తస్మై శ్రీ గురవే నమః

ఎక్కడున్నామో తెలీదు...ఏం చేస్తున్నామో తెలీదు...ఎందుకు చేస్తున్నామో తెలీదు...దుఃఖమయమైన సంసార సముద్రంలో పడి కొట్టుకుపోతున్నాం...మరణమనే అగాథాన్ని దాటలేక అందులోనే కూరుకుపోతున్నాం...రాజ్యాలనేలే రాజుల నుంచినిరు పేదల దాకా...పసి బిడ్డల నుంచి, కురువృద్ధులదాకాఅందరి పరుగు మృత్యువు వైపే...

Updated : 06 Jul 2021 18:27 IST

రేపు మహా శివరాత్రి

ఎక్కడున్నామో తెలీదు...

ఏం చేస్తున్నామో తెలీదు...

ఎందుకు చేస్తున్నామో తెలీదు...

దుఃఖమయమైన సంసార సముద్రంలో పడి కొట్టుకుపోతున్నాం...

మరణమనే అగాథాన్ని దాటలేక అందులోనే కూరుకుపోతున్నాం...

రాజ్యాలనేలే రాజుల నుంచి

నిరు పేదల దాకా...

పసి బిడ్డల నుంచి, కురువృద్ధులదాకా

అందరి పరుగు మృత్యువు వైపే...

మరి దీన్ని జయించే మార్గమేది..?

‘నిన్ను నీవు తెలుసుకో’...

ఇది మహర్షులు, ద్రష్టలు ఉపదేశించిన తారక మంత్రం..

మరి మనిషి తనను తాను తెలుసుకునేదెలా,

తెలియజేసే గురువెవరు?

నిర్మలమైన హృదయంతో పిలిస్తే శివుడే గురువై వస్తాడు...

నిశ్చలమైన తపస్సుతో ఆయన అనితరసాధ్యమైన ఆత్మజ్ఞానాన్ని ఉద్బోధిస్తాడు...

అలా జ్ఞానాన్ని ప్రసాదించే శివావతారమే దక్షిణామూర్తి...

ఆయన రూపం అపురూపం..

ఆయన తత్త్వం అనిర్వచనీయం....

‘నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్‌

గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః’

దక్షిణామూర్తి అన్ని విద్యలకూ నిధిలాంటివాడు. సంసారంలో కూరుకుపోయి, దుఃఖమనే రోగంతో బాధ పడుతున్న వారి పాలిట ఆయనో వైద్యుడు. లోకాలకు గురువై జ్ఞానమూర్తిగా ఆ స్వామి ప్రకాశిస్తుంటాడు. అలాంటి దక్షిణామూర్తికి నమస్కారం.

శివుడు సర్వలోకాలకూ గురువు. మానవాళికి మహోన్నత జ్ఞానాన్ని అందించడానికి పరమశివుడు ధరించిన రూపమే దక్షిణామూర్తి. ప్రశాంతత, జ్ఞానానందం మూర్తీభవించిన దివ్య స్వరూపమిది. సర్వమానవాళికీ మార్గదర్శనం చేయడమే ఆ స్వామి రూపంలోని పరమార్థంగా చెబుతారు. ఈ శివ స్వరూపం గురించి కృష్ణయజుర్వేదంలోని దక్షిణామూర్తి ఉపనిషత్తు తెలియజేస్తుంది. తత్త్వజ్ఞాన ప్రబోధం చేసి, మార్గదర్శకుడిగా కనిపించే ఈయన మార్కండేయ మహర్షికి ఆయుష్షుతో పాటు జ్ఞానాన్నీ ప్రసాదించాడని ఉపనిషత్తులో ఉంది. దక్షిణామూర్తి స్తోత్రాలు, మంత్రాలతో పాటు అంగన్యాస కరన్యాస పూర్వకంగా ఎలా అర్చించాలో కూడా అందులో కనిపిస్తుంది.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయశుద్ధాయ దిగంబరాయ

తస్మై న కారాయ నమఃశివాయ

శివపంచాక్షరీ మంత్రం ‘ఓం నమఃశివాయ’లోని ఐదు బీజాక్షరాల్లో ‘న’ కారం బ్రహ్మను, ‘మ’ కారం విష్ణువును, ‘శి’ కారం రుద్రుడిని, ‘వ’ కారం మహేశ్వరుడిని, ‘య’ కారం సదాశివుడిని సూచిస్తాయని శాస్తాల్రు చెబుతున్నాయి.

‘శివ’ అనే మాటకు మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తీ కోరుకునేవి ఈ ప్రయోజనాలే. ఈ భావాన్ని ఆశించటం, ఆశ్రయించటం, మనలో ఈ గుణాల్నివృద్ధిచేసుకోవటమే శివోపాసన అవుతుంది.

మనిషి తనలోనే దాగిఉన్న పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడిని గుర్తించటానికి తానే స్వయంగా రుద్రుడిగా మారి రుద్రుడిని అర్చించాలి. ఈ భావనను బలపరుస్తూ ‘నా రుద్రో రుద్రమర్చయేత్‌’ అంటే... రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చించలేడు అంటుంది మహన్యాసం.


అది జ్ఞానానంద రూపం!

వీణాం కరైః, పుస్తకమ్‌ అక్షమాలాం

బిభ్రాణమ్‌ అబ్రాభ గళం వరాఢ్యం

ఫణీంద్ర కక్ష్యం మునిభిః

శుకాద్యైః సేవ్యం

వటాధః కృత నీడ మీడే!’

మేధా దక్షిణామూర్తి సంగీతానికి గుర్తుగా వీణను, విద్యలకు గుర్తుగా పుస్తకం, అక్షరానికి గుర్తుగా అక్షమాలను ధరించి ఉంటాడు. నల్లటి గొంతు భాగం ఆస్వామి గరళ కంఠుడని చెబుతుంది. ఒక నాగుపామును నడుముకు చుట్టుకుని ఉంటాడు. విషసర్పంతో సమానమైన విషయాలను కూడా బంధించగల శక్తి ఆ స్వామికి ఉందనడానికి ఇది సూచనగా భావించాలి. ఒక వట వృక్ష ఛాయలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నట్లు దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది. కరుణామయవీక్షణాలతో వరాలను ప్రసాదిస్తున్నట్లు ఆ స్వామి ముఖం ఉంటుంది. ఆయన సదా చిన్ముద్రలో ఉంటాడు. అగ్నిలాంటి తేజస్సుతో వెలుగుతుంటాడు. మర్రిచెట్టు కింద ఒక వేదికపై కూర్చుని ఉంటాడు. కుడి కాలిని కిందికి జారవిడిచినట్లు కనిపిస్తాడు. ఆ కాలికింద అపస్మారుడు అనే ఒక రాక్షసుడిని అదిమిపట్టి ఉంచుతాడు. అపస్మారుడు అజ్ఞానానికి గుర్తు. ఆయన పాదాల చెంత ఆయనకంటే వృద్ధులైన శిష్యులు కనిపిస్తారు. ఎంత వయసు ఉన్నా జ్ఞానుల ముందు విధేయులుగా ఉండాలనే సందేశం ఇక్కడ కనిపిస్తుంది. ●

బలహీనులు, మూఢులు, విషయాలను అర్థం చేసుకునే శక్తి లేని వారు మాయా ప్రభావానికి లోనవుతారు. శరీరం, ఇంద్రియాలు, మనస్సు... ఇవి సత్యమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి భ్రమలను తొలగించే శక్తి సర్వలోకాలకు గురువైన దక్షిణామూర్తికే ఉంది. శివుడి అష్టమూర్తులు భూమి, జలం, అగ్ని, ఆకాశం, వాయువు, సూర్యుడు, చంద్రుడు, జీవుడుగా విరాజిల్లుతుంటాయి. అంటే అన్నిటిలో ఉండి, వాటిని నడిపించే, వెలిగించే అఖండమైన ఆ శక్తి శివుడే అని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న సాధకుడికి అందరిపై, అన్నిటిపై సమభావన కలుగుతుంది. ఇదే శివతత్త్వజ్ఞానం. దీన్ని తెలుసుకున్న వారికి మరణభయం ఉండదు. ఇదే విషయాన్ని మార్కండేయ మహర్షి తన దగ్గరకొచ్చిన రుషులకు తెలియజేశాడు.

దక్షిణామూర్తి చిన్ముద్ర మహోదాత్త సందేశాన్ని అందిస్తుంది. ఈ ముద్రలో చూపుడు వేలు, బొటనవేలిపై ఆనించి ఉంటుంది. మిగిలిన మూడు వేళ్లు తిన్నగా ఉంటాయి. ఈ తిన్నగా ఉన్న మూడు వేళ్లు మనిషిలో ఉండే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంకేతాలు. వీటిపై అధికారాన్ని సంపాదించి వాటిని అదుపులో ఉంచుకోమని చేసే సూచన ఇక్కడ కనిపిస్తుంది.

ఆయన కృపను పొందాలంటే...

ముందుగా వైరాగ్యమనే నూనెను సంపాదించుకోవాలి. భక్తి అనే దీపపు వత్తిని సిద్ధం చేసుకోవాలి. ఆ నూనెను, వత్తిని జ్ఞానబోధ అనే పాత్రలో ఉంచి ధ్యానమనే దీపాన్ని వెలిగించాలి. అప్పుడు ఆత్మజ్ఞానం ఆవిష్కృతమవుతుంది. సాధకుడి హృదయం దేదీప్యమానమవుతుందని మార్కండేయ మహర్షి తెలిపారు.

దక్షిణామూర్తి లింగరూపంలో పూజలు అందుకుంటున్న విశేషాన్ని గుంటూరు జిల్లా కోటప్పకొండలో చూడొచ్ఛు తమిళనాడులోని మయిలదుత్తురై ఆలయంలో ఉన్న దక్షిణామూర్తి జ్ఞానప్రదాతగా ప్రసిద్ధి.●

-యల్లాప్రగడ మల్లికార్జునరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని