ఇంటర్‌తో ఐఐఎంలో డ్యూయల్‌ డిగ్రీలు!

ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సులో ప్రవేశానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఇండోర్‌ ప్రకటన విడుదలచేసింది.

Published : 05 Mar 2020 01:26 IST

ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సులో ప్రవేశానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఇండోర్‌ ప్రకటన విడుదలచేసింది. ఈ సంస్థ 2011 నుంచి ఈ కోర్సును అందిస్తోంది. ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో ప్రవేశాలు లభిస్తాయి.
సోషల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచ స్థాయి చదువులు అందించి, క్రియాశీలకమైన భావి మేనేజర్లను రూపొందించడానికి ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును ఐఐఎం ఇండోర్‌ ప్రవేశపెట్టింది. ఈ కోర్సులో రెండు భాగాలు ఉంటాయి. మొదటి మూడేళ్లు  ఫౌండేషన్‌, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్‌ విద్యను బోధిస్తారు. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్‌ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, ఆరోగ్యంగా ఉండటంపై శ్రద్ధ  తీసుకుంటారు. చివరి రెండేళ్లూ క్యాట్‌ ద్వారా పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం (పీజీపీ)లో చేరినవారి కరిక్యులమే ఐపీఎంలో చేరినవారికీ ఉంటుంది.
అయిదేళ్ల కోర్సులో ఏడాదికి 3 చొప్పున 15 టర్మ్‌లు ఉంటాయి. రెండేళ్ల కోర్సు అనంతరం సోషల్‌ ఇంటర్న్‌షిప్‌, నాలుగేళ్ల తర్వాత బిజినెస్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాలి. అయిదేళ్ల కోర్సు పూర్తిచేసుకున్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఫౌండేషన్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌), మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) డ్యూయల్‌ డిగ్రీలను ప్రదానం చేస్తారు.  కోర్సు ఫీజు వసతి, ఇతర సౌకర్యాలు కలిపి మొదటి మూడేళ్లు ఏడాదికి రూ.4 లక్షలు. చివరి రెండేళ్లు పీజీపీలో చేరినవారు చెల్లించే ఫీజులను వసూలు చేస్తారు.

సీట్ల సంఖ్య: 150
అర్హత: పదో తరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55శాతం మార్కులు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు, 2018, 2019లో ఇంటర్‌ పూర్తి చేసుకున్న వారే అర్హులు. ఆగస్టు 1, 2000 తర్వాత జన్మించి ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30
దరఖాస్తు ఫీజు: రూ.4,130.ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2,065.
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 30
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.
వెబ్‌సైట్‌:
www.iimidr.ac.in


ఎంపిక  విధానం

ఆప్టిట్యూడ్‌ టెస్టు, రిటన్‌ ఎబిలిటీ టెస్టు, పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో సాధించిన స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను కోర్సులోకి తీసుకుంటారు. అకడమిక్‌ సామర్థ్యాలు, కో-కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ గమనిస్తారు. పరీక్షలో ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి.. ఇందులో అర్హత సాధించినవారికి నిపుణులు, ఐఐఎం ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ముఖాముఖి ఉంటుంది.


ఆప్టిట్యూడ్‌  టెస్టు

ఇందులో క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ ఎబిలిటీల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. బహుళైచ్ఛిక, లఘు సమాధాన (మల్టిపుల్‌ ఛాయిస్‌, షార్ట్‌ ఆన్సర్‌) ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.  తప్పుగా గుర్తించిన జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. లఘు సమాధాన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. పరీక్షలో వంద ప్రశ్నలు వస్తాయి. 2 గంటల్లో పూర్తిచేయాలి. అభ్యర్థులు సెక్షన్లవారీ అర్హత సాధించడం తప్పనిసరి. అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం రిటన్‌ ఎబిలిటీ టెస్టు, పర్సనల్‌ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. వీటిలో అర్హత సాధించినవారినే తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
ఆప్టిట్యూడ్‌ విభాగానికి 50, పర్సనల్‌ ఇంటర్వ్యూ 35, రిటన్‌ ఎబిలిటీ టెస్టు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ వెయిటేజీË ప్రకారం జాబితా రూపొందించి మెరిట్‌, రిజర్వేషన్లను అనుసరించి కోర్సులోకి తీసుకుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని