కృత్రిమ మేధలో అవకాశాల జోరు! 

కరోనా సంక్షోభం తర్వాత పుంజుకున్న తొలి రంగంగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ప్రత్యేకత చూపింది.

Updated : 02 Mar 2021 13:54 IST

కరోనా సంక్షోభం తర్వాత పుంజుకున్న తొలి రంగంగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ప్రత్యేకత చూపింది. ఐటీలో ఉద్యోగ నియామకాలు గణనీయంగా పెరుగుతాయని ఇటీవల నాస్‌కామ్‌ అంచనా వేసింది. మరింతగా రాణించనున్నాయని భావిస్తున్న సాంకేతికతల్లో ఒకటైన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌- ఏఐ) విశిష్టతలూ, దాన్ని నేర్చుకునే వనరుల గురించి తెలుసుకుందాం! 

స్మార్ట్‌ హోమ్స్, స్మార్ట్‌ సిటీస్‌ అని మనం తరచు వింటూ ఉంటాం కదా? అవన్నీ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీల అనువర్తనాలు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌/మెషిన్‌ లెర్నింగ్‌ , సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చైన్, ఐఓటీ, వర్చువల్‌ రియాలిటీ/ఆగ్మెంటేడ్‌ రియాలిటీ, డేటా సైన్స్, ఫుల్‌ స్టాక్‌ వంటి వాటిని 4.0 టెక్నాలజీలు అంటారు. 

‘కృత్రిమ మేధ (ఏఐ) అనేది విద్యుత్తు, నిప్పు కంటే కూడా చాలా ముఖ్యమైనది’ అన్నారు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌. ఇంత ముఖ్యమైన టెక్నాలజీ ఉపయోగాలేమిటి? మన మొబైల్‌ ఫోన్‌లో ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ ఉంటే దాన్ని చూడగానే అన్‌ లాక్‌ అవుతుంది. అదే మరొకరి ముఖం అయితే అన్‌లాక్‌ అవ్వదు. ఇది దేనివల్ల అవుతుంది అనుకుంటున్నారు? కృత్రిమ మేధతోనే! 

తరచూ వినే సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్స్, ఆటో పైలెట్‌ వంటి వాటిలో, మనం తరచూ మాట్లాడే అమెజాన్‌ అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌ లాంటి స్మార్ట్‌ డివైసెస్‌లో కూడా మనం ఉపయోగించేది ఏఐనే! ఇదంతా ఆరంభం మాత్రమే. ఏఐతో ఇంకా చాలా రాబోతున్నాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, బ్యాంకింగ్‌... ఇంకా చాలా రంగాల్లో ఏఐని ఉపయోగించబోతున్నారు.
ఇన్ని రంగాల్లో దీన్ని ఉపయోగం ఉంది అంటే ఇది సాధారణమైన టెక్నాలజీ కాదు కదా! మెకిన్సే నివేదిక ప్రకారం ఏటా 13 ట్రిలియన్‌ డాలర్లు- అంటే అక్షరాలా 95,67,53,20,00,00,000 రూపాయిలను 2030కి సృష్టించనుంది. ఇందువల్లే కృత్రిమ మేధలో చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి.  

నమూనాలను గమనించి...
మనుషులుగా మనకున్న ఓ ముఖ్యమైన నైపుణ్యం- గమనించడం. అలా ఒక దాన్ని గమనించి దానిలో నమూనాలను (పాటర్న్స్‌) గుర్తిస్తాం. చూడడం, వినడం, తాకడం ద్వారా మనం నమూనాలను గుర్తించినట్టే ఒక యంత్రం చేస్తే అదే కృత్రిమ మేధ. మనం వినీ, చూసీ మెదడులో ప్రాసెస్‌ చేసి నమూనాలను ఎలా గుర్తిస్తామో, అదే విధంగా యంత్రానికి కావాల్సిన ఇటువంటి డేటాను ఇన్‌ఫుట్‌గా ఇస్తాం. ఆ లోడ్‌ చేసిన డేటాలో నమూనాలను గమనించడానికి సాఫ్ట్‌వేర్‌ తయారుచేసి ఇస్తాం. వీటినే మనం ఇంటలిజెంట్‌ మెషిన్స్‌ అంటాం. ఇలాంటి యంత్రాలను తయారు చేయడమే ఏఐ. 

కృత్రిమ మేధ నిన్నా మొన్నా వచ్చిందేమీ కాదు. 1950లలోనే దీని గురించి పరిశోధన మొదలయింది. కానీ ప్రపంచానికి ఈ ఇంటలిజెంట్‌ మెషిన్స్‌ గొప్పతనం తెలిసింది మాత్రం 1997లో. అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఉబర్, టెస్లా  లాంటి వాణిజ్య సంస్థలు ఏఐని ఉపయోగించి తమ సంస్థలను అభివృద్ధి చేసుకోడమే కాకుండా వినియోగదారులకు సౌలభ్యకరమైన చక్కని అనుభవాన్ని ఇవ్వగలుగుతున్నాయి. 
ఉదాహరణకు మనం నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సినిమా చూస్తే అందులో ఉపయోగించే ఏఐ సాఫ్ట్‌వేర్‌ మన ఇష్టాన్ని ప్రతిబింబించే నమూనాలను గమనిస్తుంది; అలాంటి సినిమాలనే మనకు సూచిస్తుంది. ఇటీవల కాలంలో ప్రభంజనం సృష్టిస్తున్న టెస్లా కారులోని ఆటో పైలెట్‌లో కూడా ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నారు. 

రెండు రకాలు
కృత్రిమ మేధ రెండు రకాలు. ఆర్టిఫిషియల్‌ నారో ఇంటలిజెన్స్‌ (తివిఖి), ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటలిజెన్స్‌ (తిబిఖి). ఏఎన్‌ఐ ఒక పనిని మాత్రమే చేయగలుగుతుంది. ఒక చదరంగం ఆడే సాఫ్ట్‌వేర్‌ ఆ ఆట మాత్రమే ఆడగలదు, ఎంత బాగా ఆడుతుందంటే ఒక చెస్‌ వరల్డ్‌ ఛాంపియ న్‌ని సైతం ఓడించగలదు. కానీ వేరే ఏ పనీ చేయలేదు. 

అదే ఏజీఐ అయితే.. మనిషి ఏం చేయగలడో అన్ని పనులూ చేయగలదు. ‘రోబో’ సినిమాలో చిట్టి గుర్తుండేవుంటుంది. అది ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటలిజెన్స్‌ మీదనే పనిచేస్తుంది. కానీ గత 10-15 సంవత్సరాల వరకూ ఏఐలో జరిగిన పురోగతి అంతా ఆర్టిఫిషియల్‌ నారో ఇంటలిజెన్స్‌లోనే జరిగింది. చాలా తక్కువ శాతం మాత్రమే ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటలిజెన్స్‌ వైపు జరిగింది.
శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం ఈ ఏజీఐలో అప్లికేషన్స్, సిస్టమ్స్‌ కనీసం 20- 25 సంవత్సరాల వరకూ తయారుచేయలేం. ఎందుకంటే- దానికి ఇంకా చాలా పురోగతి సాధించాల్సి ఉంటుంది. 

విద్యార్థులు ఏం చేయాలి? 
భారీ ఉద్యోగావకాశాలున్న కృత్రిమ మేధలో విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. కృత్రిమ మేధను ప్రాక్టికల్‌గా నేర్చుకుని అప్లికేషన్స్, ప్రాజెక్ట్స్‌ చెయ్యాలంటే హైస్కూల్‌ గణితం, ప్రోగ్రామింగ్‌లోని ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) నేర్చుకుని ఉండాలి. కానీ ఇదంతా మనం నేర్చుకునే వనరులను బట్టి కూడా ఉంటుంది. యూట్యూబ్, యుడెమి, కోర్స్‌ ఎరా లాంటి వాటిలో ఏఐని నేర్చుకోవచ్చు. అలాగే ఐబీ హబ్స్, నెక్స్‌ట్‌ వేవ్‌ సీసీబీపీ ప్రోగ్రాముల ద్వారా ఏఐ లాంటి 4.0 టెక్నాలజీల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి. వివరాల కోసం https://www.ccbp.in/ని చూడొచ్చు. 
- త్రివిక్రమ, సీఈఓ, ప్రోయుగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీస్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని