చందురుని మించు అందమొలికించు...

శ్రీరాముడు... ప్రజారంజకమైన పాలనతో ప్రజలకు ఆనందాన్ని పంచిన ప్రభువు. చంద్రుడు... తన పండు వెన్నెల చల్లదనంతో ప్రజలకు మానసిక ఆహ్లాదాన్ని పంచే ప్రభువు. శ్రీరాముడు... షోడశ గుణ పూర్ణుడు. సకల సద్గుణాలను తనలో ఇముడ్చుకున్నవాడు చంద్రుడు... షోడశ కళాపూర్ణుడు. సకల కళలను తనలో ఇముడ్చుకున్నవాడు.....

Updated : 17 May 2022 10:47 IST

నేడు ఒంటిమిట్టలో కల్యాణం

శ్రీరాముడు... ప్రజారంజకమైన పాలనతో ప్రజలకు ఆనందాన్ని పంచిన ప్రభువు.
చంద్రుడు... తన పండు వెన్నెల చల్లదనంతో ప్రజలకు మానసిక ఆహ్లాదాన్ని పంచే ప్రభువు.
శ్రీరాముడు... షోడశ గుణ పూర్ణుడు. సకల సద్గుణాలను తనలో ఇముడ్చుకున్నవాడు
చంద్రుడు... షోడశ కళాపూర్ణుడు. సకల కళలను తనలో ఇముడ్చుకున్నవాడు.
యుగాలు గడిచినా, తరాలు మారినా వీరిద్దరి లక్షణాల్లో మార్పులేదు. ఇద్దరూ అందరికీ మంచిని పంచారు. అందుకే...
శ్రీరాముడు చంద్రుడయ్యాడు! శ్రీరామచంద్రమూర్తిగా పేరొందాడు. భారతీయుల ఆరాధ్యదైవమై వర్థిల్లుతున్నాడు.
ఇన్ని గుణాలు ఇద్దరిలోనూ ఉన్నాయి కాబట్టే వాల్మీకి మహర్షి రామాయణంలో శ్రీరాముడిని చంద్రుడితో పోల్చాడు, ‘చంద్రవత్‌ ప్రియదదర్శనః..’‘చంద్రకాంతననమ్‌ రామమ్‌ అతీవ ప్రియ దర్శనమ్‌’’ అనే రామాయణంలోని శ్లోకాలు అందుకు నిదర్శనం. అంతేకాదు వాగ్గేయకారుడైన త్యాగరాజస్వామి వారు కూడా ‘రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీరామ రామ రాజేశ్వర.. ’ అని శ్రీరాముడిని చంద్రుడిగా కీర్తించారు.
ఇలా శ్రీరాముడికి చంద్రుడికి విడదీయరాని బంధం! అందుకే ఒంటిమిట్ట శ్రీకోదండరాముడు చంద్రుడు ఆకాశంలో వెన్నెల కురిపిస్తుండగా కల్యాణం జరిపించుకుంటాడు.
వాస్తవానికి త్రేతాయుగంలో సీతారాముల కల్యాణం సౌమ్యనామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఉత్తర ఫల్గుణీ నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో జరిగింది. అయితే ‘యస్యావతార సమయే తస్య కల్యాణమాచరేత్‌ ’ అంటే ఏ దేవుడి అవతారం ఏ రోజు వస్తుందో ఆ రోజు దేవుడి కల్యాణం జరిపించాలనే పాంచరాత్ర దివ్యాగమమం చెబుతోంది. అందుకే శ్రీరామనవమి రోజు అభిజిత్‌ లగ్నంలో మధ్యాహ్నం శ్రీరామక్షేత్రాలు, ఆలయాల్లో కల్యాణాన్ని నిర్వహిస్తుంటారు. అయితే అందుకు విరుద్ధంగా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో మాత్రం కల్యాణాన్ని ఛైత్రమాసం శుక్లపక్ష చతుర్దశి అంటే పౌర్ణమికి ముందురోజు పండువెన్నెల్లో నిర్వహిస్తుంటారు.


ఒంటిమిట్టలో ఈ ఆచారం పోతన కాలం నుంచి జరుగుతోందని పండితుల అభిప్రాయం. ‘పోతన ఒంటిమిట్ట రాముణ్ణి కీర్తించి ఇక్కడే భాగవతం రచించినట్లు చెబుతారు.
పోతన ‘మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిదచెంగట నుండ నొప్పువాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున జిరునవ్వు
మొలచువాడు...’ అని రాముణ్ణి కీర్తించాడు.
ఆలయాన్ని జీర్ణోద్ధరణగావించి, ఆంధ్ర వాల్మీకిగా పేరొందిన వావిలికొలను సుబ్బారావు (1836 - 1936) ఇదే ఆచారాన్ని కొనసాగించి పటిష్ఠంచేశారు.

- ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖర్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని