వశిష్ఠ ఉవాచ

నా కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా శాశ్వతమేనా? అశాశ్వతమే అయితే ఆ క్షణికమైన తృప్తి కోసం మానవుడు ఎందుకీ మోహానికి బందీ అవుతున్నాడు? ప్రాణులన్నీ మరణించటం కోసమే పుడుతున్నాయి. పుట్టి మరణిస్తున్నాయి. మరి ఈ చావు పుట్టుకలెందుకు?

Updated : 30 Jul 2021 18:43 IST

యోగ వాశిష్ఠం

నేనెవరిని?

నా కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా శాశ్వతమేనా?

అశాశ్వతమే అయితే ఆ క్షణికమైన తృప్తి కోసం మానవుడు ఎందుకీ మోహానికి బందీ అవుతున్నాడు?

ప్రాణులన్నీ మరణించటం కోసమే పుడుతున్నాయి. పుట్టి మరణిస్తున్నాయి. మరి ఈ చావు పుట్టుకలెందుకు?

ఆయువు పెరిగిన కొద్దీ కష్టాలు పెరగడం తప్ప మరే ఇతర ప్రయోజనం లేదు. అలాంటప్పుడు జీవికి ఆయువెందుకు?

ఎందుకోసం ఈ జీవితం? మనిషి కర్తవ్యం ఏమిటి?

పిడుగుల్లాంటి ఈ ప్రశ్నలకు దశరథ మహారాజు నిండు సభ నివ్వెరపోయింది. అక్కడున్న వేదవేదాంగవేత్తలు నిరుత్తరులవుతున్నారు. తాను అనుభవించిన వైరాగ్యాన్నంతటినీ సందేహాల రూపంలో శరపరంపరగా అడుగుతోంది నిండా 15 ఏళ్లు కూడా లేని ఓ బాలుడు. అతడే స్వయంగా జ్ఞాని. ఆత్మశోధనతో ప్రపంచాన్ని అలౌకిక కోణంలో చూసిన దివ్యవేత్త. ఇక అతడి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పేందుకు బ్రహ్మర్షులు కూడా సాహసం చేయలేకపోయారు. ఏం జరుగుతుందో చూడాలనే ఆసక్తితో మహర్షులు, సిద్ధులు సభలోకి వచ్చారు.

ఇంతకీ ఎవరీ బాలుడు? అంత చిన్న వయసులోనే అంత వైరాగ్యమేంటి? మరి అతని ప్రశ్నలకు సమాధానం చెప్పిందెవరు?

కులగురువైన వశిష్ఠ మహర్షి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత శ్రీరామచంద్రుడికి దేశయాత్ర చేయాలనే కోరిక కలిగింది. తండ్రి దశరథుడి ఆజ్ఞ తీసుకుని, సోదరులతో కలిసి పుణ్యక్షేత్రాలతో సహా మొత్తం దేశమంతా చుట్టివచ్చాడు. అయోధ్యకు వచ్చిన తర్వాత అతనిలో ఎంతో మార్పు వచ్చింది. రాజభోగాలు అనుభవిస్తున్నా ఎప్పుడూ నిర్వేదంగా ఉండేవాడు. ముఖంలో విషాదఛాయలు ఉండేవి. లేకలేక పుట్టిన రాముడి ప్రవర్తనతో దశరథుడికి అంతులేని దు:ఖం కలిగింది. ఓరోజు ఈ విషయంపై మాట్లాడుతుండగానే సభలోకి విశ్వామిత్రుడు వచ్చాడు. రాక్షస సంహారం కోసం తనతో పాటు రామచంద్రుణ్ణి పంపమని అడిగాడు. కలవరపడుతున్న దశరథుణ్ణి, వశిష్ఠుడు సముదాయించి రామలక్ష్మణులను సభకు పిలిపించాడు.

అక్కడ రాముడి మనసులో ఆవేదన పసిగట్టిన విశ్వామిత్రుడు ‘రామా! నీ మనసు బాధ పడటానికి కారణం నాకు చెప్ప’మన్నాడు.

‘దేనివల్ల దు:ఖరహితమైన స్థితి వస్తుందో ఆ ఉపాయాన్ని నాకు చెప్పండి. ఒకవేళ అలాంటిది లేకపోతే ఇక నాకు అశాంతి తప్పదు.మనస్సుకు శాంతి లభించకపోతే ‘నా’ అనుకున్న సర్వస్వాన్నీ వదిలేస్తాను. చివరికి దేహాన్ని కూడా... ఇంతకు మించి మార్గం లేదన్నాడు రాముడు.

విశ్వామిత్రుడి సూచనతో వశిష్ఠుడు రాముడి సందేహాలు తీర్చడానికి సిద్ధపడ్డాడు. నిషధ పర్వతంపైకి తీసుకెళ్లాడు. బ్రహ్మదేవుడు తనకు ఉపదేశించిన పరమాత్మతత్త్వాన్ని రామచంద్రుడికి ఉపదేశించాడు.

రామ, వశిష్ఠ సంవాద రూపంలో జరిగిన ఈ అనంతమైన తత్త్వవివేచనే ‘యోగవాశిష్ఠం’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనంతమైన తత్త్వజ్ఞానానికి, జ్ఞానోపదేశానికి యోగవాశిష్ఠం కీర్తిపతాకగా మారింది. దీనికి ‘వశిష్ఠ రామ సంవాదం’, ‘వశిష్ఠగీత’ అనే పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 32 వేల శ్లోకాతో ఆరు ప్రకరణాలుగా వాల్మీకి మహర్షి దీన్ని తీర్చిదిద్దాడు.


ఇదే యోగం

రామ: ఒకే బ్రహ్మ నుంచి ఇంతటి విభిన్నమైన సృష్టి సాధ్యమవుతుందా?

వశిష్ఠ: ఒకే దీపం నుంచి అనేక కాంతి కిరణాలు వెలువడినట్లు, ఒకే సూర్యుడి నుంచి కోట్లాది సూర్యకిరణాలు ఉద్భవించినట్లు, ఒకే సరస్సు నుంచి అనంతమైన తరంగాలు జన్మించినట్లు ఒక్కడే అయిన బ్రహ్మ నుంచి అనంతమైన సృష్టి ఆవిర్భవిస్తోంది.

రామ: మాయను గుర్తించటం ఎలా?

వశిష్ఠ: అద్దం ముందు నిల్చొని కుడి చెయ్యి తిప్పితే అందులో ఎడమచెయ్యి కనిపిస్తుంది. నిజానికి తిరిగింది కుడిచెయ్యి. అద్దం చూపించింది మాయ. మన మనస్సు కూడా అద్దం లాంటిదే. అంటే మనస్సులోనే మాయ అంతా ఉంది. ఇది గమనిస్తే మాయాపాశాల నుంచి విముక్తి భిస్తుంది.

రామ: కర్మ నుంచి విముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి?

వశిష్ఠ: మనస్సు ఎప్పుడూ పవిత్రమైన వస్తువు లేదా పని మీదనే నిమగ్నమై ఉండాలి. అప్పుడు మనిషికి తగిలే శాపాలు, కర్మలు రాయి మీద తగిలిన బాణంలాగా నిష్ఫలమవుతాయి.

రామ: జ్ఞాని అంటే ఎవరు?

వశిష్ఠ: ప్రపంచమంతా చైతన్యంతో నిండి ఉంది. అసలు ప్రపంచమే చైతన్య స్వరూపం. ఈ విషయాన్ని గుర్తించగలిగిన వాడు జ్ఞాని.

రామ: మనిషికి కష్టాలు కలిగించేది ఎవరు?

వశిష్ఠ: మనిషి కష్టాలకు కారణం అతడి మనస్సే. చిత్ర విచిత్రమైన భ్రమల్ని కలగజేయడం ద్వారా మనస్సు మనిషిని కష్టాలకు గురిచేస్తుంది. సమ్యక్‌ జ్ఞానం ద్వారా మనస్సును శుభ్రపరచాలి. అప్పుడు మనస్సు పెట్టే కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది.

రామ: మోక్షమార్గం ఎప్పుడు కనిపిస్తుంది?

వశిష్ఠ: కంటికి కనిపించే పదార్థాలు ఆశలు కల్పిస్తాయి. భోగ విషయాల గురించిన బంధాలు, ఆశలు వదులుకుంటేనే మోక్షమార్గం కనిపిస్తుంది.

రామ: అన్నిటికన్నా గొప్పదైన ఉపాయం ఏది?

వశిష్ఠ: ‘‘దైవం నిహత్య కురు పౌరుష మాత్మశక్త్యా’’

పురుష ప్రయత్నానికి మించిన ఉపాయం ఏదీ లేదు. పౌరుషం, ఆత్మశక్తి ఉంటే విధిని జయించవచ్ఛు ప్రయత్నిస్తే విజయక్ష్మి ఎప్పటికైనా వరిస్తుంది.

రామ: లోకంలో ఉండే పురుషార్థాలు ఏవి?

వశిష్ఠ: కాలం మింగని వస్తువేదీ ఈ ప్రపంచంలో లేదు. అన్నపానాదులు, స్త్రీపురుష సంయోగాలు మొదలైన ఇంద్రియ విషయాలు తప్ప లోకంలో పురుషార్థం ఏదీ లేదు. బుద్ధి కలిగిన వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించాలి.


కర్కటిపై మంత్ర బాణం

యోగవాశిష్ఠం,ఉత్పత్తి ప్రకరణం, మూడో అధ్యాయంలో వశిష్ఠుడు రాముడికి చెప్పిన కథ ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..

హిమాలయ పర్వత ప్రాంతంలో ‘కర్కటి’ అనే భయంకరమైన రాక్షసి ఉండేది. ఎంత తిన్నా ఆ రాక్షసి కడుపు నిండేది కాదు. మొత్తం సముద్ర జలమంతా తాగి, జంబూద్వీపంలో ఉన్న ప్రాణులన్నిటినీ తింటే కానీ తన ఆకలి తీరదని అనుకునేది. ఇందుకోసం ఒంటి కాలి మీద నిలబడి వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. తాను విషూచిక వ్యాధి రూపంలో సూది మొన పరిమాణంలోకి మారి సమస్త జీవుల్ని తినాలని వరాన్ని అడిగింది కర్కటి. తథాస్తు అంటూనే బ్రహ్మదేవుడు ఓ నియమం విధించాడు. గుణవంతులు, సదాచారపరులైన వారి కోసం ఓ మంత్రాన్ని ఇస్తున్నాను. ఆ మంత్రాన్ని జపించినవారిని నువ్వు బాధించలేవన్నాడు. కర్కటి సరేనంటూ సెలవు తీసుకుంది.

బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రం..

‘ఓం హ్రీం హ్రాం

రీం రాం విష్ణుశక్తయేనమ:

ఓం నమో భగవదీ విష్ణుశక్తిమేనాం

ఓం హరహర నయనయ

పచపచ మథమథ

ఉత్పాదయ దూరేకురు స్వాహా

హిమవన్తం గచ్ఛ జీవ స: స:

చంద్ర మండలం గతోసి స్వాహా’

- కప్పగంతు రామకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని