ఆర్థికశాస్త్రంలో అవకాశాలు?

హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల కాంబినేషన్‌తో బీఏ చదువుతున్నాను. వీటిలో ఎకనామిక్స్‌పై ప్రత్యేక ఆసక్తి. ఈ కోర్సును పీజీ స్థాయిలో

Updated : 15 Nov 2021 06:38 IST


హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల కాంబినేషన్‌తో బీఏ చదువుతున్నాను. వీటిలో ఎకనామిక్స్‌పై ప్రత్యేక ఆసక్తి. ఈ కోర్సును పీజీ స్థాయిలో అందించే మేటి సంస్థలు, కెరియర్‌ అవకాశాలను వివరించగలరు?

- శ్రీనివాస్‌, విజయనగరం


మంచి అవకాశాలు అందించే కోర్సుల్లో ఆర్థికశాస్త్రం ఒకటి. ఈ సబ్జెక్టుపై గట్టి పట్టున్నవారు వివిధ రకాల సంస్థలు, విభాగాల్లో సేవలు అందించవచ్చు. పీజీలో ఎంచుకోవడానికి ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఎస్‌ఐ- కోల్‌కతా, దిల్లీల్లో ఈ కోర్సును అందిస్తున్నారు. ఎంపికైనవారు నెలకు రూ.8000 స్టైపెండ్‌తో చదువుకోవచ్చు. ఎకనామిక్స్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పరిశోధకులు, విశ్లేషకులు, ఆర్థిక సలహాదారు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌, ఆడిటర్‌, స్టాక్‌ బ్రోకర్‌, బిజినెస్‌ జర్నలిస్ట్‌ తదితర హోదాలతో ఉద్యోగాలు పొందవచ్చు. పీజీ అనంతరం పీహెచ్‌డీతో బోధన రంగంలో రాణించవచ్చు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే ఎకనామిక్‌ సర్వీస్‌లో ఎంపికైనవారు గ్రూప్‌-ఎ ఆఫీ సర్‌గా విధులు నిర్వహించవచ్చు. ఆర్‌బీఐలోనూ అవకాశాలు ఉంటాయి.

జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు

ఐఐటీ దిల్లీ, రవుర్కెలాలు ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. జామ్‌తో ప్రవేశం లభిస్తుంది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ; దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, న్యూదిల్లీ; హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ; ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోల్‌కతా, న్యూదిల్లీ; జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, న్యూదిల్లీ; గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌, పుణే; మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఎంఎస్‌ఈ), చెన్నై; బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి; ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రిసెర్చ్‌ (ఐజీడీఆర్‌), ముంబయి; సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ (సీడీఎస్‌), తిరువనంతపురం; బిట్స్‌ - పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌లు, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, బెంగళూరు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ పీజీలో ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని