నారాయణ తేనమో నమో!

తిరుమలలో రామానుజాచార్యులు నిర్దేశించిన ఉపచారాలకు పదకవితాపితామహుడు అన్నమయ్య సంకీర్తనలను సరికూర్చి శాశ్వతత్వాన్ని కల్పించాడు. ఆయా పూజలకు తన పదాల పంచామృతాన్ని అద్ది మరింత శోభాయమానం చేశాడు. శ్రీనివాసుడికి సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు అన్ని ఉపచారాలు ఈ సంకీర్తనాచార్యుడి పదాల్లో ప్రతిఫలిస్తాయి. అందుకే ఆయన పాడిన పాటల్లా పరమగానమైంది... అన్న మాటల్లా అమృత కావ్యమైంది....

Published : 07 May 2020 00:25 IST

పరమ యోగులకు పరిపరి విధముల వరమొసగెడి ఈ పాదము...

రేపు అన్నమయ్య జయంతి

తిరువేంకటనాథుడికి

విన్నపాలు వినిపించాలన్నా...

ఆయనను ఆర్తితో

ఎలుగెత్తి పిలవాలన్నా...

అదివో అల్లదివో అంటూ

తిరుమలగిరుల వైభవాన్ని కీర్తించాలన్నా

జగద్రక్షకుడు దేవేరులతో చేసే

సరససల్లాపాలను తిలకించి పులకించాలన్నా...

అన్నమయ్య కీర్తనలను ఆశ్రయించాల్సిందే...

అంతేనా...

తిరుమలలో రామానుజాచార్యులు నిర్దేశించిన ఉపచారాలకు పదకవితాపితామహుడు అన్నమయ్య సంకీర్తనలను సరికూర్చి శాశ్వతత్వాన్ని కల్పించాడు. ఆయా పూజలకు తన పదాల పంచామృతాన్ని అద్ది మరింత శోభాయమానం చేశాడు. శ్రీనివాసుడికి సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు అన్ని ఉపచారాలు ఈ సంకీర్తనాచార్యుడి పదాల్లో ప్రతిఫలిస్తాయి. అందుకే ఆయన పాడిన పాటల్లా పరమగానమైంది... అన్న మాటల్లా అమృత కావ్యమైంది. ఆ కీర్తనలను ఆలపిస్తూ, ఆలకిస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని ఉన్నచోటు నుంచే అంతర్వీక్షణంతో దర్శించి పునీతులు కావచ్చు.

ముల్లోకాలనూ నిద్రలేపే మురహరుణ్ణి మేల్కొలిపి ముచ్చటపడిపోయాడు అన్నమయ్య. ఈ పరంపరలో ఎన్నో మేల్కొలుపు పాటలు పాడి పరవశించిపోయారాయన. అందులో మకుటాయమానమైంది ‘విన్నపాలు వినవలె వింతవింతలు... పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా...’ అనే కీర్తన. తన హృదయ పాన్పుపై ఆ పరాత్పరుడిని పవళింపజేసి, ఆదిశేషుణ్ణే దోమతెరగా భావన చేశారా భక్తాగ్రేసరుడు. ఆ దేవదేవుడి శయన విలాసాన్ని అంతరంగంలో ఆవాహన చేసుకున్న సంకీర్తన అది. శ్రీనివాసుడికి మేలుకొలుపు, సర్వజగత్తుకూ మేలుకొలుపు.

స్వామి నిలువెత్తు విగ్రహాన్ని చూసుకుని అన్నమయ్య పులకించిపోయారు. శ్రీనివాసుని ముఖం చిరుకెంపు, నలుపు రంగులతో కూడి ఆధ్యాత్మిక శోభను ప్రకటిస్తుంది. ఆ ముఖభావం, నయనాలు, ఆపాదమస్తకం అసమాన సౌందర్యంతో అలరారుతుంటాయి. ఆ రూపాన్ని అన్నమయ్య అద్భుతంగా వర్ణించారు. నల్లని రూపు, చల్లని చూపుతో వెలసిన ఆ వేలుపుని ‘నల్లని మేని నగవు చూపుల వాడు, తెల్లని కన్నుల దేవుడు...’ అన్నారు. ఆ నలుపు సాధారణమైంది కాదు... దాన్ని చూడగానే ఆనాడు గజేంద్రుడికి కనిపించిన పెనుచీకటి గుర్తురావాలి. ఆ కరిరాజులా ‘లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగిన తుదినలోకం బగు పెంజీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుగు నగతని సేవింతుల్‌..’ అనగలగాలి. అలాంటి నలుపు రంగుతో నిర్మలత్వానికి, దయాగుణానికి నిదర్శనమైన తెల్లటి కన్నులతో కరుణామృత వృష్టి కురిపిస్తున్నాడని అన్నమయ్య చెప్పారు.

తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడే కాదు నైవేద్యప్రియుడు కూడా! ఆయనకు ఏరి కోరి సమర్పించిన రుచికరమైన పదార్థాలను ప్రసాదాలుగా భక్తులకు పంచిపెట్టడం ఆనవాయితీ. ఆనందనిలయంలోని మూలవిరాణ్మూర్తికి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి... ఇలా మూడు పూటలా నివేదన చేయడం ఆనవాయితీ. దీన్ని వర్ణిస్తూ అన్నమయ్య ఓ చోట...‘ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి!’ అని అర్థించాడు. ఆ కీర్తనలో అక్కాళ పాశాలు, అప్పాలు, వడలు, పేణులు, మిరియపు తాళింపులు, కూరలు, పిండివంటలు, పెరుగులు, పాలు... ఇలా శ్రీనివాసుని ఆరగింపును వర్ణించాడు.

తోమాల సేవ...వేంకటేశ్వర స్వామికి భుజాల పైనుంచి పాదాల వరకు పూలమాల అలంకరించే సేవ. పదకవితా పితామహుడు ఆ ఉపచారంలో ఉబ్బితబ్బిబ్బైపోయి స్వామి హస్తాలను, పాదాలను విశేషరీతిలో వర్ణించారు. ‘ఇందరికి అభయంబులిచ్చుచేయి, కందువగు మంచి బంగారు చేయి’ అంటూ ఆ పద్మావతీ ప్రియుడిని ప్రస్తుతించారు. ఇక ఆ పుండరీకాక్షుడి పాదాలు పరమపవిత్రాలు. అవి పాపహరణాలు, కైవల్యసాధకాలు. అందుకే ‘బ్రహ్మకడిగిన పాదము, బ్రహ్మముతానెనీ పాదము’ అంటూ అభివర్ణించారు అన్నమయ్య. పరమపదమే నీ పాదం అంటూ పాదాక్రాంతుడయ్యారు.

స్వామి వారి ఉపచారాల్లో అభిషేకం అత్యంత ఆకర్షణీయం. ఆ దివ్య మంగళరూపానికి శుక్రవారం నయన మనోహరంగా సేవ జరుగుతుంది. ఆ సందర్భానికి తన పదాలనే పసిడి పరదాలుగా చేసి అన్నమయ్య ప్రదర్శించారు. ‘కంటి శుక్రవారము గడియ లేడింట... అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని...’ అంటూ పులకించిపోయారు. ఈ కీర్తనలో పన్నీరు, పచ్చకర్పూరం, తట్టు పునుగు వంటి సుగంధ ద్రవ్యాల నుంచి అక్కడి వస్తుసామగ్రిని, ఆ సమయంలో ఆనందనిలయంలోని వైభవానికి పదాల హారతులు పట్టారు.

‘కలియుగం నామాధారం’... అంటే కలియుగంలో కేవలంలో నామస్మరణతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. భక్తుల ఆత్మానందానికి నామం ఊతమవుతుంది. శ్రీనివాసుడి సన్నిధిలో నిరంతరం సహస్ర నామార్చన జరుగుతుంది. ‘నీ నామమే మాకు నిధియు నిధానము... నీ నామమే ఆత్మనిధానాంజనము’ అంటూ కీర్తించారు అన్నమయ్య. ఆ సంకీర్తనలో ఆయన నారాయణ, గోవింద, దామోదర, వాసుదేవ, అథోక్షజ, అచ్యుత... ఇలా అనేక నామాలతో శ్రీనివాసుని స్తుతించారు.

అన్ని ఉపచారాలు ముగిశాక స్వామికి పవళింపు సేవ చేయడం ఆనవాయితీ. లోకాలను పాలించే ఆ స్వామికి పవళింపు పాట పాడే సౌభాగ్యం పదకవితాపితామహుడిదే. ఆయన రచించిన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా..’ కీర్తనతో స్వామిని నిద్రపుచ్చుతారు. ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడే, ఈ శ్రీనివాసుడు... అందుకే ‘మంగళము తిరుపట్ల మదన గోపాల...’ అంటూ ముగింపు పలుకుతూ పద్మావతి ప్రియుడిని పవళింపజేస్తారు.

-సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని