తొమ్మిది రూపాల్లో తేజం!

ఎంతటి ఉగ్రతేజమో... అంత మృదుమధురం ఎంత దేహదారుఢ్యమో... అంత సమున్నత బుద్ధి బలం ఎంత ప్రతాప రౌద్రమో... అంత తీక్షణమైన బ్రహ్మచర్యం ఇది హనుమ స్వరూపం... వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక అద్భుత లక్షణాల మేలుకలయిక ఆంజనేయుడు...అందుకే ఆయన నిత్యస్మరణీయుడు.హనుమ తొమ్మిది అవతారాల వివరాలు ఎంతో ఆసక్తికరం...

Published : 14 May 2020 00:25 IST

ఈనెల 17 హనుమజ్జయంతి

ఎంతటి ఉగ్రతేజమో... అంత మృదుమధురం

ఎంత దేహదారుఢ్యమో... అంత సమున్నత బుద్ధి బలం

ఎంత ప్రతాప రౌద్రమో... అంత తీక్షణమైన బ్రహ్మచర్యం

ఇది హనుమ స్వరూపం... వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక అద్భుత లక్షణాల మేలుకలయిక ఆంజనేయుడు...

అందుకే ఆయన నిత్యస్మరణీయుడు.

హనుమ తొమ్మిది అవతారాల వివరాలు ఎంతో ఆసక్తికరం...

మనుస్మృతిలో మంచి దూతకు ఉండాల్సిన లక్షణాల గురించిన వివరణ ఉంటుంది. ప్రభువుపై అనురాగం, కపటమెరుగని స్థితి, సమర్థత, జ్ఞానం, దేశకాలతత్త్వం తెలిసి ఉండడం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవడం, వాక్పటుత్వం ఆ ఎనిమిది లక్షణాలు. ఇవన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శ్రీరాముని ప్రేమకు ఆయన పాత్రుడయ్యాడు.

దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ

రామకార్యార్థ సిద్ధ్యర్థం జాత: శ్రీహనుమాన్‌శివ:

రామకార్యాన్ని సిద్ధింపజేసి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి సాక్షాత్తు పరమశివుడే హనుమంతుడిగా అవతరించాడని పరాశర సంహిత చెబుతోంది. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుని అనుగ్రహం ద్వారా కేసరి అనే వానరవీరుని భార్య అంజనాదేవికి రుద్రతేజంతో హనుమ జన్మించినట్లు చెబుతారు. ఆయన ప్రజ్ఞాపాటవాలను రామాయణంలోని కిష్కింధకాండ అద్భుతంగా వర్ణిస్తుంది. ఎన్నో సుగుణాలతో హనుమ రామాయణం అనే మణిహారంలో రత్నమై భాసించాడు.

వీరాంజనేయ

మైందుడనే బ్రాహ్మణుడు కాశీకి ప్రయాణమయ్యాడు. నదిని దాటే సమయంలో తీవ్రమైన గాలివాన వచ్చింది. ప్రాణాలు దక్కే పరిస్థితి లేదని భావించిన మైందుడు హనుమంతుడిని ధ్యానించాడు. ఇంతలో పెద్దశబ్దం కావడంతో కళ్లు తెరచి చూశాడు. తాను నది అవతలి గట్టు మీద ఉన్నాడు. తన చుట్టూ ప్రజలు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందని వారిని ప్రశ్నించాడు మైందుడు. పెద్ద వానరం ఒకటి నిన్ను పడవతో సహా నెత్తినపెట్టుకుని నదిని దాటి వచ్చిందని చెప్పారు వారంతా. తన స్వామి హనుమే స్వయంగా వచ్చి తనను కాపాడినట్లు మైందుడు గ్రహించాడు. ఇలా మైందుడిని కరుణించిన అవతారం వీరాంజనేయావతారం.

ప్రసన్నాంజనేయం

చంద్రకోణ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించే విజయుడనే రాజు దశదిశల్నీ జయించాలనే కోరికతో జైత్రయాత్ర చేయాలనుకున్నాడు. గర్గ మహాముని దగ్గర హనుమంతుడి అష్టాక్షరీ మంత్రదీక్ష స్వీకరించి, ఆ స్వామిని ఉపాసన చేశాడు. దీంతో హనుమంతుడు ప్రత్యక్షమై తర్వాతి జన్మలో విజయుడి కోరిక తీరుతుందని వరమిచ్చాడు. ఆ విజయుడే అర్జునుడిగా జన్మించాడు. అర్జునుడి రథంపై హనుమంతుడు ఉండి భారత యుద్ధంలో విజయానికి ప్రేరకమయ్యాడు. ఇలా విజయుడికి వరమిచ్చిన స్వామి ప్రసన్నాంజనేయుడు.

వింశతి భుజాంజనేయ

శ్రీరామ పట్టాభిషేకం తర్వాత జరిగిన సంఘటన ఇది. ‘బ్రహ్మదేవుడు కోరడంతో నా ముద్రికను అతనికి ఇచ్చాను. కానీ, సీతాదేవి ఆ ముద్రిక కావాలంటోంది. వెంటనే ఆ ముద్రికను తీసుకురావాలని’ రాముడు హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. రామాజ్ఞతో బ్రహ్మలోకం చేరుకున్న హనుమంతుడు వచ్చిన పనిని బ్రహ్మదేవుడికి వివరించాడు. ఆ ముద్రికను తిరిగి ఇవ్వనన్నాడు బ్రహ్మ. కోపం పట్టలేని హనుమ మొత్తం బ్రహ్మలోకాన్నే పెళ్ళగిస్తానంటూ తన ఆకారాన్ని పెంచి విశ్వరూపాన్ని ధరించాడు. తరువాత అక్కడి నుంచి వచ్చిన ఆంజనేయుడు బ్రహ్మలోకం గురించి రాముడి తల్లి కౌసల్యకు వివరించాడు. తన ప్రాణసఖుడైన హనుమ అంతగా ముచ్చటపడటంతో ‘భవిష్యత్‌బ్రహ్మ’గా నియమిస్తూ రాముడు హనుమకు వరమిచ్చాడు. ఈ సందర్భంగా హనుమ ధరించింది వింశతి భుజాంజనేయావతారం.

అష్టాదశ భుజాంజనేయ

ఎన్నో మంత్రాలు ఉపాసన చేసినా తృప్తి చెందని దూర్వాస మహాముని చివరగా హనుమన్మంత్రాన్ని ఉపాసన చేస్తాడు. పద్ధెనిమిది భుజాలతో ఉన్న స్వరూపంతో స్వామిని ధ్యానిస్తూ చేసిన తపస్సు ఫలితంగా హనుమంతుడు అదే రూపంతో దూర్వాసుడికి ప్రత్యక్షమవుతాడు. ఇదే అష్టాదశ భుజాంజనేయావతారం.

సువర్చలాంజనేయ

కుండిన నగరంలో ధ్వజదత్తుడనే వేదవేదాంగవేత్త ఉండేవాడు. ఉపాదానంతో వచ్చిన కొద్దిపాటి ధాన్యంతోనే జీవించేవాడు. భార్యాబిడ్డల్ని పోషించుకోలేక అవస్థలు పడేవాడు. తన దుస్థితిని పోగొట్టుకునే మార్గం వెదకుతూ పుష్కరుడనే మహర్షిని ఆశ్రయించాడు. మహర్షి ఉపదేశం ప్రకారం హనుమంతుడి మంత్రాన్ని ఉపాసన చేశాడు. ధ్వజదత్తుడి తపస్సుకు మెచ్చిన హనుమంతుడు సువర్చలాదేవితో సహా ప్రత్యక్షమై ధ్వజదత్తుడికి అనేక వరాలు అనుగ్రహించాడు. ఇలా ధ్వజదత్తుడికి ప్రత్యక్షమైన మూర్తి సువర్చలాంజనేయ అవతారంగా లోకప్రసిద్ధి పొందింది.

పంచముఖ ఆంజనేయ

రావణ సంహారం అనంతరం జరిగిన సంఘటన ఇది. సముద్రం మధ్యలో ఉన్న ప్రతాపలంక రాజధానిగా ‘శతకంఠు’డనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అతడి బాధలు పడలేక వారంతా రాముడికి మొరపెట్టుకున్నారు. వారికి అభయమిచ్చిన రాముడు సీతాలక్ష్మణ హనుమంతులతో సహా శతకంఠుని మీద యుద్ధానికి వెళ్లాడు. శతకంఠుని అస్త్రాల ధాటికి రామలక్ష్మణులు మూర్ఛపోయారు. దీంతో అశరీరవాణి సీతాదేవికి పంచముఖ హనుమన్మహావిద్య ఉపదేశించింది. మహాకాళీ స్వరూపంతో పంచముఖ హనుమను అధిష్టించి శతకంఠునితో పోరాడం చేయమని చెబుతుంది. అలాగే సాక్షాత్కరించిన హనుమను అధిరోహించిన సీతాదేవి శతకంఠునితో తలపడి అతన్ని ఓడించింది. ఈ అవతారంలో హనుమ వానర, నారసింహ, గరుత్మంత, హయగ్రీవ, సూకర ముఖాలతో దర్శనమిస్తాడు. ఈ అవతారంలో పదిచేతులతో పది ఆయుధాలను ధరించి ఉంటారు. ఒక్కో ముఖానికి మూడుకన్నులు చొప్పున మొత్తం పదిహేను నేత్రాలు ఉంటాయి. ఈ రూపం సర్వశత్రు వినాశకరం. ఈ అవతారానికి అటు మంత్ర శాస్త్రపరంగా ఇటు యోగవిద్యపరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ద్రష్టలైన ఋషీశ్వరులెందరో పంచముఖాంజనేయుని ఉపాసన చేశారు.

చతుర్భుజాంజనేయ

అభయ, వరద హస్తాలతో పాటు ఒక చేతిలో అరటిపండు ధరించి, మరొక చేతిని సువర్చలాదేవి మీద వేసినట్లు కనిపించే అవతారం ఇది. గంగానదీతీరంలోని బార్హస్పత్యపురం గ్రామంలో కపిలుడనే పండితుడు ఉండేవాడు. నిత్యం గంగానదిలో స్నానం చేసి, ఆ తీరంలోనే హనుమన్మంత్రాన్ని ఉపాసన చేస్తుండేవాడు. కపిలుడి భక్తికి మెచ్చిన హనుమంతుడు నదీతీరంలోనే నాలుగు భుజాలతో, సుగ్రీవుడు మొదలైన పరివారంతో ప్రత్యక్షమై, కపిలుడికి వరాలు ప్రసాదించాడు. వర ఫలితంగా మోక్షాన్ని పొందిన కపిలుడి భక్తికి నిదర్శనంగా బార్హస్పత్యపురం హనుమంతుడి నివాస స్థానాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది.

ద్వాత్రింశద్భుజాంజనేయ

మాహిష్మతీ పట్టణాన్ని పరిపాలించిన సోమదత్తుడనే మహారాజు గొప్ప యుద్ధవీరుడు. నిత్యం దైవపూజ చేసేవాడు. ప్రజల్ని కన్నబిడ్డల కన్నా మిన్నగా పరిపాలించేవాడు. శత్రువుల కుట్ర కారణంగా రాజ్యాన్ని కోల్పోయి భార్యతో సహా అరణ్యానికి చేరుకుంటాడు. అక్కడ గర్గ మహాముని ఆశ్రయం పొంది, మహర్షి ఉపదేశం ప్రకారం హనుమంతుడి వ్రతాన్ని ఆచరించి, హనుమంతుడి మంత్రాన్ని ఉపాసన చేశాడు. సోమదత్తుడి తపస్సుకు మెచ్చిన హనుమ 32 భుజాల రూపంతో దర్శనమిచ్చాడు. ఇదే ద్వాత్రింశద్భుజాంజనేయావతారం. పద్మకల్పంలో దేవదానవ యుద్ధంలో కూడా హనుమంతుడు ఈ అవతారంలో ప్రత్యక్షమైనట్లు పురాణగాథలు చెబుతున్నాయి.

వానరాకార ఆంజనేయ

గాలుడనే బోయవాడిని హనుమంతుడు అనుగ్రహించిన అవతారం ఇది. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న గాలుడు పుష్కరుడనే మహర్షిని ఆశ్రయిస్తాడు. గాలుడి గురుభక్తిని చాలాకాలం పరీక్షించిన తర్వాత పుష్కరుడు హనుమంతుని అనుజ్ఞతో అతడికి హనుమన్మంత్రోపదేశం చేస్తాడు. గురు అనుగ్రహంతో మంత్రజపం వెంటనే సిద్ధించి, పాపకర్మ ఫలితంగా వచ్చిన వ్యాధుల నుంచి గాలుడు విముక్తి పొందుతాడు. ఈవిధంగా గాలుడుని అనుగ్రహించిన అవతారమే వానరాకార ఆంజనేయావతారం.


హనుమాన్‌ అనే శబ్దానికి ‘జ్ఞానవాన్‌’ అనే అర్థం ఉంది. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అనే అర్థం కొన్ని నిఘంటువుల్లో కనిపిస్తుంది. ‘హనువు’ అంటే ‘దవడలు’ అనే అర్థం కూడా వాడుకలో ఉంది. ‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, ఉ, మ’ కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. అంటే, హనుమంతుడు ప్రణవస్వరూపడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

9 మూర్తులా...

వివిధ సందర్భాల్లో హనుమ మొత్తం తొమ్మిది అవతారాలు ధరించారు. ఇవే హనుమన్నవావతారాలుగా ప్రసిద్ధి పొందాయి. పరాశర సంహితలో ఇందుకు సంబంధించిన విషయాలున్నాయి.


- కప్పగంతు రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని