమనించాలి: ఇంటర్వ్యూ సమయంలో ఎలా ప్రవర్తించాలనే విషయంలో కొన్ని సందేహాలు రావడం సహజమే. అలాంటప్పుడు ఒకసారి మీ ఎదురుగా ఉన్న అధికారులనే గమనించవచ్చు. వారి శరీర భాష, కూర్చున్న భంగిమ, స్వరంలోని హెచ్చుతగ్గులు, చూసే విధానం... వీటన్నింటినీ పరిశీలించి మీరు కూడా పాటించవచ్చు. కూర్చున్న తర్వాత ఒకసారి కాలు మీద కాలు వేసుకోవడం, కాసేపటి తర్వాత తీసేయడం... లాంటివి చేయడం వల్ల మీ మీద మంచి అభిప్రాయం కలగదు.

పేరు తెలిస్తే మంచిదే: మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పేరు తెలియకపోతే ‘సర్‌’ అని సంబోధిస్తారు. కొన్ని సందర్భాల్లో పేరు తెలిసినప్పుడు మాత్రం ఆ పేరుతో కృతజ్ఞతలు చెప్పినా మంచిదే. ముఖ్యంగా ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత సెలవు తీసుకునే సమయంలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి పేరుతో కృతజ్ఞతలు చెప్పవచ్చు. అయితే పేరు తెలుసు కదాని పదేపదే పేరు పెట్టి పిలవడం మర్యాదగా ఉండదు సరికదా.. చిరాకు పెట్టిస్తుంది కూడా.  

సందర్భోచిత ప్రశంస: ప్రశంస వల్ల సానుకూలంగా స్పందించే అవకాశం లేకపోలేదు. వ్యాపార లావాదేవీలు, అమ్మకాలు, ఉద్యోగాల ఇంటర్వ్యూలు, ప్రజెంటేషన్ల సమయంలో ప్రశంస చక్కని ఫలితాలను అందిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగని అదే పనిగా ఎదుటివారిని పొగడకూడదు. దీనివల్ల మీ మీద అప్పటివరకూ ఉన్న అనుకూలత పోయి ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముంది. ఏదైనా ఒక పరిధికి లోబడి మాత్రమే ఉండాలి. అవసరమైన మేరకు మాత్రమే ప్రశంసిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ‘అలాంటి విపత్కర పరిస్థితుల్లో సంస్థ ఆ ఒప్పందాన్ని ఎలా రద్దు చేసుకోగలిగింది’ అంటూ మీరు చేరబోయే సంస్థను ప్రశంసించవచ్చు. ‘విపత్కర పరిస్థితుల్లో నేనూ చక్కని నిర్ణయాలు తీసుకోగలను...’ అంటూ మీరు గతంలో తీసుకున్న, సత్ఫలితాలను ఇచ్చిన నిర్ణయాల గురించి చెప్పవచ్చు. అయితే ఇది మీ గురించి మీరు గొప్పలు చెబుతున్నట్టుగా ఉండకూడదు.

శ్రద్ధగా వినాలి: ప్రశ్న పూర్తికాకముందే మధ్యలోనే ఆపేసి అత్యుత్సాహంతో సమాధానం చెప్పకూడదు. అలా మధ్యలోనే ఆపేయడం వల్ల మీకు ఆసక్తి, ఓపిక, శ్రద్ధగా వినే సామర్థ్యం లేదనే అభిప్రాయానికి రావచ్చు. ఇలాంటి సమస్య లేకుండా ఉండాలంటే.. ప్రశ్నను పూర్తిగా విని, అర్థం చేసుకున్న తర్వాతే సమాధానం చెప్పాలి. ఇలా శ్రద్ధగా, ఆసక్తిగా వినడం వల్ల మీరంటే సదభిప్రాయం కలగడానికి అవకాశం ఉంటుంది. పైగా ఉద్యోగానికి అత్యంత అవసరమైనది - వినే నైపుణ్యమే. ఇది మీకు పుష్కలంగా ఉందనే విషయం ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఉద్యోగైనా, అధికారైనా ఈ సామర్థ్యం ఎంతో అవసరం. భవిష్యత్తులోనూ ఈ నైపుణ్యం ఎంతో ఉపయోగపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని