ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం

ఇంటర్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల్లు అయ్యే అవకాశం వచ్చింది. ఇందుకోసం ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌...

Published : 25 Feb 2021 09:22 IST

ఇంటర్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల్లు అయ్యే అవకాశం వచ్చింది. ఇందుకోసం ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌... టెక్‌బీ అర్లీ కెరియర్‌ ప్రోగ్రాం ప్రకటన వెలువరించింది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలతో ఎంపికలు ఉంటాయి. ఏడాది శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని హెచ్‌సీఎల్‌లో ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఈ విధానంలో చేరినవారు ఉద్యోగం చేస్తూ ప్రసిద్ధ సంస్థల నుంచి డిగ్రీ కోర్సులనూ చదువుకోవచ్చు.  

ఐటీ సంస్థల్లోని ఉద్యోగాలకు ఎక్కువ మంది యువత ప్రాధాన్యమిస్తారు. ఇంటర్మీడియట్‌ అర్హతతోనే హెచ్‌సీఎల్‌ టెక్‌బీతో ఈ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు. పూర్తి స్థాయిలో శిక్షణ పొంది, విధులు నిర్వర్తిస్తూనే డిగ్రీ కోర్సు పూర్తిచేసుకునే అవకాశం ఉండడం ఈ ప్రోగ్రాం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 

ఈ విధానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందుగా హెచ్‌సీఎల్‌ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం వీరికి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్, లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ ఎబిలిటీస్‌ విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. నిర్దేశిత స్కోర్‌ సాధించినవారికి ముఖాముఖి జరుపుతారు. ఇక్కడా మెరిస్తే ఏడాది శిక్షణ నిమిత్తం ఐటీ సర్వీసెస్, అసోసియేట్‌ విభాగాల్లోకి తీసుకుంటారు. ఈ శిక్షణ హైదరాబాద్, విజయవాడ, చెన్నై, మధురై, నాగ్‌పూర్, నోయిడా, లఖ్‌నవూల్లో అందిస్తున్నారు. ముందుగా ఫౌండేషన్‌లో భాగంగా ఐటీకి సంబంధించిన ప్రాథమికాంశాల్లో శిక్షణ ఉంటుంది. అనంతరం సాంకేతికాంశాల్లో తర్ఫీదునిస్తారు. 

దీని తర్వాత వృత్తి పరమైన శిక్షణ (ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌)ను హెచ్‌సీఎల్‌ సంస్థల్లో అందిస్తారు. శిక్షణలో ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్లు, అసైన్‌మెంట్లు, కేస్‌ బేస్డ్‌ సబ్మిషన్లు ఉంటాయి. సుమారు 6 నుంచి 9 నెలలు తరగతి గది శిక్షణ, 3 నుంచి 6 నెలలు ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌ నిర్వహిస్తారు.

శిక్షణ సమయంలో స్టైపెండ్‌ 
వీరికి శిక్షణ సమయంలో అంటే ఏడాది మొత్తం ప్రతి నెలా రూ.10 వేలు స్టైపెండ్‌ చెల్లిస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని హెచ్‌సీఎల్‌లో ఫుట్‌ టైం ఉద్యోగిగా విధుల్లోకి తీసుకుంటారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, టెస్టింగ్‌/ డిజైన్‌ ఇంజినీర్‌/ డిజిటల్‌ ప్రాసెస్‌ ఆపరేషన్స్‌.. తదితర సేవలను వీరు ప్రాథమిక స్థాయి (ఎంట్రీ లెవెల్‌)లో దేశంలో ఏదైనా హెచ్‌సీఎల్‌ కేంద్రంలో అందిస్తారు. ఐటీ సర్వీస్‌ ఉద్యోగాలకు రూ.2 లక్షల నుంచి 2.2 లక్షల వరకు వార్షిక వేతనం అందుతుంది. అసోసియేట్లకు రూ.1.7 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తారు. 

అయితే శిక్షణ నిమిత్తం అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ సర్వీసెస్‌ శిక్షణకు ఎంపికైనవారు రూ.2 లక్షలు+ పన్నులు చెల్లించాలి. అసోసియేట్‌ విభాగానికి రూ.లక్ష+పన్నులు కట్టాలి. బ్యాంకు నుంచి రుణం పొందేందుకు వీలుంది. శిక్షణలో ప్రతిభ చూపినవారు ఫీజు మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. 90 శాతం కంటే ఎక్కువ స్కోరు సాధిస్తే వంద శాతం ఫీజు, 85 నుంచి 90 శాతం స్కోరు పొందితే 50 శాతం ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. శిక్షణలో చేరిన విద్యార్థులు ఎలాంటి ఆటంకం లేకుండా యూజీ విద్య కొనసాగించుకోవచ్చు. శస్త్ర డీమ్డ్‌ యూనివర్సిటీ తంజావూరు అందించే బీసీఏ, ఎంసీఏ కోర్సులు చదువుకోవచ్చు. లేదా బిట్స్‌ పిలానీ బీఎస్‌సీ (డిజైన్‌ అండ్‌ కంప్యూటింగ్‌), ఎమ్మెస్సీ, ఎంటెక్‌ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు.

ప్రోగ్రాం వ్యవధి: 12 నెలలు స్టైపెండ్‌: రూ.10,000
అర్హత: ఐటీ సర్వీస్‌ విభాగానికి ఇంటర్‌లో 75 శాతం మార్కులు ఉండాలి. అసోసియేట్‌ కోసమైతే 65 శాతం సరిపోతాయి. ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివివుండాలి. 2019, 2020లో ఇంటర్‌ ఉత్తీర్ణులు, 2021లో పూర్తిచేసుకోబోతున్నవారు మాత్రమే అర్హులు. 

వెబ్‌సైట్‌: www.hcltechbee.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు