యూజీ.. పీజీలకు ఆన్‌లైన్‌లో పాఠాలు

యూజీ, పీజీ కోర్సులు చేస్తున్న అభ్యర్థులు తమ నైపుణ్యాలను మరింత పెంచుకునే అవకాశం వచ్చింది. నడుస్తున్న సెమిస్టర్‌కి సంబంధించి ప్రఖ్యాత సంస్థల ప్రొఫెసర్లు బోధించిన పాఠాలను ‘స్వయం’ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆసక్తి ఉన్న వారు వాటిని ఉపయోగించుకోవచ్చు.

Updated : 24 Nov 2022 15:04 IST

జులై-2020 సెమిస్టర్‌ పాఠాలకు నమోదు ప్రక్రియ ప్రారంభం

యూజీ, పీజీ కోర్సులు చేస్తున్న అభ్యర్థులు తమ నైపుణ్యాలను మరింత పెంచుకునే అవకాశం వచ్చింది. నడుస్తున్న సెమిస్టర్‌కి సంబంధించి ప్రఖ్యాత సంస్థల ప్రొఫెసర్లు బోధించిన పాఠాలను ‘స్వయం’ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆసక్తి ఉన్న వారు వాటిని ఉపయోగించుకోవచ్చు.
ఉచితంగా ఆన్‌లైన్‌లో వీడియో పాఠాలను అందించడానికి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘స్వయం’ పోర్టల్‌ను రూపొందించారు. దీని ద్వారా యూజీ, పీజీ విద్యార్థులకు జనవరి, జులై సెషన్లలో వివిధ కోర్సులను అందించనున్నారు. అభ్యర్థులు ఆసక్తుల ప్రకారం కావాల్సిన కోర్సుకు పేరు నమోదు చేసుకోవచ్చు. తాజాగా జులై సెషన్‌లో మొదలయ్యే తరగతులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
స్వయం పోర్టల్‌ ద్వారా 82 యూజీ, 42 పీజీ కోర్సుల కోసం జులై సెమిస్టర్‌కి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. తాము చదువుతోన్న కోర్సుల్లో రాణించడానికి ఈ వీడియో పాఠాలు ఉపయోగపడతాయి. విద్యార్హతలతో సంబంధం లేకుండా వీటిని ఎవరైనా నేర్చుకోవచ్చు. వీడియో పాఠాలు జులైలో మొదలై అక్టోబరు 31 వరకు కొనసాగుతాయి. వీటిని ఉచితంగా అందిస్తారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు పాఠాలను బోధిస్తారు. ఆ పాఠ్యాంశాలన్నీ ఆ సమయంలో చదువుతోన్న సెమిస్టర్‌కు ఉపయోగపడే విధంగా ఉంటాయి. మిగిలిన వాటిని తర్వాత సెషన్‌లో నేర్పిస్తారు. వీడియో పాఠాలతో పాటు మెటీరియల్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం లేదా ప్రింట్‌ తీసుకోవడం, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టెస్టులు, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆన్‌లైన్‌ డిస్కషన్‌ మొదలైనవి ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు కోర్సు చివరలో పరీక్ష రాసుకోవచ్చు. వీటిని రాయాలనుకున్నవారు కోర్సు మధ్యలో నిర్దేశించిన అసైన్‌మెంట్లను పూర్తిచేయడం తప్పనిసరి. పరీక్ష కోసం రూ.వెయ్యి ఫీజు చెల్లించాలి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో పరీక్షలు నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహిస్తారు. ఉత్తీర్ణత సాధించినవారికి ఎలక్ట్రానిక్‌ సర్టిఫికెట్‌ ప్రధానం చేస్తారు. పరీక్షలో అర్హత సాధించినవారికి తీసుకున్న కోర్సును బట్టి 3 లేదా 4 అకడమిక్‌ క్రెడిట్లు సొంతమవుతాయి.

కోర్సుల వివరాలు
పీజీ: ఈ విభాగంలో అందిస్తున్న కోర్సులు ఎంఏ, ఎమ్మెస్సీ చదువుతున్న వారికి ఉపయోగపడతాయి. ఎల్‌ఎల్‌ఎం, బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, ఎంఎడ్‌, ఎంకామ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్‌, జియాలజీ, మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ప్లానింగ్‌, హ్యూమన్‌ రైట్స్‌ కోర్సులు ఉన్నాయి. మల్టీ డిసిప్లినరీ విభాగంలో అకడమిక్‌ రైటింగ్‌, ఫుడ్‌ మైక్రో బయాలజీ అండ్‌ ఫుడ్‌ సేప్టీ, ఆపరేషన్స్‌ రిసెర్చ్‌, రిసెర్చ్‌ ఎథిక్స్‌, రిసెర్చ్‌ మెథడాలజీ తదితర కోర్సులను అందిస్తున్నారు.
యూజీ: ఈ విభాగంలో అందిస్తున్న పాఠాలు బీఏ, బీకామ్‌, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ, బీబీఎం, ఏజీ బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, బీఎడ్‌, బీపీఎడ్‌ మొదలైన కోర్సులు చదువుతున్న వారికి ఉపయోగపడతాయి. ఎకనామిక్స్‌, ఫార్మసీ, మాస్‌ కమ్యూనికేషన్‌, హోం సైన్స్‌, లా, ఫారిన్‌ లాంగ్వేజ్‌లు, హిస్టరీ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌, పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, మైక్రో బయాలజీ, టూరిజం, జాగ్రఫీ, ఫుడ్‌ టెక్నాలజీ, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, సంస్కృతం, బయోటెక్నాలజీ, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, బయో కెమిస్ట్రీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, అగ్రికల్చర్‌, మ్యాథ్స్‌, మ్యూజిక్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, జియాలజీ తదితర సబ్జెక్టుల నుంచి పలు పాఠ్య విభాగాలను అందిస్తున్నారు.
యూజీ, పీజీ విద్యార్థుల కోసమే కాకుండా ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడానికి పలు కోర్సులు స్వయంలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.

వెబ్‌సైట్‌:
https:///swayam.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని