ఈ గీత ఈ రోజే!

రణసీమలో గీతను బోధించిన పరమాత్మ చివరకు ‘కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ! త్వయైకాగ్రేణ చేతసా / కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనుంజయ!’...  చెప్పినదంతా జాగ్రత్తగా విన్నావా? అజ్ఞానం వల్ల ఏర్పడ్డ భ్రమ తొలగిందా? అని అర్జునుడిని అడిగాడు.  ఫలానా పని చెయ్యమని గానీ, వద్దని గానీ చెప్పలేదు కృష్ణ పరమాత్మ. ఏది మంచో, ఏది చెడో విడమరిచి చెప్పాడంతే.

Published : 05 Dec 2019 01:56 IST

శనివారం గీతా జయంతి

రణసీమలో గీతను బోధించిన పరమాత్మ చివరకు ‘కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ! త్వయైకాగ్రేణ చేతసా / కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనుంజయ!’...  చెప్పినదంతా జాగ్రత్తగా విన్నావా? అజ్ఞానం వల్ల ఏర్పడ్డ భ్రమ తొలగిందా? అని అర్జునుడిని అడిగాడు.  ఫలానా పని చెయ్యమని గానీ, వద్దని గానీ చెప్పలేదు కృష్ణ పరమాత్మ. ఏది మంచో, ఏది చెడో విడమరిచి చెప్పాడంతే.

‘చెప్పాల్సిందంతా చెప్పాను... ఇక నీ ఇష్టం’ అన్నాడు. ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగితే మనిషి మహనీయుడవుతాడు. జ్ఞానం... సాధనతోనే సాకారమవుతుంది. భగవానుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని, ఆదేశాలుగా భావించి పాటిస్తే జీవితం ధన్యమవుతుంది. దానికోసం మరో ముహూర్తమెందుకు?ఈ రోజే మొదలుపెడితే సరి..

ఆదిశంకరాచార్యులు తన భజగోవిందంలో ‘గేయం గీతా నామ సహస్రం’; ’భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా...’

గీతా శ్లోకం ఒక్కటి పారాయణ చేసినా గంగా జలాన్ని తాగినంత పుణ్యం వస్తుందంటూ కొనియాడారు.

‘యే యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహమ్‌’ (కర్మ సన్యాసయోగం).

ఎవరు ఏ దృష్టికోణంతో చూస్తారో వారికి అలాగే కనిపిస్తానంటాడు పరమాత్మ. జరుగుతున్న సంఘటనలపై నీ దృష్టికోణం మార్చుకోమంటుంది భగవద్గీత. జరిగిన సంఘటన నేరుగా ఏ ఫలితాన్నీ ఇవ్వదు. నీ మనసు చేసే మాయాజాలమే ఆనందం, విచారాలు. అందుకే జరిగినదాన్ని ఓ పాఠంగా భావించు. మంచి మాత్రమే స్వీకరించు.


‘ఆశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే/ గతాసూనగతాంసూశ్చ నాను శోచంతి పండితాః’ (సాంఖ్యయోగం)

అనవసరమైన ఆలోచనలు మన బుద్ధిలో వేగాన్ని మందగింపజేస్తాయి. సరైన ఆలోచనల్ని అడ్డుకుంటాయి. గతాన్ని తలచుకుంటూ బాధపడటం మానేసేి భవిష్యత్తులో సాధించాల్సిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకో.


‘ధూమేనావ్రియతో వహ్ని ర్యథాదర్శోమలేన చ’ (కర్మయోగం)

అద్దం మురికి పడితే తన ప్రకాశాన్ని కోల్పోతుంది. మన మనసు కూడా అలాంటిదే. ఆకర్షణలనే మాయ పొరలు మనసును కమ్మితే ఇక చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేస్తాం. ఏది మంచో ఏది చెడో విచక్షణతో ఆలోచించాలి. లేదంటే కోల్పోయేది బుద్ధి మాత్రమే కాదు.. భవిష్యత్తు కూడా.


‘అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ’ (భక్తియోగం)

సమస్త ప్రాణులపై ద్వేషం లేకుండా ప్రవర్తించాలని గీత బోధిస్తుంది. సమాజం నుంచి తాను ఏం కావాలని కోరుకుంటాడో సమాజానికి తాను కూడా దాన్ని అందించాలి. ప్రకృతికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఓర్పు, దయ, శాంతి, సహనం, క్షమతోనే అద్భుతమైన జీవితం సాధ్యమవుతుంది.


‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌... స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే’ (శ్రద్ధాత్రయ విభాగయోగం)

ఇతరులకు బాధ కలిగించకుండా వారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేలా మాత్రమే మాట్లాడాలి. ఇది కూడా తపస్సే అవుతుంది. ఎప్పుడైతే పరుషమైన పదం మన నోటి నుంచి రాదో అప్పుడు మనల్ని ద్వేషించేవారెవ్వరూ ఉండరు. అంతిమంగా మనకు ఏవిధమైన అశాంతి కలగదు.


‘ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిదీయతే’

‘క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత’ (క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం)

దేహాన్నే క్షేత్రం అంటారు. దీన్ని తెలుసుకున్నవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఎన్నో నియమాలు పాటిస్తూ, జీవితకాలమంతా తపస్సు చేసి, ఏ భగవంతుడిని దర్శించటానికైతే మనస్సు తహతహలాడిపోతుందో ఆ దేవుడు మనలోనే ఉంటాడు. మనలో ఉన్న దైవత్వాన్ని అంగీకరించి, సాటి ప్రాణుల్లో ఉన్నది కూడా ఆ పరతత్త్వమేనని గుర్తించగలగాలి. దాన్ని మోక్ష సాధన అంటారు.


‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’ (కర్మ సన్యాసయోగం)

అభ్యాసం జీవితకాల ప్రక్రియ.నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి.. నేర్చుకోవాలనుకున్న వ్యక్తి గురువు దగ్గరకు వినయంతో వెళ్లాలి. శరీరం, మనస్సు, బుద్ధి... మూడింటిలోనూ విధేయతను ప్రకటించాలి. గురువును శరణాగతి పొంది జ్ఞానాన్ని ఆర్జించాలి.


‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప’ (సాంఖ్యయోగం)

మనిషి విజయానికి మనసే మూల కారణం.ధైర్యం లేని మనసు ఏ ప్రయత్నాన్ని చెయ్యలేదు. ఏ విజయాన్ని సాధించలేదు. అన్యాయాన్ని ఎదుర్కోలేదు. అందుకే పరమాత్మ బోధించినట్లు మనోదౌర్బల్యాన్ని విడిచిపెట్టాలి. సాహసాన్ని శ్వాసగా చేసుకోవాలి.


వరాహ పురాణంలో గీతామహాత్మ్యాం విస్తృతంగా వర్ణించారు. దీంతోపాటు గీతకు ప్రత్యేకంగా 18 పేర్లను ఈ పురాణం సూచిస్తుంది. అవి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్థమాత్ర, చిదానంద, భవఘ్ని, భయనాశిని, వేదత్రయి, పర, అనంత, తత్త్వార్థ జ్ఞానమంజరి.

- కప్పగంతు రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని