సేవా సైన్యానికి శారథి!

ఆ రోజు తన భార్య శారదా మాతకు రామకృష్ణ పరమహంస అప్పగించిన ఆ బాధ్యత భారతీయ ఆధ్యాత్మికతకు దారి దీపమైంది. ఆమె ఆశీస్సులతో, బోధనలతో ఎదిగిన శిష్యులు అఖండ సేవా సేనకు నాయకులయ్యారు. దీనజన బాంధవులయ్యారు. సనాతన విలువలకు ఆయువు పట్టుగా నిలిచారు. ఆధ్యాత్మికవేత్తగా పరమహంస శిఖరసమానంగా నిలిస్తే... అమ్మగా, అనురాగమూర్తిగా ఆయన భార్య శారదామాత సరిజోడిగా నిలిచారు.శారదా...

Updated : 05 Mar 2020 01:39 IST

శారదా...

పిలిచారు పరమహంస.

సనానత వేదాన్ని అతి సులభ భాషలో శిష్యులకు బోధించిన ఆ గొంతు కీచుగా పలుకుతోంది.

అలౌకిక ఆధ్యాత్మిక భావనలను అందరికీ పంచిన ఆ కంఠం భరించలేనంత నొప్పితో తడబడుతోంది.

అసాధారణ సాధనలకు ఆలవాలమైన ఆ శరీరం బలహీనంగా మారి చూసేవారికి వేదన కలిగిస్తోంది.

పక్కనే ఉన్న శిష్యులు దీనంగా ఆయనవైపు చూస్తున్నారు.

‘ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా?.. చెప్పండి’ శారదమ్మ అడిగింది అనునయంగా...

‘నేనే అన్నీ చేయాలా? నువ్వు ఏమీ చేయవా?’...

సూటిగా ఉన్న పరమహంస మాటలకు ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు...

‘నేనొక స్త్రీని...ఏం చేయగలను?

మీ చరణదాసిగా మీ గాఢమైన భావాలను పంచుకున్నా, మీ బాధ్యతలను పంచుకునేంత శక్తి నాకెక్కడిది?’ ఒక్కో మాటా కూడదీసుకుని పలికారామె.

అప్పుడు పరమహంస...

శారదా... నువ్వు చేయాలి... నువ్వే చేయాలి...

ఎవరు చెప్పారు స్త్రీ ఏమీ చేయలేదని...

అనంతశక్తి నిలయమైన నీకన్నా నా కర్తవ్యాన్ని కొనసాగించే సమర్థులు కనిపించడం లేదు.

అచంచల దీక్ష ఉన్న నీకన్నా భారత దేశ సేవా సైన్యానికి దిశానిర్దేశం చేయగలిగే వారు కనిపించడం లేదు

నీకు గుర్తుందా...

నన్ను పెళ్లి చేసుకుని మీ స్వగ్రామం జయరాంబాటి నుంచి నా దగ్గరకు వచ్చాక నేను నిన్ను నేను అడిగాను. ‘నన్నీ సంసారంలోకి దించడానికి వచ్చావా?’అని

అందుకు నువ్వు చెప్పిన సమాధానం... ‘మీరు ఎంచుకున్న పారమార్థిక మార్గంలో సహకరించడానికి వచ్చాను’ అని...

అప్పుడే నువ్వు నా అర్ధాంగివి మాత్రమే కాదు... ఆధ్యాత్మిక ఆత్మీయురాలివి కూడా అయ్యావు.

నేను అంతుతెలియని సాధనలో ఉండే నువ్వు చేసిన సేవలు ఎన్నని చెప్పేది.

అందుకేనేమో నీలో నాకు ఆ జగన్మాత కనిపించేది. ఎన్నోసార్లు నువ్వు త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చావు.

‘వివేకానంద, బ్రహ్మానందతో పాటు శిష్యులందరూ నవ యువకులు. నిష్కళంకమైనవాళ్లు.భావిభారత భాగ్య విధాతలు వాళ్లు.

నేను వెళ్లిపోయే సమయం ఆసన్నమైందని నాకు తెలుస్తోంది. ఇకపై ఆ చిన్నారుల బాధ్యత నీదే.

వారిలో జ్వాజ్వల్యమానంగా వెలుగుతున్న జ్ఞాన జ్యోతులకు ఇక నువ్వే ప్రాణవాయువువి. వారిని కాపాడినట్లుగానే వారిలోని అద్భుత ఆధ్యాత్మిక భావనలనూ కాపాడు. వారికి అమ్మగా అన్నం పెట్టు... గురువుగా జ్ఞానాన్ని పెట్టు.

ఇక నువ్వే వారికి దిక్సూచివి...

ఆ రోజు తన భార్య శారదా మాతకు రామకృష్ణ పరమహంస అప్పగించిన ఆ బాధ్యత భారతీయ ఆధ్యాత్మికతకు దారి దీపమైంది. ఆమె ఆశీస్సులతో, బోధనలతో ఎదిగిన శిష్యులు అఖండ సేవా సేనకు నాయకులయ్యారు. దీనజన బాంధవులయ్యారు. సనాతన విలువలకు ఆయువు పట్టుగా నిలిచారు. ఆధ్యాత్మికవేత్తగా పరమహంస శిఖరసమానంగా నిలిస్తే... అమ్మగా, అనురాగమూర్తిగా ఆయన భార్య శారదామాత సరిజోడిగా నిలిచారు.

-సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని