మూడు తెగల సోదరులు

మనమంతా అపురూపంగా భావించే రామాయణంలో మూడు తెగల సోదరులు కనిపిస్తారు. శ్రీరామ సోదరులది ఆదర్శ అనుబంధం.

Published : 09 Mar 2023 00:15 IST

నమంతా అపురూపంగా భావించే రామాయణంలో మూడు తెగల సోదరులు కనిపిస్తారు. శ్రీరామ సోదరులది ఆదర్శ అనుబంధం. తండ్రి ఆనతి మేరకు రాముడు అడవులకెళ్లాడు. తోడుగా లక్ష్మణుడు వస్తానంటే తల్లిదండ్రుల సేవచేస్తూ భరతుడికి రాజ్యపాలనలో సహకరించమన్నాడు. కానీ తానూ వెంట వెళ్లి అన్నావదినలను తల్లిదండ్రుల కంటే మిన్నగా ఆరాధించాడు సౌమిత్రి.

అడవిలో సీతాపహరణం జరిగింది. ఆమె వదిలేసిన ఆభరణాలను హనుమంతుడు చూపించబోతే రాముడు వాటిని చూడలేక తమ్ముణ్ణి చూడమన్నాడు. లక్ష్మణుడు కాలి అందెలను మాత్రమే గుర్తించాడు. నిత్యం సీతమ్మకు పాదాభివందనం చేస్తాడు కనుక అవి మాత్రమే సుపరిచితం. రామ, భరతుల అనుబంధమూ స్ఫూర్తిదాయకమే. ఒకసారి భరతుడి విషయంలో లక్ష్మణుడు ఆవేశపడగా భరతుడి మంచితనాన్ని గుర్తుచేసి నచ్చజెప్పాడు. అది అపార సోదరప్రేమ. రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత హనుమను ఆలింగనం చేసుకుని ‘హనుమా! నా హృదయంలో భరతుడికి ఏ స్థానం ఉందో నీకూ అదే స్థానం ఉంది’ అన్నాడు రాముడు. దీన్ని బట్టి రాముడు లక్ష్మణుడి కంటే భరతుణ్ణే ఎక్కువగా ప్రేమించాడని అర్థమౌతుంది. రామపాదుకలకు పట్టాభిషేకం చేసి వాటినే రాజుగా భావించి పాలన సాగించాడు భరతుడు. కలలో కూడా తాను రాజునని భావించలేదు. వాళ్లది ఆదర్శ భ్రాతృప్రేమ.
వాలి సుగ్రీవులు దీనికి భిన్నమైన సోదరులు. సుగ్రీవుడి భార్యను అపహరించాడు వాలి. ఒకరినొకరు చంపుకోవాలన్నంత సోదరద్వేషం వీరిది.
రావణ, విభీషణ, కుంభకర్ణులది  శ్రేయోదాయక ప్రేమ. విభీషణుడు రావణుడి శ్రేయస్సు కోరి సీతను రాముడికి అప్పజెప్పమన్నాడు. అది రుచించక రాజ్యబహిష్కరణ చేశాడు. ధర్మరక్షణకై రావణుడి మరణ రహస్యం రాముడికి వెల్లడించాడు విభీషణుడు. రావణ సంహారం జరిగింది. ఇలా మూడు తెగల అన్నదమ్ముల అనుబంధాలను రామాయణంలో చూడవచ్చు.

బాలకౌసల్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని