ఉన్నత ప్రమాణాలు.. ఉత్తమ వసతులు

ఆధునాతన సౌకర్యాలతో నాణ్యమైన విద్యకూ, పరిశోధనలకూ ప్రపంచ ప్రసిద్ధి చెందింది హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం.

Updated : 23 Dec 2022 16:50 IST

హెచ్‌సీయూ ప్రవేశ ప్రకటన విడుదల

ఆధునాతన సౌకర్యాలతో నాణ్యమైన విద్యకూ, పరిశోధనలకూ ప్రపంచ ప్రసిద్ధి చెందింది హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఇంటర్‌, డిగ్రీ, పీజీ అర్హతలతో హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ తదితర విభాగాల్లో పలు రకాల కోర్సులు ఈ సంస్థలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులకు నియామకాల్లో ప్రాధాన్యం లభిస్తోంది.

దేశంలో ప్రముఖ విద్యా సంస్థల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒకటి. తాజాగా ఈ విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. పరీక్షలో చూపిన ప్రతిభతో ఈ కోర్సుల్లో చేరవచ్చు.

* ఇంటర్‌తో ఇంటిగ్రేటెడ్‌ పీజీ
ఇంటిగ్రేటెడ్‌ విధానంలో అయిదేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులను పలు విభాగాల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందిస్తోంది.
ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ: మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ, అప్లయిడ్‌ జియాలజీ. వీటిలో అప్లయిడ్‌ జియాలజీలో 10, మిగిలినవాటిలో ఒక్కో విభాగంలో 20 చొప్పున సీట్లు ఉన్నాయి. సైన్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీలో 20 సీట్లకు 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా పోటీ పడవచ్చు.
ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (హ్యుమానిటీస్‌): తెలుగు - 19, హిందీ - 10, లాంగ్వేజ్‌ సైన్సెస్‌ - 19 సీట్లు ఉన్నాయి. వీటికి ఇంటర్‌ ఏ గ్రూప్‌ లోనైనా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్‌లో తెలుగు లేదా హిందీ చదివుండడం తప్పనిసరి.
ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్‌ - 14, హిస్టరీ - 13, పొలిటికల్‌ సైన్స్‌ - 13, సోషియాలజీ -14, ఆంత్రోపాలజీ -13 సీట్లు ఉన్నాయి. ఏ గ్రూప్‌తోనైనా 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆరేళ్ల వ్యవధితో మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఎం ఆప్టోమ్‌) కోర్సు  అందిస్తున్నారు. ఇందులో 28 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60శాతం మార్కులు తప్పనిసరి. 


మొత్తం కోర్సులు - 128
ఇంటిగ్రేటెడ్‌     - 16
పీజీలు         - 41
ఎంఫిల్‌        - 15
ఎంటెక్‌        - 10
పీహెచ్‌డీలు     - 46


* పరీక్ష తీరు
అన్ని ఇంటిగ్రేటెడ్‌ (ఎంఏ, ఎమ్మెస్సీ) కోర్సులకూ పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నలన్నీ ఇంటర్‌ స్థాయిలోనే ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ మూడో వంతు మార్కులు తగ్గిస్తారు. మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ, అప్లయిడ్‌ జియాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. నాలుగు సెక్షన్లలో ప్రశ్నలడుగుతారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ, ప్రాధాన్యం ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ కోర్సుకి దరఖాస్తు చేసుకున్నవారికీ వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షలో సైకాలజీ (ఇంటర్‌ స్థాయి), ఇంగ్లిష్‌లో అవగాహనపై ప్రశ్నలుంటాయి. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ హ్యుమానిటీస్‌ (తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్స్‌) కోర్సులకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థి ప్రవేశం కోరుకునే సబ్జెక్టు నుంచి ఈ ప్రశ్నలు అడుగుతారు.  ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ సోషల్‌ సైన్సెస్‌ (ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఉమ్మడి పరీక్ష ఉంటుంది. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికీ 25 మార్కులు కేటాయించారు.

* గ్రాడ్యుయేట్లకు...
రెండేళ్ల పీజీ సైన్స్‌ కోర్సుల్లో మ్యాథ్స్‌/ అప్లైడ్‌ మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ - ఆపరేషన్స్‌ రిసెర్చ్‌ (ఓఆర్‌), ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్‌ బయాలజీ అండ్‌ బయో టెక్నాలజీ,  మాలిక్యులర్‌ మైక్రో బయాలజీ, యానిమల్‌ బయాలజీ అండ్‌ బయోటెక్నాలజీ విభాగాల్లో ఎమ్మెస్సీ అందుబాటులో ఉంది. మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌), ఓషియన్‌ అండ్‌ అట్మాస్ఫెరిక్‌ సైన్సెస్‌, హెల్త్‌ సైకాలజీ, న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్స్ల్‌ల్లో పీజీలు నిర్వహిస్తున్నారు.

* పలు రకాల పీజీలు
ఇంగ్లిష్‌, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌, కంపారిటివ్‌ లిటరేచర్‌,  సాంస్క్రీట్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్టడీస్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్‌, జండర్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌, కమ్యూనికేషన్‌ మీడియా స్టడీస్‌, కమ్యూనికేషన్‌ మీడియా ప్రాక్టీస్‌ విభాగాల్లో పీజీలను హెచ్‌సీయూ అందిస్తోంది.
మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌: భరతనాట్యం, కూచిపూడి, థియేటర్‌ ఆర్ట్స్‌ ఉన్నాయి. ఫైన్‌ ఆర్ట్స్‌: పెయింటింగ్‌, ప్రింట్‌ మేకింగ్‌, స్కల్ప్‌చర్‌, ఆర్ట్‌ హిస్టరీ అండ్‌ విజువల్‌ స్టడీస్‌. ఎంబీఏ: ఇందులో హెల్త్‌ కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌లతో పాటు ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ఉంది.
వీటితోపాటు పలు విభాగాల్లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ, ఎంటెక్‌ కోర్సులను హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయం అందిస్తోంది.


హెచ్‌సీయూ ఎంసీఏ కోర్సునూ అందిస్తోంది ప్రవేశం నిమ్‌సెట్‌తో లబిస్తుంది. ఎంబీఏ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో క్యాట్‌ స్కోర్‌తో, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలోకి జేఎన్‌యూ నిర్వహించే సీఈఈబీతో ప్రవేశాలు లభిËస్తాయి. వీటి కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాలి. కొన్నింటికి గడువు ముగిసింది.


* ప్రవేశ విధానం
రెండేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులకు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం లభిస్తుంది. మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, ఎంఏ కమ్యూనికేషన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ కమ్యూనికేషన్‌ కోర్సులకు రాతపరీక్షతో పాటు ప్రాక్టికల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ కోర్సులు విశ్వవిద్యాలయానికి చెందిన సరోజినీ నాయుడు స్కూల్‌ పరిధిలోకి వస్తాయి.  ఎంబీఏ - హెల్త్‌ కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సుల్లో పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఐసీ టెక్నాలజీ, బయో ఇన్‌ఫర్మాటిక్స్‌ కోర్సులకు గేట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) కోర్సులో జేఈఈ స్కోర్‌తో అడ్మిషన్‌ ఇస్తారు.
ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.600, ఈడబ్ల్యుఎస్‌ రూ.550, ఓబీసీలకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.275.
(కోర్సుల వారీగా అర్హతలు, సీట్ల వివరాలు తదితరాల కోసం www.eenadupratibha.net చూడవచ్చు.)


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 3, 2020.
పరీక్షలు: జూన్‌ 2 నుంచి 6 వరకు దేశవ్యాప్తంగా 38 కేంద్రాల్లో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: http://www.uohyd.ac.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని