కొత్త ప్రదేశాలు.. వంటకాలు అంటే ఆసక్తి ఉంటే?

మా అబ్బాయి పదో తరగతి చదువుతున్నాడు. తనకు దేశంలోని కొత్త ప్రదేశాలు, కొత్త వంటకాల గురించి తెలుసుకోవడమంటే ఆసక్తి.

Published : 14 Apr 2020 01:35 IST

* మా అబ్బాయి పదో తరగతి చదువుతున్నాడు. తనకు దేశంలోని కొత్త ప్రదేశాలు, కొత్త వంటకాల గురించి తెలుసుకోవడమంటే ఆసక్తి. తన అభిరుచినే కెరియర్‌గా మలచుకుంటే బావుంటుందనేది మా ఆలోచన. తనకు ఏ కెరియర్‌ సరిపోతుంది?

- ఎం. మాధవి

* పిల్లల అభిరుచికి తగిన రంగానికి సంబంధించిన కోర్సు చదివించడం ఎల్లప్పుడూ సరైన పద్ధతి. మీ అబ్బాయికి ఇష్టమైన అంశాలను గుర్తించి అదే తన కెరియర్‌గా చేయాలనే మీ ఆలోచన హర్షణీయం. కొత్త ప్రదేశాలూ, కొత్త వంటకాల గురించి తెలుసుకోవడమంటే ఆసక్తి ఉందన్నారు కాబట్టి, ఇలాంటి వాళ్ళకి కలినరీ ఆర్ట్స్‌, ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ సర్వీసెస్‌, బేకరీ అండ్‌ కంఫెక్షనరీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా టూరిజం మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. పదో తరగతి పూర్తి అయిన తర్వాత ఆ రంగాల్లో డిప్లొమా కోర్సు చేయించవచ్చు. లేదా ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాక డిగ్రీ చేయడం మరో దారి. ఇదే రంగాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసే అవకాశాలూ ఉన్నాయి. ఈ కోర్సులను ప్రభుత్వంతోపాటు ప్రైవేట్‌ విద్యాసంస్థలూ అందిస్తున్నాయి. వీటికి సంబంధించిన కళాశాలను ఎంచుకునేటప్పుడు ఆ సంస్థ ఏ విశ్వవిద్యాలయ పరిధిలోకి వస్తుందనే విషయంతో పాటు, ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తెలుసుకోవాలి. సంస్థల్లో చదివిన పూర్వవిద్యార్థులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇవే కాకుండా వంటకాలు, టూరిజం- ట్రావెల్‌ వైపు ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులతోపాటు జర్నలిజం కోర్సును చదివితే రిపోర్టర్లుగానో, యాంకర్లుగానో స్థిరపడవచ్చు.


బీఎస్సీ (బీజెడ్‌సీ) తర్వాత?

* బీఎస్సీ (బీజెడ్‌సీ) రెండో ఏడాది చదువుతున్నాను. నాకున్న భవిష్యత్‌ విద్య, ఉద్యోగావకాశాలేంటి? గ్రూప్స్‌కు సిద్ధమైతే మంచిదా?

- టి. ప్రసాద్‌

* బీఎస్సీ (బీజెడ్‌సీ) చదివిన విద్యార్థులకు విద్యావకాశాలెన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు చదివిన తర్వాత బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌, బయోటెక్నాలజీల్లో ఎమ్మెస్సీ చేయవచ్చు. ఆసక్తి,  ఉత్సాహం ఉంటే పరిశోధనరంగంలోకి ప్రవేశించవచ్చు. దీనికోసం మాస్టర్‌ కోర్సు పూర్తి చేయాలి. తర్వాత పీహెచ్‌డీలో చేరవచ్చు. ఒకవేళ సైన్స్‌ ఫీల్డ్‌ నుంచి మారాలనుకుని, వ్యాపార రంగంపై ఆసక్తి ఉంటే ఎంబీఏ చదవవచ్చు. సోషల్‌ సైన్స్‌లో ఇష్టం ఉంటే ఆంత్రపాలజీ లాంటి కోర్సులు చేయవచ్చు. ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే బీఎస్సీ అర్హతతో బయోటెక్‌, ఫార్మా సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డిగ్రీ అర్హతతో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హులు అవుతారు. గ్రూప్స్‌ కోసం తప్పకుండా ప్రయత్నించవచ్చు. మీరు మీ డిగ్రీలో చదివిన పలు అంశాలు ఈ పరీక్షలకు ఉపయోగపడతాయి.

- ప్రొ. బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని