ఆమె మాట మహిమ

సరస్వతీదేవి అనగానే హంసవాహనం మీద శ్వేతవస్త్రధారిణిగా, వీణ వాయిస్తూ, మాలాధారిణిగా ఉండే రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. రుగ్వేదం షష్ఠమ మండలంలో 61వ సూక్తం సరస్వతీ సూక్తంగా ప్రసిద్ధి పొందింది. అందులో ఆ దేవి స్వరూప స్వభావాలు, గుణగణాలు, కీర్తి ప్రతిష్ఠలు, ప్రకృతిలో ఆమె ఉనికి వంటివెన్నో ఉన్నాయి....

Updated : 23 Jan 2020 01:51 IST

ఈ నెల 30 వసంత పంచమి

సంబరాలు రకరకాలు

సరస్వతీదేవి అనగానే హంసవాహనం మీద శ్వేతవస్త్రధారిణిగా, వీణ వాయిస్తూ, మాలాధారిణిగా ఉండే రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. రుగ్వేదం షష్ఠమ మండలంలో 61వ సూక్తం సరస్వతీ సూక్తంగా ప్రసిద్ధి పొందింది. అందులో ఆ దేవి స్వరూప స్వభావాలు, గుణగణాలు, కీర్తి ప్రతిష్ఠలు, ప్రకృతిలో ఆమె ఉనికి వంటివెన్నో ఉన్నాయి. రుగ్వేదంలో సరస్వతీదేవి గురించి అనేక కథలు, స్తోత్రాలు, ఆమె లీలలను, శక్తి యుక్తులను తెలిపే రుక్కులు కనిపిస్తాయి. బ్రహ్మ వైవర్త, పద్మ పురాణాలు సరస్వతిని మాట, బుద్ధి, వివేకం, విజ్ఞానం, కళలు మొదలైన వాటికి అధిదేవతగా పేర్కొన్నాయి. దేవీభాగవతం సరస్వతీదేవిని కేవలం విద్యా ప్రదాయినిగానే కాకుండా సర్వశక్తి ప్రదాయినిగా చెప్పింది.
* బ్రహ్మ వైవర్త పురాణంలో మాఘ శుద్ధ పంచమిని విద్యారంభ దినంగా పాటించాలని, సరస్వతీ పూజ చేయాలని ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని శ్రద్ధాసక్తులతో ఆచరిస్తారు. రాజస్థాన్‌లో వసంత పంచమి పేరుతో ఈరోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. వసంతోత్సవం నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్‌లో బహిరంగ ప్రదేశాల్లో సరస్వతీ విగ్రహాలు స్థాపించి పూజలు చేస్తారు. పుస్తకాలను దేవి విగ్రహం వద్ద ఉంచి పూజిస్తారు. అనంతరం ఆటపాటలతో సందడిచేస్తారు. దీన్ని ‘కళా నివేదన’ అంటారు.
*  ఈ రోజున ‘యవేష్టి’ ఉత్సవాన్ని పెద్దఎత్తున చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ‘యవలు’ అనేవి ఒకరకమైన ధాన్యం.  తొలిసారిగా కొత్త ధాన్యాన్ని వండటం మొదలు పెట్టే సందర్భమే యవేష్టి.
*  మదన పంచమి, వసంత పంచమి అనీ ఈ రోజుకి మరో రెండు పేర్లున్నాయి. రుతువులకు రాజైన వసంతుణ్ణి, మన్మథుణ్ణి శ్రీ పంచమినాడు పూజిస్తారు. ఈ సమయానికే ప్రకృతిలో వసంతరుతు లక్షణాలు కొద్దికొద్దిగా కనిపిస్తుంటాయి. వసంత రుతువు ప్రవేశించడానికి ముందు చేసే ఈ ఉత్సవం ప్రజల్లో పర్యావరణంపై స్పృహను కల్పించడానికి ఉద్దేశించినట్లుగా అర్థమవుతుంది.
*తాను చేసే సృష్టికి తోడుగా ఉండేందుకు ఒక స్త్రీ సాన్నిహిత్యం అవసరమై బ్రహ్మ సరస్వతీ దేవిని సృష్టించాడని చెబుతారు. అలా సృజించి ఆమెనే వివాహం చేసుకున్నాడు అనేది పురాణ కథనం. తాను చేసే సృష్టిలోని జీవరాశులన్నిటికీ జ్ఞానం ప్రసాదించేందుకు ఆమెను తన నాలికపై ఉంచాడంటారు.
* ఆమె వీణ పేరు ‘కచ్ఛపి’. అరవై నాలుగు కళలకూ ఈ వీణే పుట్టినిల్లుగా చెబుతారు. సంగీతం, సాహిత్యం, బుద్ధి, జ్ఞానం, అన్నీ ఈ వీణలోనే ఉన్నాయని చెబుతారు. ఆమె నివాస స్థానం నాలుకపై భాగం. అందుకే ఎవరి నోట మాట, పాట, సాహిత్యం, సంగీతం, శాస్త్ర ప్రవచనం వెలువడితే వారిని సరస్వతీ అనుగ్రహం ఉన్నవాళ్లని అంటారు.  
* బ్రహ్మ ఒకసారి అవసరార్థం శివుని అంత్యభాగాన్ని చూశానని అబద్ధం ఆడాడంటారు. అందుకు కోపించిన శివుడు బ్రహ్మకు వాక్కు అయిన సరస్వతీదేవిని నదివి కమ్మని... బయటకు కనబడని విధంగా ఉండమని శపించాడంటారు. అలా అంతర్వాహిని అయిన సరస్వతి నది ఏర్పడిందనేది పురాణ కథనం.
* సరస్వతీదేవిని గీః,గౌ, గీర్దేవి, గీర్వాణి, ఉక్తి అనే పేర్లతో పిలుస్తారు. వాణి, భారతి, శారద, వాగీశ్వరి, హంసవాహిని, వరదాయిని, బుద్ధిధాత్రి.. కూడా అమ్మకున్న పేర్లే. పలుకులరాణి, చదువుల తల్లి, లచ్చికోడలు, నలువరాణి, పలుకుచెలి, పొత్తముముత్తో, వెల్లముత్తైదువ, చదువుల వెలది...అంటూ అచ్చ తెలుగులో ముచ్చటతీరా పిలుచుకుంటారు.
- రమా శ్రీనివాస్‌
ఆమె రుక్కు...
ఆమె వాక్కు...
ఆమె పదం...
ఆమె వేదం...
ఆమె గీర్వాణి...
ఆమే శర్వాణి...

సర్వజ్ఞానానికీ అధిదేవత సరస్వతీదేవి. ఆమె ఆవిర్భవించిన రోజు మాఘ శుద్ధ పంచమి. ఈ రోజునే శ్రీ పంచమి అని పిలుస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని