రథముకదిలె... రవి తేజములలరగ!
ఫిబ్రవరి 1 రథ సప్తమి
ఆయన అందరూ చూడగలిగే దైవం... చర్మచక్షువులు అనుభూతి చెందే తేజం... సకల జీవరాశిలోని చైతన్యం... ఆరోగ్యభాగ్యాన్ని తన వరప్రసాదంగా అందించే కరుణామూర్తి... తనకు జవాన్ని, జీవాన్ని అందించే సూర్యుడిని మనిషి ఓ భౌతిక పదార్థంగానో, వెలుగులీనే నక్షత్రంగానో భావించలేదు. ప్రత్యక్ష దైవంగా పూజించాడు. వేద, పురాణ, ఇతిహాస, కావ్య వాజ్ఞ్మయమంతా సూర్యుడి విశిష్టతను ప్రకటిస్తుంది. ఆ వెలుగు నేనే తానేనన్నాడు శ్రీకృష్ణుడు. జగత్తులోని అణువణువులో నిండి నిబిడీకృతమైన అనంతశక్తి అదేనన్నారు మహర్షులు... చూడగలిగితే ఆదిత్యుడిది అనంతమైన, దివ్యమైన విశ్వరూపమని వివరించారు.
అంతా ఆయనే!
భవిష్య పురాణంలోని 74వ అధ్యాయంలో ఆదిత్యుడి సర్వవ్యాపకత్వాన్ని గురించిన వివరణ ఉంది.
* సూర్యుడు తన రథంపై అఖండ వేగంతో ప్రయాణిస్తూ జీవులకు కావాల్సిన శక్తిని ఇస్తుంటాడు. ఒక ద్వీపంలో సూర్యుడి వెలుగు మండుటెండవుతుంది. అదే వెలుగు మరో ద్వీపంలో పండువెన్నెల కాస్తుంది. కానీ అన్ని వెలుగులూ ఆయనవే. ఇంద్రుడి పట్టణమైన అమరావతి మధ్య భాగానికి సూర్యుడు చేరుకునే సమయానికి యముడి పట్టణమైన సంయమిలో ఉదయకాలం అవుతుంది. అదే సమయంలో చంద్రుడి రాజధాని అయిన విభా పట్టణంలో అస్తమయ సమయం... వరుణుడి రాజధాని అయిన సుఖా పట్టణంలో అర్ధరాత్రి అవుతుంది. ఇదే సూర్యరథం యముడి పట్టణమైన సంయమ మధ్యభాగానికి చేరుకునే సరికి వరుణుడి సుఖా పట్టణంలో ఉదయం, అమరావతిలో అర్ధరాత్రి అవుతుంది. ఈవిధంగా సూర్యుడు ఒక ముహూర్తకాలంలో భూమి ఉపరితలంపై ఉన్న ఆకాశంలో 30 భాగాలు తిరుగుతాడు.
అక్కడలా... ఇక్కడిలా...
భవిష్య పురాణం 53వ అధ్యాయంలో ఆదిత్యుని గమనాన్ని గురించి ఉంది.
సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతూ అన్ని గ్రహాలను ఒకదానికొకటి గుద్దుకోకుండా ఆకర్షణశక్తి తో నిలిపి ఉంచుతాడు. (ఋగ్వేదం)
* ఈ రథానికి ఒక చక్రం, ఐదు ఆకులు, మూడు నాభులు, ఎనిమిది బంధాలు, ఒక కమ్మీ ఉంటాయి. రథమంతా బంగారు మయం. అద్భుతమైన కాంతి ఈ రథం నుంచి ప్రసరిస్తుంటుంది. దీనికి అమర్చిన బంగారు కాడికి వాయువేగంతో పరిగెత్తగలిగే గుర్రాలు కట్టి ఉంటాయి. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఛందస్సులు ఈ గుర్రాల రూపంలో ఉంటాయి. వీటికి ఆకలిదప్పులు ఉండవు. ఎప్పటికీ అలిసిపోవు. సూర్యరథం వలయాకారంలో తిరుగుతుంటే సూర్యబింబం అన్ని దిశల్లో కుమ్మరిచక్రం తిరిగినట్లు తిరుగుతుంటుందని అందులో ఉంది. 18 రెప్పపాట్ల కాలాన్ని కాష్ట అంటారు. రెండు కాష్టల కాలంలో సూర్యరథం 180 సార్లు వలయాకారంలో పరిభ్రమిస్తుంటుంది. ఇటువంటి రథం మీద సూర్యుడు ఆశీనుడై ఉంటాడని భవిష్యపురాణం చెబుతోంది.
పరమాత్మ చెప్పాడు..!
శ్రీకృష్ణుడు తన కుమారుడైన సాంబుడితో సూర్య వైభవాన్ని వివరించాడు. భవిష్య పురాణం 48వ అధ్యాయంలో ఈ విశేషాలు కనిపిస్తాయి.
‘సూర్యుడి కంటే అధికమైన, శాశ్వతమైన దైవం మరొకరు లేరు. అతడి నుంచే సమస్తమైన జగత్తు ఆవిర్భవించింది. గ్రహాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, మేషాది రాశులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినులు, ఇంద్రుడు, బ్రహ్మ, భూలోక భువర్లోక సువర్లోకాది సమస్త లోకాలు, పర్వతాలు, వృక్షాలు, నదులతో సహా ప్రాణి ప్రపంచమంతటి పుట్టుకకు సూర్యుడే కారణం. సూర్యుడి కన్నా శ్రేష్ఠమైన దైవం లేడు. ఉండడు. ఉండబోడు కూడా.’ అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు.
సూర్యుడు తన రథాన్ని ఆధిరోహించింది మాఘ శుద్ధ సప్తమినాడు. ఆ రోజు సూర్య జయంతిగా, రథసప్తమిగా ప్రసిద్ధి పొందింది. మత్స్యపురాణంలో ఈ వివరాలు ఉన్నాయి. భారత యుద్ధంలో అర్జునుని శరాఘాతానికి కుప్పకూలిన భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అంపశయ్య మీద ఎదురుచూశాడు. రథ సప్తమి నుంచి వరుసగా ఐదు రోజులు.. సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి రోజుల్లో రోజుకొక్కటి చొప్పున పంచ ప్రాణాలు వదిలేశాడని పురాణ గాథ. అందుకే ఈ రోజున పితృ దేవతలకు తర్పణాలు వదిలే ఆచారం కూడా కొన్ని చోట్ల ఉంది.
* ఇదే పురాణం సూర్యుడు 1000 కిరణాలతో ప్రకాశిస్తుంటాడని చెప్పింది. వీటిలో చందన, మంద, కుతు, అమృత అనే పేర్లతో నాలుగు విభాగాలుగా 400 కిరణాలు ప్రసరిస్తుంటాయి. ఇవి వర్షాలకు కారణం. 300 కిరణాలు పసుపు వర్ణంతో ప్రకాశిస్తూ మంచుతో కప్పబడి ఉన్నట్లుగా కనిపిస్తాయి. వీటిని చంద్రకిరణాలు అంటారు. మరొక 300 కిరణాలు మానవులకు ఓషధుల్ని అందిస్తాయి. సూర్యుడు వర్ష, శరదృతువుల్లో 300 కిరణాలతో ప్రకాశిస్తూ వర్షాలు కురిపిస్తాడు. హేమంత, శిశిర రుతువుల్లో 300 కిరణాలతో వెలుగుతూ మంచు కురిపిస్తాడు.
రథం కాదు దివ్య తేజం
భవిష్య పురాణం 52వ అధ్యాయంలో సూర్యుడు ప్రయాణించే రథాన్ని గురించి ఉంది.
నడిపేది గరుడిడి సోదరుడు...
* సూర్యుని రథసారథి అనూరుడు. పక్షి రాజైన గరుత్మంతుడికి సోదరుడు. శిరస్సు నుంచి నడుము వరకు మాత్రమే ఉన్న శరీరం తోనే ఇతడు జన్మిస్తాడు. పుట్టుకతోనే ఇతడికి తొడలు లేకపోవడం వల్ల అనూరుడు అని పేరు వచ్చింది. దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువలకు సంతానం కలగాలనే కోరికతో పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ పొడవైన శరీరం కలిగిన వెయ్యిమంది నంతానాన్ని, వినత తేజోవంతులైన ఇద్దరు సంతానాన్ని కోరుకుంటాడు. ఫలితంగా కద్రువకు వాసుకి, తక్షకుడు మొదలైన వెయ్యి సర్పాలు పిల్లలుగా జన్మిస్తారు. వినతకు నడుము పైభాగం వరకు మాత్రమే ఏర్పడిన బిడ్డ జన్మిస్తాడు. ఊరువులు ఏర్పడక ముందే పుట్టాడు కాబట్టి అతడికి అనూరుడనే పేరు వచ్చింది. రెండోబిడ్డగా గరుత్మంతుడు జన్మించాడు. కర్మ సాక్షి సూర్య భగవానుడు తనకు రథసారథిగా అనూరుడిని స్వీకరిస్తాడు.●
- కప్పగంతు రామకృష్ణ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs NZ: న్యూజిలాండ్తో టీ20 సిరీస్.. గాయం కారణంగా రుతురాజ్ ఔట్..
-
Politics News
Hindenburg: అదానీ గ్రూపుపై ఆరోపణలు.. దర్యాప్తు చేయాల్సిందే : కాంగ్రెస్
-
Politics News
Naralokesh-Yuvagalam: యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తాం: నారా లోకేశ్
-
Sports News
U19W T20 World Cup: అండర్ 19 T20 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Punjab: ఉచిత వైద్యం.. మరో 400 మొహల్లా క్లీనిక్లు ప్రారంభం