అ, ఆ, ఇ, ఈ ల్లో అంతా ఉంది!

అక్షరం ఏం చేస్తుంది? హ్రీంకరిస్తుంది... ఓంకరిస్తుంది... ప్రతిధ్వనిస్తుంది... విస్ఫోటం చెందుతుంది... మంత్రంగా మారి మనిషి జీవితాన్నే మార్చుతుంది..పరమాణువులను క్రమ పద్ధతిలో అమర్చితే అనంత శక్తి పుడుతుంది... అది అణుశక్తి

Updated : 12 Mar 2020 02:05 IST

అక్షరం ఏం చేస్తుంది? హ్రీంకరిస్తుంది... ఓంకరిస్తుంది... ప్రతిధ్వనిస్తుంది... విస్ఫోటం చెందుతుంది... మంత్రంగా మారి మనిషి జీవితాన్నే మార్చుతుంది..

పరమాణువులను క్రమ పద్ధతిలో అమర్చితే అనంత శక్తి పుడుతుంది... అది అణుశక్తి

అక్షరాలను నియమిత పద్ధతిలో అమర్చితే అవి అసాధారణ శక్తి సమన్వితాలవుతాయి. అది మంత్రశక్తి

మహా ద్రష్టలైన మన ప్రాచీన రుషులు సృష్టిలోని నిగూఢమైన శబ్దాలను అక్షరాలుగా దర్శించి వాటిని బీజాక్షరాలుగా మలిచారు. అందుకే అవి కేవలం అక్షరాలే కాదు ఆశీర్వాదాలయ్యాయి...

క్షరం ఓ సాధారణ సంకేతం మాత్రమే కాదు, అదో విస్ఫోటన శక్తి. ఆ శక్తిని ఏనాడో మన రుషులు గుర్తించి వాటిని మంత్రాక్షరాలుగా మార్చారని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. మంత్రం కొన్ని అక్షరాల సముదాయం. ఏ అక్షరం పక్కన దేన్ని చేరిస్తే అది శక్తిమంతమైన మాటగా మారుతుందో తెలుసుకున్న సనాతన రుషులు వాటిని క్రోడీకరించారు. అలా వారు మంత్ర స్రష్టలయ్యారు. మంత్రంలోని ఒక్కో అక్షరానికి ప్రకృతిలోని ఒక్కో శక్తిని ఆవాహన చేశారు. వాటిని బీజాక్షరాలంటారు. ఆ శక్తులను ఆ అక్షరాలకు అదిష్ఠాన దేవతలంటారు. ఆ బీజాక్షరాలను సరైన పద్ధతిలో పలుకుతూ మంత్రాన్ని సాధన చేస్తే ఆ ప్రకృతి శక్తుల అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. ఈ బీజాక్షరాన్నే బీజ మంత్రం అని కూడా అంటారు. ఈ విషయాలను రుషులు తమ సంహితలలో, మంత్రశాస్త్ర గ్రంథాలలో ప్రస్తావించారు. కుర్తాళం పీఠాధిపతి భారతీతీర్థ స్వామి రచించిన మత్రసాధనలు గ్రంథంలో బీజాక్షరాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. అనంత శక్తితో ఉండే ఈ బీజాక్షరాలను ఇష్టం వచ్చినట్లు పలకకూడదని, గురువుల సూచనల మేరకే సాధన చేయాలని వివరించారు.


శరీరం ఓ వర్ణమాల

దేవీ భాగవతంలో జగజ్జనని చెప్పిందనే కొన్ని ఆసక్తికరమైన మంత్రశాస్త్ర విశేషాలు కనిపిస్తాయి. దీని ప్రకారం మన శరీరం ఒక అక్షరాల మాల. వర్ణమాలలోని అక్షరాలన్నీ శబ్ద రూపంలో ఉండి శరీరంపై అనుక్షణం ప్రభావం చూపిస్తుంటాయి. మనిషిలోని శక్తి ఆ అక్షరాల కారణంగానే ఉద్భవిస్తుంటుంది. బీజాక్షరాలు అతన్ని నిరంతరం జాగృతం చేస్తుంటాయి.మనం మాట్లాడే ప్రతి మాటా మనలో ప్రకంపనలు రేపుతుంది, అందుకే ఆచితూచి మాట్లాడాలని పెద్దలు చెబుతారు.

మనిషి శరీరంలోని వెన్నెముకను మేరుదండం అంటారు. దానికి ఎడమవైపు ఇడ, కుడి వైపు పింగళనాడులు ఉంటాయి. ఈ రెండిటి నడుమ ఉన్న నాడి సుషుమ్న. దీని మధ్యలోనే ఇచ్ఛాజ్ఞానక్రియాత్మకమైన లింగ రూపం ఒకటి దివ్యకాంతులతో ఉంటుంది. దీనిపై బిందు నాదాత్మకమైన మాయా బీజం ‘హ్రీం’ ఉంటుంది. దీనిపైనే కుండలినీ శక్తి ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయి. అవి మన మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ఉద్దీపింపజేస్తుంటాయి. పద్మాకారంలో ఉండే ఆ చక్రాల్లో నిక్షిప్తమై ఉండే బీజాక్షరాలే ఆ ఉద్దీపనలకు కారణమని గ్రంథాల్లో ఉంది.


శక్తి భాండాగారాలు...

* అం: దీన్ని బ్రహ్మ బీజాక్షరమంటారు. అంటే అంతేలేనిదని అర్థం. అందుకే అం అనే బీజాక్షరాన్ని నారాయణ లేదా విష్ణు బీజాక్షరమంటారు. దీనికి అందరినీ ఆకర్షించగలిగే శక్తి ఉందని చెబుతారు.

* ఈం: దీన్ని మహా మాయాబీజమని మంత్రశాస్త్రం చెప్పింది. ఈం అంటే సర్వత్రా విస్తరించేది అని అర్థముంది. అమ్మ ఆరాధకులు మంత్రాల్లో దీన్ని వాడుతుంటారు.

* ఊం: ఇది ఒక సంక్లిష్టమైన బీజాక్షరం. ఎంతో శక్తివంతమైన ఈ శబ్దాన్ని సద్గురువుల సమక్షంలోనే, వారి సూచన మేరకు ఉపయోగించాలని చెబుతారు.

* ఓం: ఇది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అకార, ఉకార, మకారాల సంయోగం ఈ బీజాక్షరం. ఓంకారంలోనే సమస్తం ఉందని వేదాలు వివరిస్తున్నాయి.

* హుం.. ఈ బీజాక్షరాన్ని కవచం అంటారు. సప్త మాతృకల్లో ఒకరైన వారాహీ మాతను శత్రువుల నుంచి రక్షణ కోసం ఉపాసన చేస్తుంటారు. ఆ మంత్రాల్లో హుం... కనిపిస్తుంది.

* లం... దీన్ని ఇంద్ర లేదా పృధ్వీ బీజం అంటారు. పాలనాశక్తి కోరుకునేవారు ఇష్ట దేవతారాధనలో, సాధనలో ఈ బీజాక్షరాన్ని ప్రయోగిస్తారు.

* శ్రీం.. దీన్ని లక్ష్మీ బీజాక్షరం అంటారు. సంపదలు, వృద్ధి, కీర్తి కోసం దేవతా ప్రార్థన చేసేవారు దీన్ని సంపుటీకరించి ఉపయోగిస్తుంటారు.

* హ్రీం... దీన్ని మాయా బీజమంటారు. దేవీ ప్రణవం అన్నా ఇదే. సాధారణంగా ఓంకారాన్ని ప్రణవమంటారు. సృష్టికి మూలం ఆ నాదమేనని వేదాలు చెబుతున్నాయి. దానితో సరి సమానమైన బీజాక్షరమిది అని చెబుతారు. జగన్మాత అనుగ్రహం కోసం దీన్ని ఉపయోగిస్తారు.


రామాయణ మహా కావ్యం 24 వేల శ్లోకాలతో ఉంటుంది. అలాగే గాయత్రీ మంత్రం 24 బీజాక్షరాల సమామ్నాయం. వాల్మీకి మహర్షి రామాయణంలోని ప్రతి వెయ్యి శ్లోకాలకు గాయత్రీ మంత్రంలోని ఒక బీజాక్షరాన్ని నిక్షేపం చేస్తూ వెళ్లాడని... అందుకే ఆ కావ్యం అద్భుత శక్తితో వెలుగులీనుతోందని చెబుతారు. ఇది అక్షరానికుండే గొప్పదనాన్ని తెలియజేస్తుంది. 

- యల్లాప్రగడ మల్లికార్జునరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు