పౌరసత్వం పొందినవారికీ అవే హక్కులు!

అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరుతో పాఠకుల నుంచి ‘ఈనాడు’ ప్రశ్నలను...

Published : 25 Mar 2020 00:42 IST

అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరుతో పాఠకుల నుంచి ‘ఈనాడు’ ప్రశ్నలను ఆహ్వానించింది. వాటికి హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలను అందించారు.

గ్రీన్‌కార్డు ఉన్న భారతీయ పాస్‌పోర్టుదారుడిని. వ్యక్తిగత కారణాలరీత్యా గడిచిన ఏడాది అక్టోబరులో భారతదేశం వచ్చేముందు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాను. భారతదేశంలో మరింత కాలం ఉండేందుకు అనుమతి కోరవచ్చా? నాకు సమాధానం వచ్చేందుకు ఎంత కాలం పడుతుంది?

- లక్కిరెడ్డి బాలకోటిరెడ్డి

జ: గ్రీన్‌కార్డు అంశాలను హైదారాబాద్‌ కాన్సులేట్‌ పరిశీలించదు. న్యూదిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం cis.ndi@uscis.dhs.gov లేదా http://www.uscis.gov/portal/site/uscis ను సంప్రదించవచ్చు.


హెచ్‌1బి వీసాతో నేను, హెచ్‌4పై నా భార్య అమెరికాలో ఉంటున్నాం. త్వరలో మా కుటుంబంలో చిన్నారి రూపంలో కొత్త వ్యక్తి రానున్నారు. మాకు పౌరసత్వం లభిస్తే ఎన్‌ఆర్‌ఐగా పరిగణిస్తారా? భారతీయ పౌరులుగా పరిగణిస్తారా? భవిష్యత్తులో భారతదేశంలో స్థిరడితే అమెరికాలో చదువుకునేందుకు మా సంతానానికి ప్రాధాన్యం ఉంటుందా?

- వేణుగోపాల అల్లాడ

జ: ఎవరికైనా అమెరికా పౌరసత్వం వస్తే అమెరికా పౌరులకు ఎలాంటి హక్కులు లభిస్తాయో పౌరసత్వం పొందినవారికీ అవే వర్తిస్తాయి. వీసా అవసరం లేకుండా అమెరికాకి రాకపోకలు సాగించటంతోపాటు అమెరికాలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది. అమెరికా పౌరుడు భారతదేశంలో దీర్ఘకాలం ఉండేందుకు సంబంధించిన సమాచారం కోసం https://indianembassyusa.gov.in/pages/MjY చూడండి.


గడిచిన ఏడాది సెప్టెంబరులో నా హెచ్‌1బి వీసా కాలం తీరింది. 2.8 సంవత్సరాలు మాత్రమే ఆ వీసాను వినియోగించుకున్నాను. మరో యాజమాన్యం వద్ద ఉద్యోగ అవకాశం లభించింది. ఏప్రిల్‌లో నిర్వహించే లాటరీ విధానంలో భాగస్వామి కావాలా? నూతన యాజమాన్యం నా కోసం ఎప్పుడైనా వీసా దరఖాస్తు చేయవచ్చా?

- హర్ష పగడాల

జ: హెచ్‌1బి వీసా కోసం దరఖాస్తు చేయాలంటే మీకు ఉద్యోగం ఇచ్చేందుకు, మీ పక్షాన వీసా పిటిషన్‌ దాఖలు చేసేందుకు యాజమాన్యం ఉండాలి. అమెరికా డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఆ పిటిషన్‌ను ఆమోదించాలి. ఆమోదిత పిటిషన్‌తో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్ఛు మరింత సమాచారం కోసం, వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ కోసం www.ustraveldocs.com చూడండి.


మా అమ్మాయి అమెరికాలో మాస్టర్స్‌ చేయాలనుకుంటోంది. ఎఫ్‌-1 వీసా కోసం ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమవుతాయి? ఒకవేళ ఎఫ్‌-1 వీసా కోసం దరఖాస్తు చేయటానికి ముందుగా వివాహమైతే ఎలాంటి ధ్రువపత్రాలు కావాలి?

- డీవీ రమణ

జ: వీసా దరఖాస్తుకు అనుబంధంగా నిర్ధారిత ధ్రువపత్రాలు ఏవి కావాలన్నది ఏమీ లేదు. మీ దరఖాస్తుకు మద్దతుగా ఉంటుందనుకున్న పత్రాలను వెంట తెచ్చుకోవచ్ఛు సంబంధిత వీసా విభాగానికి దరఖాస్తుదారుడు అర్హుడా? కాదా? అన్నది ఇంటర్వ్యూ అధికారి స్థూలంగా చూస్తారు. వీసా కోసం దరఖాస్తు చేసుకోవటం ఎలా? ఇంటర్వ్యూ షెడ్యూల్‌ తదితర సమాచారం కోసం www.ustraveldocs.com పరిశీలించండి. ●


* వీసాలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి.

* మరింత సమాచారానికి హైదరాబాద్‌ లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ https://in.usembassy.gov/embassy-consulates/hyderabad/ చూడవచ్చు.

* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపవచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని