చందన రూపుడు.. సింహాచలేశుడు

దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800

Updated : 25 Mar 2023 17:12 IST

దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800 అడుగుల(244మీ)ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు.  విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజు నిర్వహిస్తారు.

ఆలయ చరిత్ర-స్థల పురాణం

స్వయంభూవైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి ఇక్కడ 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఆలయంలో పలు చారిత్రక సందర్భాల్లో వేసిన శిలా శాసనాలు చారిత్రక పరిశోధకులను ఆకర్షిస్తాయి. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హరి ద్వేషంతో.. భక్తులను హింసించిన హిరణ్యకశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా.. స్వామి ఇక్కడ వరాహ నృసింహ స్వామిగా స్వయం వ్యక్తమయ్యారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజూ నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామి వారి సన్నిధిలో పారాయణ చేస్తారు. 

ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చేది.. ఈ చందన అవతారంలో ఉండే స్వామి వారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే.. అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామి వారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచలం ఆలయం ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షల మంది భక్తులతో మరింత రద్దీగా మారుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్జిత సేవలు ఉంటాయి. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకొని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేది భక్తుల విశ్వాసం.

శ్రీనారసింహుడి అవతార విశిష్టత ఇది

భగవంతుడు సర్వాంతర్యామి, జగత్తంతా నిండి, నిబిడీకృతమై ఉన్నాడని చాటి చెప్పడమే శ్రీ నరసింహావతార ఉద్దేశం. తన పుత్రుడి నోట శత్రువు మాట విన్న హిరణ్య కశిపుడికి క్రోధం నిలువెల్లా పామువిషమై కమ్ముకోగా, తన గదను విసురుగా ఎత్తి, స్తంభానికి బలంగా తాటించాడు. స్తంభంలో నుంచి ఆవిర్భవించిన శ్రీ నృసింహుడు భీకరంగా హిరణ్య కశిపుని ఒడిసిపట్టి, తన ఒడిలో పెట్టుకొని, వజ్రాల్లాంటి గోళ్లతో చీల్చి చెండాడాడు. ఆ సమయంలో స్వామి ముఖం పరమ భీకరంగా ఉంది. రక్తాన్ని పులుముకొన్న గోళ్లు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని పోలి ఉన్నాయి. హిరణ్యకశిపుడి కడుపు నుంచి వేరుచేసిన పేగులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. ఆ ఉగ్రమూర్తి నిట్టూర్పులు పెనుగాలుల్లా వీచాయి. జూలు నుంచి రక్తం ధారలు కడుతోందని పురాణ వచనం. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు. పలువిధాల స్తుతించాడు. స్వామి ప్రసన్నుడై శాంతించాడు.

ఎన్నో ఆలయాలు..

దుష్టశిక్షణ, శిష్టరక్షణ నిమిత్తం దశావతారాల్లో నాలుగోదైన నరసింహుడికి ఎన్నో ఆలయాలున్నాయి. కదిరిలోని నరసింహస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. హిరణ్య కశిపుణ్ని సంహరించాక ఈ ప్రాంతానికే నరసింహస్వామి వచ్చాడని, అలా ఆగ్రహావేశాలతో వచ్చిన స్వామి, ఇక్కడ అడవిలో క్రూరజంతువులను వేటాడాడని, అందుకే ఆయనను వేటరాయుడు అంటారని చెబుతారు. వేటరాయుడు కాస్తా జనవ్యవహారంలో బేట్రాయుడు అయింది.

అహోబిలంలో స్వామి స్వయంభువు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడంవల్ల అహోబిలాన్ని అహోబలం అనీ అంటారు. అహోబిలానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్‌ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద్ద అహోబిలం, భార్గవ తీర్థం, నవ నారసింహ క్షేత్రం అనే పేర్లున్నాయని పురాణాలు చెబుతున్నాయి. జ్వాలా, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నారసింహులు ఇక్కడి నరసింహస్వామి వారి తొమ్మిది మూర్తులు.

నవ నరసింహ వ్యూహాలు

ఉగ్ర నారసింహుడు, కృద్ధ నారసింహుడు, వీర నారసింహుడు, విలంబ నారసింహుడు, కోప నారసింహుడు, యోగ నారసింహుడు, అఘోర నారసింహుడు, సుదర్శన నారసింహుడు, శ్రీలక్ష్మీ నారసింహుడు- నవ నరసింహ వ్యూహాలు. సింహాచలంలో భక్తులు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. అక్కడ సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి విగ్రహం చందనంతో కప్పి ఉంటుంది. నిజరూప దర్శనాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అంటారు.

కృష్ణానదీ తీరంలోని మంగళగిరి, స్నానాలయ్య, అన్నాలయ్య, దీపాలయ్య, వజ్రాలయ్యలనే అయిదు క్షేత్రాలను పంచ నారసింహ క్షేత్రాలంటారు. మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. అవి-కొండ కింద శ్రీలక్ష్మీనరసింహస్వామి, కొండపైన పానకాల స్వామి, గిరి శిఖరంపై గండాల నరసింహస్వామి ఆలయాలు. శ్రీ లక్ష్మి ఈ కొండపై తపస్సు చేసినందువల్ల ఇది మంగళగిరి అయింది. లక్ష్మీదేవి ఇక్కడే స్వామికి అమృతం సమర్పించి కోపాన్ని తగ్గించిందట.

యాదగిరి గుట్టలో యాదర్షి తపస్సుకు మెచ్చి జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు, గండభేరుండ నరసింహుడు, ఉగ్రనరసింహుడు, లక్ష్మీ నరసింహ రూపాల్లో భక్తుల పూజలు అందుకొంటున్నాడు. నరసింహ కరావలంబం చదివి శరణు వేడితే కష్టాలు మన దరికి చేరవంటారు. ఆలాగే రుణ విమోచన నారసింహ స్తోత్రం చదివితే అప్పుల బాధలు సమసిపోతాయంటారు.

నరసింహుడు ఉగ్రరూపుడైనా, భక్తుల మనోభీష్టాలు నెరవేర్చడంలో కరుణాసముద్రుడు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని