విచారణలో లోపాలు ఉన్నా..!

దిల్లీలో (2012 డిసెంబరు 16న) జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష ఖరారైంది. ముకేశ్‌ సింగ్‌ అనే దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

Published : 12 Feb 2020 02:27 IST

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు

ఇండియన్‌ పాలిటీ

దిల్లీలో (2012 డిసెంబరు 16న) జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష ఖరారైంది. ముకేశ్‌ సింగ్‌ అనే దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంతో దిల్లీలోని అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోడా డెత్‌వారెంట్లు జారీచేశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో రాష్ట్రపతికి నిర్దేశించిన క్షమాభిక్ష అధికారాలు, వాటికి సంబంధించిన వివరణ, దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

రాష్ట్రపతి - క్షమాభిక్ష అధికారాలు

ఒక వ్యక్తి నేరం రుజువైతే సాధారణ శిక్ష లేదా మరణశిక్షను విధించే అధికారం భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా సెషన్స్‌కోర్టులు, సైనిక కోర్టులకు ఉంది. అలాంటి నేరగాళ్లకు అయిదు రకాల క్షమాభిక్షలను ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 72 ప్రకారం సంక్రమిస్తుంది. న్యాయవిచారణలో లోపాలు ఉన్నాయనుకున్నప్పుడు, విచారణలో ఏవైనా అంశాలను విస్మరించినట్లు భావిస్తే రాష్ట్రపతి ఈ అధికారాలను వినియోగిస్తారు.

క్షమాభిక్ష (Pardon - Absolving entire guilt and punishment): దీని ప్రకారం శిక్షను పూర్తిగా రద్దు చేసి రాష్ట్రపతి క్షమాభిక్షను ప్రసాదించగలరు. ఉదా: మరణశిక్షను రద్దుచేసి సంబంధిత దోషికి ప్రాణభిక్షను ప్రసాదించడం.

మార్పు (Commutation - Changing nature of sentence): దీని ప్రకారం ఒక శిక్షను మరో శిక్షగా మార్పుచేయడం. ఉదా: మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం.

మినహాయింపు (Remmission - Reduction of amount of sentence without changing the nature): దీని ప్రకారం నేరగాడికి విధించిన శిక్షలో మార్పు చేయకుండా శిక్ష పరిమాణాన్ని తగ్గిస్తారు. ఉదా: కఠిన కారాగార శిక్షకు గురైన వ్యక్తికి శిక్షాకాలాన్ని తగ్గిస్తారు.

విరామం (Respite - Awarding lesser sentence on special grounds): ప్రత్యేక కారణం వల్ల ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్పు చేయడం.

ఉదా: శిక్షకు గురైన వ్యక్తులు మానసిక సమతౌల్యం కోల్పోయినప్పుడు, గర్భిణీగా ధ్రువీకరణ జరిగినప్పుడు.

● రాజీవ్‌గాంధీ హత్యకేసులో నిందితురాలైన నళిని గర్భవతి కావడంతో ఆమెకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పుచేశారు.

నిలుపుదల (Reprieve - Postponement of sentence): నేరగాళ్లకు విధించిన శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేయడం.ఉదా: మరణశిక్షకు గురైన నేరగాడు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరినప్పుడు రాష్ట్రపతి తన నిర్ణయాన్ని వెలువరించే వరకు మరణశిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తారు.

రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారాలు న్యాయశాఖతో సంబంధం లేకుండా స్వతంత్రమైనవి. అంటే ఇవి కార్యనిర్వాహక వర్గ పరిధిలోకి వస్తాయి. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకే రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలను వినియోగిస్తారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 161 ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ క్షమాభిక్ష అధికారాలు కలిగి ఉంటారు. కానీ మరణశిక్ష, సైనిక కోర్టులు విధించే శిక్షలకు గవర్నర్‌ క్షమాభిక్షను ప్రసాదించలేరు. రాష్ట్ర భూభాగ పరిధిలో ఉన్నవారికి మాత్రమే గవర్నర్‌ క్షమాభిక్షను ప్రసాదించగలరు.

సుప్రీంకోర్టు తీర్పులు

సుధాకర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసు, 2006

రాష్ట్రపతి, గవర్నర్‌లు (కార్యనిర్వాహక శాఖ) ప్రసాదించిన క్షమాభిక్ష అధికారాలను న్యాయవ్యవస్థ సమీక్షించవచ్చని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. గౌరు వెంకటరెడ్డి అనే నేరగాడికి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ షిండే క్షమాభిక్షను ప్రసాదించడాన్ని జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌, ఎస్‌.హెచ్‌. కపాడియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.

(సుప్రీంకోర్టుకు సంబంధించిన మరిన్ని తీర్పుల వివరాలు, మాదిరి ప్రశ్నలు-జవాబుల కోసం QR code స్కాన్‌ చేయవచ్ఛు)

- బంగారు సత్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని